Pages

మూఢనమ్మకాలు - జ్ఞానం


మూఢనమ్మకాల స్థానంలో జ్ఞానం నింపాలి.-నార్లేకర్  

మన భారతీయ సమాజంలో చదువుకున్నవారు, చదువుకోనివారు అందరూ ఏ మాత్రం తేడా లేకుండా మూఢనమ్మకాల ప్రభావంలో పూర్తిగా కొట్టుకుపోతున్నారు. అయితే ఇందులో కొంచెం తేడా ఉంది. విద్యావంతుల మూఢనమ్మకాలు కొంచెం నాజుకుగా, ఉన్నతంగా కనిపిస్తాయి.

చదువులేనివారివి మోటుగా, కరుకుగా ఉంటాయి. ఏమైనా అన్నీ మూఢనమ్మకాలే! ఆ మూఢనమ్మకాల స్థానంలో కొంత జ్ఞానాన్ని ప్రతిష్టించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈ ప్రయత్నంలో వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళ కింద జమకట్టేయ్యొచ్చు. అయినా కూడా వైజ్ఞానిక సమాజ నిర్మాణం కోసం, మన ప్రయత్నం ఆపకూడదు. వాళ్ళ నమ్మకాలెంత మూర్ఖమైనవోనన్న విషయాలు నేరుగా చెప్పకుండా, మెల్లగా ఈ ప్రపంచ రహస్యాల్ని విశేషాల్ని చెప్పడం మొదలు పెట్టాలి. వాస్తవాలు ఎదురుగా పెట్టి, ఆలోచించుకునే అవకాశాన్ని వారికి ఇవ్వాలి.


వాస్తవాల్ని తెలుసుకున్న తర్వాత కూడా కొంతమంది వెనక్కి తిరిగి మళ్ళీ మూఢనమ్మకాల్లోకి పోవచ్చు. అప్పుడు వాళ్ళకు ప్రయోగాత్మకంగా కొన్ని విషయాలు చేసి చూపాల్సి ఉంటుంది. ఇది నమ్మండి. ఇది నమ్మకండి అని నేరుగా చెప్పే బదులు - ఇది చేసి చూడండి. అది గమనించండి. ఇది చదవండి అని చెపుతూ, వాళ్ళలో ఉత్సుకత పెంపొందించడమే మనం చేయాల్సిన పని. మార్పు క్రమ క్రమంగా దానంతట అదే వస్తుంది. అయితే అదంత సులభమైన పనేమీ కాదు కానీ, అసాధ్యం కూడా కాదు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, భారత ఐన్‌స్టీన్‌గా ప్రసిద్ధి పొందిన ఆస్ట్రోఫిజిస్ట్‌ పద్మ విభూషణ్‌ డాక్టర్‌ జయంత్‌ విష్ణు నార్లేకర్‌. సమకాలీన వైజ్ఞానిక ప్రపంచంలో మన దేశం తలెత్తి చెప్పుకోగలిగే పేరు.


బ్లాక్‌ హోల్స్‌ మీద, టఖియాన్స్‌ మీద పరిశోధనలు చేసిన ఈ వైజ్ఞానికుడు, తన ఇరవై ఆరవ ఏటనే అత్యుద్భుతమైన ప్రతిభ కనబరిచి, భూమ్యాకర్షణ శక్తిమీద కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది విజ్ఞాన జగత్తును విశేషంగా ఆకర్షించింది. అందుకే 1964లోనే భారతదేశపు ఐన్‌స్టీన్‌గా ప్రశంసలందుకున్నారు.

ఇంగ్లీషు, హిందీ, మరాఠీ భాషలలో పుస్తకాలు రాసిన ఈ శాస్త్రవేత్త, వైజ్ఞానిక - సాహిత్య రంగాల మధ్య వారధిగా నిలిచారు. మరాఠీలో రాసుకున్న తన ఆత్మకథ 'చార్‌ నగరంతలె మాజె విష్ణు'కు 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మూడు భాషల్లో సుమారు పది సృజనాత్మక రచనలు చేసిన నార్లేకర్‌, సరళ వైజ్ఞానిక గ్రంథాలు సుమారు ఇరవై దాకా ప్రకటించారు. ఇవన్నీ ఇంగ్లీషులో కాస్మోలజీపై ప్రకటించినవి.

