Pages

అజ్ఞానం

స్పల్లన్ జానీ అనే ఇటాలియన్ శాస్త్రవేత్త గబ్బిలాల కళ్లకు గంతలు కట్టి ఒక గదిలో వదిలేశాడు. గదిలో ఇంకా ఎన్నో అడ్డంకులు కల్పించాడు. వెలుతురు లేక పోయినా గబ్బిలాలు గోడల అడ్డు కూడా తప్పించుకుని ఒక మూలనుంచీ ఇంకో మూలకు ఎగరడం గమనించి గుడ్డివాళ్ళకు మల్లే స్పర్శజ్ఞానం మీద ఆధారపడుతున్నాయేమోననుకుని..ఈ సారి శరీరానికిమైనం పూసి చూసాడు.ఐనా గబ్బిలాల ఎగిరే నైపుణ్యంలో తేడా రాలేదు. చెవులు మూసినప్పుడు మాత్రం సరిగ్గా ఎగరలేక అడ్డు వచ్చిన వాటిని ఢీకొట్టి పడి పోయాయి. గబ్బిలాలు ఎగిరేటప్పుడు శ్రవణేంద్రియాలను ఉపయోగిస్తాయని స్పల్లన్ ప్రకటించినప్పుడు "గబ్బిలాలు చెవులతో చూస్తే కళ్ళతో వింటాయా?" అని వెటకారం చేసారు ఆనాటి శాస్త్రజ్ఞులు కూడా!
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..విజ్ఞానశాస్త్రంలో కొత్త విషయం సాధారణమైన నమ్మకాలకు విరుద్ధంగా నిర్ధారణయినప్పుడల్లా.. ఆవిష్కర్తలకు ఇలాంటి సన్మానాలు ఎదురవక తప్పలేదు. ధైర్యంగా నిలబడ్డ వాళ్లకే చరిత్రలో స్థానం దక్కింది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని కనుక్కున్నప్పుడు కూడా బైబిల్ వీశ్వాసులనుంచీ ఎంత ప్రతిఘటన ఎదురైందో ..మనకు తెలిసిందే కదా! సత్యాన్వేషకులను వేధించడంలో ఏ మతం తక్కువ తినలేదు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఆధ్యాత్మికం పేరుతో ఎంత అజ్ఞానాన్ని జనసామాన్యం మీద రుద్దుతున్నాయో తలుచుకుంటే గుండె రగులుతుంటుంది. చేపమందు శాస్త్రీయత ఎంత వరకు సరైనదో నిర్ధారణే కాలేదు.ప్రభుత్వ యత్రాంగం కూడా పడీ పడీ ఈ అశాస్త్రీయ పరోక్ష ప్రైవేట్ వ్యాపారానికి ప్రత్యక్ష ప్రొత్సాహమీయడంలో అర్థం లేదు. ప్రభుత్వయత్రాంగం పని కట్టుకుని ఏర్పాట్లు చేయడాన్ని లోకాయుక్త ఇప్పటికైనా ప్రశ్నించింది. అంత వరకూ నయమే కానీ..ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనం నమ్మితే అంత కన్న అమాయకత్వం మరోటి లేదు.
బత్తిన వారి చేప మందులో ఉబ్బస వ్యాధి నయం చేసే గుణాలు ఇంత వరకూ శాస్త్రీయంగా రుజువుకాలేదని గుర్తుంచుకోవాలి. జబ్బు నిదానిస్తుందన్నది జనం ఒక నిరాధారమైన విశ్వాసం మాత్రమే!