Pages

మతంతో సైన్స్‌ ఎందుకు విభేదిస్తుంది?

               - డా|| దేవరాజు మహారాజు 

          సైన్స్‌ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తోందని ఎవరో అంటే- ఓ మత ప్రేమికుడికి ఒళ్లు మండిందట! 'ఏం? మతాలేం తక్కువ తిన్నాయా? కొత్త కొత్త దేవుళ్లను సృష్టించుకోవడం లేదా? పాత సంప్రదాయాలను అనేక రకాలుగా మార్చుకుని, కొత్తవి ఏర్పరచుకోవడం లేదా?' అని గద్దించాడట! నిజమే కదా! మనుషులు మాత్రమే మతాలు పాటిస్తారు. మత మార్పిడిలు చేసుకుంటారు-అని అనుకున్నామే గాని, మనుషులు దేవుళ్లను కూడా మార్చుకోగలరు. యూదుల దేవుడు యెహోవాను విడగొట్టే కదా-ముస్లింలు, క్రైస్తవులు ఏర్పడ్డారు. బుద్ధుని బోధనలేవో బాగున్నాయని అనిపించే కదా-హిందువులు ఆయన్ని దశావతారాల్లో చేర్చుకున్నారు. సమాజంలో అతి నిరాడంబరంగా జీవించిన షిరిడీ సాయిబాబకు లేని శక్తులాపాదించి, వెండి, బంగారు కిరీటాలు పెట్టి, హిందూ దేవుణ్ణి చేశారు. పూజారులు సంస్కృత శ్లోకాలతో పూజలు చేస్తున్నారు. సాయంత్రం కాగానే హారతి, భజన, హుండీలో డబ్బులు వెరసి, అంతా ఓ వ్యాపారం. దానికి మళ్లీ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం. మత మార్పిడి మనుషుల్లోనే కాదు, దేవుళ్లలో కూడా చేశామని తెలుస్తూనే ఉంది. అంటే ఇవన్నీ మతాల్లో జరిగిన నిత్య నూతన పరిణామాలన్నమాట!

దేశ స్వాతంత్య్ర పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు బాలగంగాధర తిలక్‌, హిందువుల్ని సంఘటితం చేయడానికి గణేష్‌ మండపాల్ని ఉపయోగించుకున్నారు. హిందూ ముస్లింల సమైక్యతను కాపాడడానికి గాంధీ 'ఈశ్వర్‌ అల్లా తేరో నామ్‌'ను ఉపయోగించుకున్నారు. వీళ్లు మతాన్ని ప్రచారం చేయలేదు. జనంలో ఉన్న మత భావనని ఉపయోగించుకొని, జనం దృష్టిని స్వాతంత్య్ర పోరాటం వైపు మరల్చారు. అవే ఇప్పుడు ఎంతటి వెర్రి తలలు వేస్తున్నాయో చూస్తున్నాం. గణేష్‌ మండపాల్లో డిస్కో డ్యాన్సులు, సెక్సీ పాటలు మామూలు అయిపోయాయి. వీరికి భక్తి భావన ఉండదు. సంప్రదాయం పట్ల గౌరవమూ ఉండదు. ఆధునికత పట్ల అవగాహనా ఉండదు. ఇదంతా దేవుడి పేరుతో సాగే విశృంఖలత్వం. చందాలు వసూలు చేసుకుని తాగి తందనాలాడే గ్రూపులు కొన్ని. నేపథ్యంలో సాగుతున్న భయంకర వ్యాపారం.. దందా..అయితే దానికి సంస్కృతి, సాంప్రదాయం అని ముద్దు పేర్లు పెడతారు. మత సహనం అనే భావాన్ని కాళ్ల కింద తొక్కి పెట్టి, ప్రభుత్వాలే మత కలహాలను ప్రేరేపిస్తున్నాయి. అందుకే కదా మతం పేరుతో హత్యలు, కుటుంబ గౌరవం పేరుతో కుల- మతాంతర ప్రేమికుల హత్యలు జరుగుతున్నాయి. మత మౌఢ్యంతోనే కదా నర బలులు జరుగుతున్నాయి. మత స్వాముల-బాబాల గుడారాల్లో స్త్రీల జీవితాలు చితికిపోతున్నాయి. అయితే అన్ని వేళలా అన్ని రకాల దోషుల్ని సైన్స్‌ మాత్రమే పట్టిస్తోందన్నది గమనించాలి. ఏడు దశాబ్దాలుగా రామ జన్మభూమి, బాబ్రీ మసీదు సమస్యను ప్రభుత్వాలు తాజాగా ఉంచగలుగు తున్నాయి. సమస్య సమస్యలాగా ఉండిపోతేనే, జనం వివేకవంతులు కాకుండా ఉంటేనే-వాళ్లు కేవలం ఓట్లేసే గొర్రెలుగా ఉంటేనే రాజకీయాలు రాజ్యమేలుతుంటా యన్నమాట! ఇవన్నీ మతం నూతన ఆవిష్కరణలే!