జయంత్‌ విష్ణు నార్లేకర్‌ 1938 జులై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించారు. వారి కుటుంబమే గణికుల కుటుంబం. పూర్వీకులంతా గణిత శాస్త్రంలో ఉద్ధండులు. నార్లేకర్‌ మేనమామ ఆ రోజుల్లో గణిత పండితుడిగా ప్రఖ్యాతుడు. అతని దగ్గరైతే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడని, తల్లిదండ్రులు అతణ్ణి మామగారింట్లో ఉంచారు. ఆ మామగారు పొద్దున్నే లేచి నల్లబల్ల మీద ఒక లెక్క రాసి ఉంచేవారు.

తంటాలు పడి నార్లేకర్‌ రాత్రివరకు ఆ లెక్కపూర్తి చేయాల్సిందే. లెక్కలు, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఇంట్లో ఎప్పుడూ చర్చనీయాంశాలు అవుతుండేవి. బాల్యంలో లభించిన ఆ వాతావరణం నార్లేకర్‌పై ఎంతో ప్రభావం చూపింది. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి తన పందొమ్మిదో యేట బీయస్సీ (1957) సాధించి, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి తన ఇరవై అయిదేయేట యంఎస్సీ, పీహెచ్‌డీ డిగ్రీలు సాధించారు. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు. భారతదేశంలోని చాలా మంది విద్యార్థులు చాలా విశ్వవిద్యాలయాల నుంచి ఇలాంటి డిగ్రీలు చాలా పొందారు.

అయితే నార్లేకర్‌ గొప్పతనమేమిటీ అంటే.. కేంబ్రిడ్జ్‌ కింగ్స్‌ కాలేజీలో సర్‌ ఫ్రెడ్‌ హోరులీ దగ్గర పరిశోధక విద్యార్థిగా చేరడం, తర్వాత ఆయనతో కలిసి చాలా కాలం పనిచేయడం, సహరచయితగా ఆయనతో పాటు కలిసి పుస్తకాలు రాయడం చేశారు. అంతే కాదు, పరిశోధక విద్యార్థిగానే 1962లో స్మిత్‌ ప్రెయిడ్‌ గెలుచుకుని, అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. పరమాణువు అంతటి ఒక వస్తువు పెద్ద శబ్దం చేస్తూ విచ్ఛిన్న మవడం వల్ల, ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, న్యుబులేల వంటివి ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞుల నమ్మకం.

కానీ నార్లేకర్‌ అందుకు భిన్నంగా స్టడీ స్టేట్‌ థియరీ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పదార్థం నక్షత్రాలుగా, గెలాక్సీలుగా, ఇతర ఆకారాలుగా విశ్వమంతా సమానంగా వ్యాపించి ఉంది. ఒక వేళ గెలాక్సీ కదలిక వల్ల తీవ్రమైన వేగం వల్ల ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వాటిని కొత్తగా ఏర్పడ్డ పదార్థం పూరిస్తూ ఉంటుంది. స్టడీ స్టేట్‌ థియరీతో పాటు, తన పరిశోధన గురువు సర్‌ ఫ్రెడ్‌ హొయత్‌తో కలసి, గురుత్వాకర్షణపై కూడా నార్లేకర్‌ కృషి చేశారు.

నార్లేకర్‌ 1972లో భారతదేశం తిరిగి వచ్చి, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)లో ఆస్ట్రోఫిజిక్స్‌ - ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ చాలా కాలం పనిచేశారు. బ్లాక్‌ హోల్స్‌ కంటే, వెలుతురు కణాల కంటే కూడా వేగంగా ప్రయాణించగల 'టకియాన్స్‌'పై తన పరిశోధనలు చేస్తూ, తన విద్యార్థులతో కూడా చేయించారు. 1988లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పూనేలో ప్రారంభించిన ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ స్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐయూసీఏఏ)కి వ్యవస్థాపక సంచాలకుడిగా పనిచేశారు.

