దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో బాణాసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం కలకలం సృష్టిస్తున్నది. పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించే నిమిత్తం కోర్టు ఈ ఆదేశం జారీ చేసింది. కోట్లాది రూపాయల వ్యాపారం నష్టపోతామని బాణాసంచా వ్యాపారులు గగ్గోలు పెడుతుండగా, మతపరమైన సాంప్రదాయంలో కోర్టు జోక్యమేమిటని మితవాదులు ప్రశ్నిస్తున్నారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు దన్నుగా మహారాష్ట్ర హైకోర్టు, చత్తీస్‌ఘర్ ప్రభుత్వం బాణాసంచా విక్రయాలపై కొన్ని ఆంక్షలు విధించాయి.
మోటారు వాహనాలు విసర్జించే పొగ, హర్యానా తదితర పరిసర ప్రాంతాల్లో ఖరీఫ్ పంట కోతల అనంతరం చేలలో మిగిలిన గడ్డీగాదాన్ని రైతులు తగలబెట్టటం వల్ల వ్యాపించే పొగ రాజధాని ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బాణాసంచా కాల్చటం వల్ల విడుదలయ్యే విషతుల్యమైన రసాయనిక మిశ్రమాల పొగ ఆ కాలుష్యానికి తోడయి పరిస్థితిని దుర్భరం చేస్తుంది. పైగా శబ్దకాలుష్యం కూడా. ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం గత సంవత్సరం ప్రైవేటు వాహనాల రవాణాను నియంత్రిస్తూ ఒకరోజు బేసి సంఖ్య, ఒకరోజు సరిసంఖ్య నెంబర్లున్న వాహనాలను అనుమతిస్తూ ఒక ప్రయోగం చేయటం గుర్తు చేసుకోదగింది. అయితే కాలుష్య నియంత్రణకు సమర్థవంతమైన విధానాలను సంవత్సరం పొడవునా అమలు జరపకుండా, రెండుమూడు రోజులు జరిగే బాణాసంచా పేలుడు వేడుకను నిషేధించటం వల్ల ప్రయోజనమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కానట్లే ఒక వైఫల్యం కారణంగా మరో నియంత్రణను నిరాకరించరాదు. వాతావరణ, శబ్ద కాలుష్యాలవల్ల ప్రజల ఆరోగ్యానికి జరుగుతున్న చేటు కోర్టును ప్రభావితం చేసింది.
బాణాసంచా పేలుళ్లను నిరుత్సాహ పరిచే, నియంత్రించే ప్రయత్నం ఎక్కడో ఒకచోట ఆరంభం కావాలి. అందువల్ల ఢిల్లీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశం ఆహ్వానించదగింది. దాన్ని ఊతంగా తీసుకుని బొంబాయి హైకోర్టు బాణాసంచా విక్రయాలపై ఆంక్షలు విధించింది. బాణాసంచా విక్రయ దుకాణాల లైసెన్సులను సగానికి తగ్గించాలని, నివాస ప్రాంతాల మధ్య దుకాణాలు ఉండరాదని, ఇప్పటికే ఇచ్చిన అటువంటి లైసెన్సులు రద్దు చేయాలని మహానగర పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది.
కాగా చత్తీస్‌ఘర్ పర్యావరణ పరిరక్షణ బోర్డు,125 డెసిబుల్స్ పైన ధ్వనిచేసే బాణాసంచి విక్రయం, పేల్చటాన్ని నిషేధించాలని, రాత్రి 1-0ఉదయం 6గంటల మధ్య టపాసులు కాల్చకుండా చూడాలని, ఆసుపత్రులు, కోర్టులు, మతప్రదేశాలు, విద్యాసంస్థలు ఇతర సున్నిత ప్రదేశాలకు 100మీటర్ల లోపు బాణాసంచా కాల్చకుండా చూడాలని కలెక్టర్లకు, ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విస్తృత ప్రచారం ద్వారా ప్రజల సహకారం తీసుకోవాలని సూచించింది. పంట పొలాల్లో గడ్డి తగలబెట్టకుండా రైతుల్ని చైతన్య పరచాలని కోరింది. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత. అందువల్ల బాణాసంచాపై ఆంక్షలను మతవిశ్వాసంతో ముడిపెట్టరాదు.
కొత్తదుస్తులు, పిండివంటలు, దీపకాంతులతో ఇంటిల్లిపాది వేడుకగా, నిరపాయకరంగా దీపావళి జరుపుకుందాం.
సౌ జ
న్య o - whatup
message