సైన్సుకు మతానికి, సైన్సుకు ఆధ్యాత్మికతకు ఏదో సంబంధం ఉందని మాయ మాటలు చెప్పే పిచ్చివాళ్లు కొందరుంటారు. నిజానికి అలాంటిదేమీ లేదు. ఇవి ఒకదాని కొకటి పూర్తి వ్యతిరేకంగా పని చేసేవి. సైన్స్‌ జనాన్ని ఊహల్లో, భ్రమల్లో ఉంచదు. జనాన్ని విడగొట్టదు. సైన్సు ఫలితంగా ఒక కొత్త మందు లేదా కొత్త వస్తువు వాడుకలోకి వచ్చిందంటే, అది సర్వ మానవాళికి అందుతుంది. కాని, తమ దేశం వారికి, తమ ప్రాంతం వారికి, లేదా తమ మతస్తులకు-తమ కులస్తులకు మాత్రమే అందుబాటులోకి రావాలని అది కోరుకోదు. సైన్సు జనంలో ద్వేషం రగిలించదు. మత కలహాల వలె సైన్సు కలహాలు చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. మన కళ్ల ముందు కూడా జరగడం లేదు. సైన్సుకు మతంతో అవసరముంది అని ఏ దిక్కుమాలిన శాస్త్రజ్ఞుడూ చెప్పలేదు. అయితే సైన్సును అంగీకరిస్తూనే దాని మూల సూత్రాన్ని, స్ఫూర్తిని పక్కకు నెట్టి, సైన్సును పూర్తిగా ఉపయోగించుకుంటూ తమ మత మౌఢ్యాన్ని ప్రచారం చేసుకుంటున్న మత గురువులు, మత బోధకులు మత ప్రవచనకారులు ఎంతోమంది ఉన్నారు. మన కళ్ల ముందే కనబడుతున్నారు. మనిషిలో మంచీ చెడూ ఉన్నట్లు గానే సమాజంలో సైన్సూ-మతమూ ఉన్నాయి. గణితంలో ప్లస్‌ గుర్తూ మైనస్‌ గుర్తూ ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో ధన విద్యుత్‌/రుణ విద్యుత్‌లు ఉన్నాయి. చెప్పొచ్చేదేమంటే సైన్స-ప్లస్‌ గుర్తు! మతం-మైనస్‌ గుర్తు! మనిషిలోని మంచి-సైన్సు! చెడు- మతం! బ్యాంకు ఖాతాలో క్రెడిట్‌- డెబిట్‌లు వుంటాయి. క్రెడిట్‌ అయ్యింది సంవృద్ధిగా వుంటే, వాళ్లు సంపన్నులుగా వుంటారు. డెబిట్‌లు ఎక్కువయిన వాళ్లు దివాలా తీస్తారు. మానవ జీవితంలో సైన్సు-క్రెడిట్‌ కావడం లాంటిదైతే, మతం-డెబిట్‌ కావడం లాంటిది! ఇక్కడ క్రెడిట్‌ డెబిట్‌లు డబ్బుకు సంబంధించిన అంశాలు కాదు. మానవీయ విలువలకు సంబంధించినవి.

సృష్టిలోని జీవరాసులన్నీ దైవభావనతో సంబంధం లేకుండా బతుకుతున్నాయి. మనిషి మాత్రమే దేవుడనే అవివేకపు నమ్మకం దగ్గర ఆగిపోయాడు. అయితే మనిషి అదికూడా గ్రహించుకున్నాడు. పైగా సరిచేసుకునే దిశలో ముందుకు నడుస్తున్నాడు. కోటానుకోట్ల జీవుల మధ్య ఒకడైన మనిషి తన మేధస్సులోనే ఈ 'బ్లూ ప్లానెట్‌'పై ఆధిపత్యం సాధించిన మనిషి, విశ్వాంతరాళాల్ని శోధిస్తున్న మనిషి-తన తప్పు తాను తెలుసుకోలేడా? కొంత సమయం పట్టినా తప్పక తెలుసుకుంటాడు. సైన్స్‌, ఈ రోజు ప్రకృతి రహస్యాలన్నింటికీ జవాబు చెబుతున్నా, వాటన్నింటినీ పక్కనబెట్టి ఎప్పుడో అనాది కాలంలో తమ పూర్వీకులు రూపొందించిన దేవుడికి చెక్క భజనలు చేస్తారా? ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోలేని ఆది మానవుడి కల్పనలకే ప్రాముఖ్యమిస్తారా? ఇవ్వరు గాక ఇవ్వరు. బూజు పట్టిన సనాతన భావజాలంలోంచి తాము బయట పడుతూ, రాబోయే తరాల్ని దానికి దూరంగా పెంచుకుంటారు. కేవలం మానవీయ విలువలకే ప్రాధాన్యమిస్తారు. ప్రశ్నించే తత్వమే సైన్సు నూతన ఆవిష్కరణలకు కారణభూతమవుతోందని తెలిసిన ఆధునికుడు, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తాడే గాని, అణచిపెట్టడు. ప్రశ్నను అణచేస్తే జాతి పురోగమించదు. ఒకనాటి చక్రవర్తులకైనా సరే, నేటి సామాన్యుడికి ఉన్న సౌకర్యాలు లేవన్నది మనం గమనించాలి. జన జీవితంలో ప్రతిభావంతమైన ఈ మార్పు దేనివల్ల వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. కచ్చితంగా అది సైన్సు వల్ల వచ్చిందే!