కొంత కాలం (ఎన్‌సీఈఆర్‌టి) సలహా సంఘానికి ఛైర్మన్‌గా ఉన్నారు. 1986-90 మద్య కాలంలో నాలుగేండ్ల పాటు భారత ప్రధానికి సైన్స్‌ సలహాదారుగా ఉన్నారు. 1994లో కాస్మాలజీ కమిషన్‌ ఆఫ్‌ ది ఇంటర్నేషనల్‌ ఆస్ట్రానమికల్‌ యూనియన్‌కు సభ్యుడిగా ఎన్నికై దేశ గౌరవం ఇనుమడింపజేశారు. 1995లో ఇందిరాగాంధీ సైన్స్‌ పాపులర్‌ సైన్స్‌ అవార్డు, 1996లో డాక్టర్‌ జరిగ్రైగార్‌ తో కలిసి కళింగ అవార్డు స్వీకరించారు.

ఒక చెంచా వెడల్పుగల బ్లాకహేోల్‌ బరువు కొన్ని టన్నులుంటుంది. దాని ఉపరితలం నుంచి కనీసం వెలుగురేఖల్ని కూడా అది పోనీయదు. నార్లేకర్‌ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బట్టి బ్లాకహేోల్‌ టకియన్స్‌ని తనలో ఇముడ్చుకుని, అంటే పీల్చుకుని తన ఉపరితల వైశాల్యాన్ని తగ్గించుకో గలుగుతుంది. అందువల్ల టకియన్స్‌ని వెతకడం అంటే తగ్గిపోతున్న బ్లాకహేోల్స్‌ని వెతకడమే. ఆయన ఏండ్లకేండ్లు చేపట్టిన పరిశోధనలన్నీ ఈ విషయాలపైనే ఉన్నాయి. ఇంత క్లిష్టమైన అంశాలపై పరిశోధనలు చేసి, వైజ్ఞానిక రంగానికి ఎంతో మేలు చేకూర్చిన ఈ శాస్త్రవేత్త, కేవలం ఆపరిధిలోనే ఉండిపోలేదు. తను సంపాదించుకున్న జ్ఞానం సామాన్యుడికి కూడా అందాలన్న మహాదాశయంతో సరళ వైజ్ఞానిక రచనలెన్నో చేశారు.

ఉదాహరణకు నీలి మేఘాల నుంచి కృష్ణ బిలాల దాకా''(FROM BLACK CLOUDS TO BLACH HOLES -2012), ''విశ్వనిర్మాణం'' (STRUCTURE OF UNIVERSE - 1977), ''భూమ్యాకర్షణశక్తి గురించి కొన్ని సరదా సంగతులు'' (THE LIGHTER SIDE OF GRAVITY -1982) అలాగే సామాజిక కోణంలో వైజ్ఞానిక శాస్త్రాల తత్వమేమిటన్నది కూడా (PHOLOSOPHY OF SCIENCE PERSPECTIVE FROM NATURAL AND SOCIAL SCIENCE _1992)  విపులంగా రాశారు. అందరి శాస్త్రవేత్తల్లా కాకుండా ఈయన తన వాస్తవ దృష్టి కోణంలోంచి సామాన్యుడికి జ్ఞానం అందించాలని తహతహలాడారు.

