◆ నేను 21వ శతాబ్దపు మనిషిని. నేను మాయా, మంత్రాలను నమ్మను. చెమట, కన్నీళ్లు, జీవన్మరణాలను నమ్ముతాను.
◆ మతాలను పాటించేవారు తమ మతమే సరైనదని నమ్ముతారు. కానీ మెడికల్ ఎమర్జెన్సీ సమయాలలో ఎవరూ నాకు హిందూ రక్తం కావాలి, ముస్లిం రక్తం కావాలి, క్రిస్టియన్ రక్తం కావాలి అని బ్లడ్ బ్యాంక్ ల దగ్గర అడగటం నేను చూడలేదు.
◆ రోజూ గుడిముందు బిచ్చం అడుక్కునే వాడి జీవితాన్ని బాగు చేయలేని దేవుడు, నువ్వు ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్తే బాగు చేస్తాడని ఎలా నమ్ముతావు?
◆ రేపటి స్వర్గానికి వాగ్దానాలిస్తూ, ఈ రోజు ఆకలితో ఉన్న ఒక పిల్లవాడి ఆకలి తీర్చలేని దేవుడు నాకు అవసరం లేదు.
◆ మీరు స్వర్గం కోసం ఎదురుచూడవలసిన అవసరం లేదు. దాని తలుపులు ఇక్కడే తెరుచుకునే ఉన్నాయి. మీకు ఎలా ప్రవేశించాలో తెలియకపోతే దానికి నేనేమి చేస్తాను?
◆ నేను సోక్రటీస్ కుమారుడిని. నాకు ఒక పాత్ర విషం ఇస్తే తాగేసి, నా స్వేచ్ఛని నేను మాట్లాడతాను.🔥
(This saying of him stole my heart)
◆ మతాలన్నిటికన్నా మానవత్వం గొప్పది. మానవత్వానికి మించింది మరొకటి లేదు. మానవత్వాన్ని పెంచే దిశగా అడుగులు వేద్దాం. మనిషిలా ఉంటూ, మనిషిగా బ్రతకడం మాత్రమే - మానవత్వ ప్రమాణాలను పెంచగలదు.
◆ చరిత్ర పుస్తకాలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎన్నో సంవత్సరాల నుండి ఎందరో యుద్ధం పేరుతో చనిపోతున్నారు. యుద్దానికి మించిన మరో మూర్ఖత్వమైన విషయం మరొకటి లేదు. ఈ విషయంలో నేను మహాత్మాగాంధీని, మార్టిన్ లూథర్ కింగ్ ని చాలా గౌరవిస్తాను.
◆ పుస్తకాలు మనకి అన్ కండిషనల్ గురువులు. వాటిపట్ల నాకు గొప్ప గౌరవం ఉంది. ఎందుకంటే పుస్తకాలనుండే మనమేదైనా నేర్చుకోగలము, లేకపోతే లేదు.
.....
ఇలా కమల్ ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. సగటు మనిషిపట్ల, మొత్తంగా మానవాళి పట్ల ఆయనకి ఉన్న కన్సర్న్ ఆయనమాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇంతవరకు గమనించిన వారిలో హేతుబధ్ధత, హేతువాదం గురించి మాట్లాడిన ఒకే ఒక్క సినీరంగ ప్రముఖుడు కమల్ హాసన్. ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేయాలి అనే ఆలోచనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కమల్ కి ఉన్న సామాజిక స్పృహ ఇంక ఏ ఇతర సినీ ప్రముఖులలోనూ నాకు కనిపించలేదు. ఏ ప్రముఖుడు కూడా తనకున్న విపరీత జనబాహుళ్యాన్ని ఆలోచింపజేసే విధంగా నడిపే ప్రయత్నం చేయరు. ఎందుకు చేయరు? అన్న ఈ చిన్న విషయాన్ని గ్రహించలేని స్థాయిలో అభిమానులు ఉంటారు.
స్వార్థానికి, అవకాశవాదానికి ప్రతీక అయిన పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిజం భావాలు కలిగి ఉండటం, ఆ దిశగా సుముఖత చూపించటం కమల్ మీద గౌరవాన్ని పెంచుతున్నాయి.
"40 సంవత్సరాలుగా నాది ఏ రంగు ఉండాలో చూస్తూనే ఉన్నాను. అది ఖచ్చితంగా కాషాయం మాత్రం కాదు" అని ఈ మధ్యే కమల్ తేల్చేశారు. ఇది ఎప్పుడు మత మౌఢ్య, కాషాయ మూర్ఖుల చెవిన పడిందో కానీ, గొప్ప వ్యక్తిత్వం ఉన్న కమల్ పై విష ప్రచారం మొదలు పెట్టారు. అలా ఎలా ఒక ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిని కించపర్చగలరు? సిగ్గుచేటు. మనం చదువుకున్నాం కదా...?!!
అయితే అంత ఆచరణీయం కాకపోవచ్చు కానీ కమ్యూనిజం సిద్ధాంతం చాలా గొప్పది. అణచివేయబడిన వారి గురించి, పేద రైతు కూలీల గురించి, సగటు శ్రామికుడి కష్టానికి న్యాయం చేకూరాలని, అది వృధాగా పోకూడదని చెప్తుంది. దానిని పూర్తిగా పెడదారి పట్టిస్తూ నాయకత్వం తీసుకున్న మూర్ఖులే మనకు గతంలో, వర్తమానంలో కనిపిస్తారు. అవకాశవాదుల చేతుల్లో పడి, సిద్ధాంతం ఒక రాద్ధాంతం అయిపోవడం నిజంగా బాధాకరం. కానీ కమల్ వంటి వారు నిజమైన సిద్ధాంతాన్ని కొంతమేరైనా ఆచరణలో పెట్టగలరు.
ప్రజాస్వామ్యమైనా, కమ్యూనిజమైనా, ఫాసిజం అయినా ఉన్న అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం అయితే కాదని కూడా కమల్ అంటారు. ప్రస్తుత అవకాశవాద రాజకీయాలకు కమల్ లాంటి హేతుబద్ధంగా ఆలోచించే నాయకులు చాలా అవసరం. వాళ్ళు అధికారంలోకి వస్తే చాలా మార్పు తీస్కురాగలరు. ప్రతిదానికి వేలు పైకెత్తి చూపే మూర్ఖ శిఖామణిని కన్నా.. కమల్ ని తమిళులు తమ నాయకుడిని చేసుకుంటే అభివృద్ధి పథంలో నడుస్తారు.
కమల్ రాజకీయ జీవితం ఒక గొప్ప చరిత్ర కావాలని, పెద్ద ఎత్తున హేతువాద వ్యాప్తి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
✍Rajesh Bykani.