పాలు తాగే మనిషే బ్రాందీ, విస్కీ తాగుతున్నాడు. నీతిమంతుడైన మనిషే అవినీతికి పాల్పడుతున్నాడు. ప్రజల్ని రక్షించాల్సిన పరిపాలకుడే వారిని భక్షిస్తున్నాడు. లేదా శిక్షిస్తున్నాడు. ఇతరులకు సహాయ పడుతున్న మనిషే, ఇతరులను చంపుతున్నాడు. స్త్రీని గౌరవించే మనిషే స్త్రీలను చెరుస్తున్నాడు. కొంతమంది పరిశోధనల్లో నిమగమై నూతన ఆవిష్కరణలు చేస్తుంటే చాలామంది వాటిని అనుభవిస్తూ, మతం-దేవుడు అనే మూఢత్వంలో ఉండిపోతున్నారు. నిప్పును కనుక్కుని, వ్యవసాయం ప్రారంభించి, పశుపోషణ చేస్తూ పంటలు పండించిన మనిషే దేవుడనే భావనకు రూపమిచ్చి తనను తాను దిగజార్చుకున్నాడు. ఎందుకిలా జరిగిందీ అంటే ఇది మనిషిలోని ప్లస్‌/మైనస్‌ల పోట్లాట. ధన విద్యుత్‌, రుణ విద్యుత్‌ల మధ్య ఘర్షణ. సైన్సుకు-మతానికీ జరుగుతూ వస్తున్న భీకర పోరాటం!

'మత విశ్వాసాలు మనిషిని మూర్ఖునిగా తయారు చేస్తాయి' అని ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, రిచర్డ్‌ డాకిన్స్‌, అబ్రహం థామస్‌ కోవూర్‌, పెరియార్‌ ఇవి రామస్వామి లాంటి గొప్పవాళ్లెంతో మంది చెప్పారు. అది నిజమేనని దేశ ప్రధానితో పాటు కొందరు కేంద్ర మంత్రులు రుజువు చేశారు. తాజాగా 'పంచాంగం -కచ్చితమైన శాస్త్రమని' తెలంగాణ ముఖ్యమంత్రి ఆ కోవలో చేరిపోయారు. ఏ మతాన్ని అనుసరించకపోయినా, ఏ దేవుణ్ణీ ప్రార్థించక పోయినా జరిగే నష్టం గాని, ప్రమాదం గానీ ఏమీ లేదు. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. హిందూ మతాన్ని అనుసరించని క్రైస్తవులకు, ముస్లింలకు, బౌద్ధులకు, జైనులకు హిందూ దేవుళ్ల వల్ల అపాయం లేదు. అలాగే క్రైస్తవాన్ని నమ్మని హిందూ, ముస్లిం ఇంకా ఇతర మతాల వారికి క్రైస్తవుల దేవుడి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. నష్టమూ లేదు. ముస్లిం దేవుడు అల్లాను నమ్మని ఇతర మతస్తులకు ఆయన ఏమో చేస్తాడన్న భయం లేదు. ఇదంతా విశ్వాసాలకు నమ్మకాలకూ సంబంధించింది. అందుకే, మత విశ్వాసాలు లేకపోయినంత మాత్రాన జరిగే ప్రమాదాలు లేవు. విశ్వాసమున్నంత మాత్రాన జరిగే మంచీ లేదు. రుజువు లేని నమ్మకాలకు, భ్రమలకు విలువ వుండదు.

(రచయిత సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌,

సెల్‌ : 9573706806)

మతరహిత ప్రజలు దేశాల వారిగా ఈ విధంగా ఉన్నారు...