ఎంత గొప్ప శాస్త్రవేత్తో అంత గొప్ప సైన్సు రచయిత కూడా కావడం వల్ల, ప్రపంచ పాఠకులకు ఎంతో మేలు జరిగింది. ఇవన్నీ కాకుండా మరోవైపు పూర్వకాలం నుంచి ఆధునిక కాలం వరకూ ఉన్న మన వైజ్ఞానికుల గురించి విపులంగా రాశారు. కావల్సిన వారు  INDIAN SCIENTISTS FROM VEDIC TIMES TO MODERAN TIMES 2003 చదువుకోవచ్చు. అయితే ఇది ''వైజ్ఞానిక అంచు'' (SCIENCE EDGE) పేరుతో వెలువడింది. సర్‌ ఫ్రెడ్‌ హొయలీతో కలిసి రాసిన ''ఫిజిక్స్‌-ఆస్ట్రానమీ ఫ్రాంటియర్‌ - 1981 ప్రపంచ వ్యాప్తంగా మన్ననలనందుకుంది. ఇవి కాక సాహిత్య పరమైన రచనలు చూస్తే.. అందులో ''వామనుడి తిరుగురాక'' (RETURN OF VAMAN - 1990) అనే ఇంగ్లీషు నవలను ''చూపుకు అవతల'' (PAAR NAZAR KE) అనే హిందీ రచనను చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఒక వైపు తన పరిశోధనలు తాను చేస్తూనే, సైన్సు ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు. ఈయన టెలివిజన్‌ సీరియల్‌ ''యూనివర్స్‌''ని 1995లో దూరదర్శన్‌ ప్రసారం చేసింది. దూరదర్శన్‌లోనే ''సురభి'' అనే కార్యక్రమం వస్తూ ఉండేది. అందులో సంగీత, సాహిత్య విశేషాలతో పాటు వైజ్ఞానిక అంశాల చర్చ కూడా ఉండేది. ఆ సురభిలోనే ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌, ప్రొఫెసర్‌ నార్లేకర్‌లు తరచూ కనబడుతూ ఉండేవారు. ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలిస్తుండేవారు.

మొత్తానికి మొత్తంగా జయంత్‌ నార్లేకర్‌ కుటుంబమే గొప్ప కుటుంబం! ఉన్నత విద్యావంతుల కుటుంబం - ఈయన తండ్రి విష్ణువాసుదేవ్‌ నార్లేకర్‌ బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌. తల్లి సుమతీ నార్లేకర్‌ సంస్కృతి పండితురాలు. భార్య మంగళా నార్లేకర్‌ కూడా పరిశోధకురాలు, ప్రొఫెసర్‌. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు గీత, గిరిజ, లీలావతి. బాల్యంలో నార్లేకర్‌ను గణితం వైపు తిప్పిన మేనమామ. ఆనాటి ప్రసిద్ధ స్టాటిస్టీసియన్‌! ఇక వీరి కుటుంబ సభ్యురాలొకరు అమృతా నార్లేకర్‌ కేంబ్రిడ్జి సోషల్‌ సైన్స్‌స్‌లో ప్రొఫెసర్‌. జీవితంలో తన్నుకుని పైకొచ్చిన మహానుభావులందరికీ గొప్ప కుటుంబ నేపథ్యం ఉండకపోవచ్చు. నార్లేకర్‌కి లభించింది. దాన్ని ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటూ తను ఎదుగుతూ సమాజపు ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తూనే వచ్చారు.

మంచి కుటుంబ నేపథ్యం ఉండి కూడా ఉపయోగించుకోలేక దారి తప్పి, క్రియాశూన్యులైన వారు కూడా ఉన్నారు కదా? ఎన్ని గౌరవాలు లభించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఆయన తన కృషిని ఎప్పుడూ ఆపలేదు. నిత్య శోధకుడిలా, నిత్య విద్యార్థిలా, కొత్త కొత్త పథకాలతో కొత్త దిశలు వెతుకుతున్న జయంత్‌ విష్ణు నార్లేకర్‌ అన్వేషణ ఎప్పుడూ ఎక్కడా ఆగలేదు. ఇది ఆయన ఎనభయ్యవ పుట్టిన రోజు. మృదుభాషి, స్నేహశీలి అయిన నార్లేకర్‌ వ్యక్తిత్వం - పరిశోధన - రచన నేటి యువతరానికి ఆదర్శం కావాలి!
- డాక్టర్‌ దేవరాజు మహారాజు
- సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌
సెల్‌: 9573706806