ఎస్తోనియా-76.5శాతం, జపాన్‌-76శాతం; డెన్మార్క్‌-72 శాతం; స్వీడన్‌-64శాతం; వియత్నాం-62,5 శాతం;
మకాల్‌-60.9శాతం; జెక్‌ రిపబ్లిక్‌-57.5శాతం; హాంకాంగ్‌- 57శాతం; ఫ్రాన్స్‌-53.5శాతం; నార్వే-51.5శ ాతం,
చైనా-47శాతం; నెదర్లాండ్‌-47శాతం; ఫిన్లాండ్‌-44 శాతం; ఇంగ్లాండు-41.5శాతం; దక్షిణ కొరియా-41శాతం;
జర్మనీ-40శాతం; హంగరి-39శాతం; బెల్జియం-38.75 శాతం; బల్గేరియా 37శాతం; సోమేనియా-36.15శాతం; న్యూజిల్యాండ్‌-34.7శాతం; రష్యా-30.5శాతం; అమెరికా- 20శాతం.

ఇంతకూ మన భారతదేశంలో మతరహిత జనాభా ఎంత అని ఆతురతగా వెతుక్కునే వారి కోసం...

 భారతదేశంలో మతరహిత ప్రజలు 0.6శాతం...

 ఈ వివరాలన్నీ ఇవ్వడం ఎందుకంటే ప్రపంచదేశాలలో మనమెక్కుడున్నామన్నది బేరీజు వేసుకోవడానికి...

దేవుడు-దయ్యాల భావనల్లోంచి, సంప్రదాయం, ఆచారాల పేరుతో మూఢనమ్మకాల కొనసాగింపులోంచి బయటపడి, ఇకనైనా ఆధునిక వైజ్ఞానిక సమాజానికి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి...

***నవంబర్‌ 6, 2015న 'ద గార్డియన్‌' ఇంగ్లీషు పత్రిక ఈ విధంగా ప్రకటించింది***

''మత రహిత సంస్కృతి, ప్రజాస్వామిక వాతావరణం ఉన్న కొన్ని దేశాల్లో నేరాల శాతం తగ్గి, కొన్ని జైళ్ళు కూడా మూసేస్తున్నారు...

 అంతే కాదు, ప్రపంచ దేశాల్లో జరిపిన ఒక సర్వే ప్రకారం ,  మతాన్ని ఆచరించే కుటుంబాల పిల్లలతో పోల్చినప్పుడు...

 వారి కంటే మతరహిత కుటుంబాల పిల్లలు దయగల వారుగా, నైతికంగా పద్ధతి గలవారుగా ఉన్నారని వెల్లడించింది...

అంటే, 'దేవుడున్నాడు అన్న భావన ప్రజల్ని నైతికంగా మంచి దారిలో ఉంచుతుంది' అన్న వాదనకు ఈ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి...

ఈ కాలంలో తెలివి తేటల్ని ఐక్యూ లెవెల్స్‌తో కొలుస్తున్నాం...
ఐక్యూ అంటే ఇంటిలిజెంట్‌ క్వొటియెంట్‌ లెవెల్స్‌...

ఇవి దేవుణ్ణి నమ్మే వారిలో నమ్మనివారిలో ఎలా ఉన్నాయి అనే పరిశీలన జరిగింది , దాని ఫలితం ఏమొచ్చిందంటే ...

నాస్తికుల ఐక్యూ లెవెల్స్‌ 115-125 మధ్య ఉంది. ఇంకొందరిలో 125 కంటే ఎక్కువగా కూడా ఉంది...

అదే ఆస్తికుల విషయానికొస్తే అది 85-115 మధ్య ఉంది. మరికొందరిలో ఇంకా తక్కువగా 75 మాత్రమే ఉంది...

మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని సరాసరి గనక లెక్కగడితే, 90శాతం మంది జనం ఐక్యూ 85-115 మధ్య ఉంది...

ఆపైన ఉన్నవారు 5శాతమైతే, 85కు తక్కువ మరో 5శాతం మంది ఉన్నారు...

దీనివల్ల కూడా ఒక విషయం తేటతెల్లమౌతోంది...
దైవభ్రాంతి, దైవచింతన వున్నవారి ఐక్యూ తక్కువగా వున్నదని...

 మనిషి సృష్టించుకున్న అతి భయంకరమైన భావన ఏమిటంటే అది దేవుడే...
అందులోంచి బయటపడాల్సింది మనిషే...

 ఖండాంతరాలను అధిగమించిన మానవుడు, పర్వతాలను దాటిన మానవుడు సముద్రాలను దాటిన మానవుడు, రోదసీ జయించిన మానవుడు...

తన మూఢనమ్మకాలను తనే వదిలించుకోక పోవడం / వదిలించుకోవాలని భావించక పోవడం చాలా విచారకరం.

సౌ జ న్య  o - whatup message