Pages

"Collected these contents from whatsup for enlighten the logical thinking in youth and childrens. Gain Subject by reading.. Think over it.. Follow your heart wherever it takes you."

బ్రాండెడ్ మందుల్లా జనరిక్ మందులు



*జనవిజ్ఞానవేదిక కృష్ణాజిల్లా*

ప్రశ్న:- *బ్రాండెడ్ మందుల్లా జనరిక్ మందులు పని చేయవంటున్నారు అది నిజమేనా*.. ?

జవాబు:- అందులో ఏమాత్రం నిజం లేదు. అవి వట్టి పుకార్లు మాత్రమే. బ్రాండెడ్ మందైనా లేదా జనరిక్ మందైనా, ఫార్ములా ఒకటైతే చాలు, రెండు మందులూ ఒకే విధంగా పని చేస్తాయి..

అసలు బ్రాండెడ్ మందులంటే ఎంటో, అలాగే జనరిక్ మందులంటే ఏంటో ముందు తెలుసుకుందాం..

ఏదైనా ఒక కొత్త మందును, ఒక ఫార్మా కంపెనీ మా‌ర్కెట్ లోకి తెస్తే, దానిపై ఆ కంపెనీకి 20 సం.లు పేటెంట్ హక్కులు ఉంటాయి..

అంటే ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా సరే, దానిని ఓ 20 సం.ల పాటు (కాపీ కొట్టి) వేరే ఎవరూ తయారు చేయకూడదు..

అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, దానిని మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే (ఆ మందుపై సదరు కంపెనీ పేటెంట్ గనక పొందితే) ఓ 20 సంవత్సరాల పాటు (పేటెంట్ హక్కులు లభించిన కంపెనీకి) గుత్తాది పత్యం ఉంటుంది..

వాస్తవాని ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు.. అంటే తయారీ ఖర్చు కంటే మందుయొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది..

అదేమంటే 'ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని' సదరు కంపెనీ వాదిస్తుంది..

కాబట్టే ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై, ( కంపెనీకి) పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం..

అలా మొదటి కంపెనీ, తన మందుకు ఒక పేరును కూడా పెట్టుకుంటుంది. ఆ మందుకు ఆ కంపెనీ పెట్టుకున్న పేరే "బ్రాండ్ నేం" లేదా ఆ మందును "బ్రాండెడ్ మందు" అంటారు. దానిపై ఆ ముందు యొక్క (కెమికల్) ఫార్ములా కూడా ఉంటుంది.

డాక్టర్లు ఎపుడూ మందు లేబుల్ పై ముద్రించబడి ఉండే ఈ ఫార్ములా పేరే రాయాలి, బ్రాండ్ నేం ఎపుడూ రాయకూడదు. ఒక వేళ బ్రాండ్ నేం రాయాలనుకుంటే.. ముందుగా ఆ మందు యొక్క ఫార్ములాను పెద్దక్షలాతో రాసి, ఆటుతర్వాత కింద బ్రాకెట్లో, చిన్నక్షరాలతో బ్రాండ్ నేం రాయవచ్చు..

ఇందాక చెప్పుకున్న ఉదాహరణలోని మందుపై మొట్టమొదటి కంపెనీ యొక్క పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును (అదే కంపెనీ లేదా మరేదైనా కంపెనీ) తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు..

అదే ఫార్ములాతో, అవే కెమికల్స్ తో అదే మందును వేరే కంపెనీ తయారు చేస్తే, ఆ మందుకు తను స్వంతంగా పెట్టుకున్న మరో పేరుతో మార్కేట్ లోకి విడుదల చేస్తుంది. అది కూడా బ్రాండ్ నేం కిందికే వస్తుంది. దాని రేటు కూడా అధికంగానే ఉంటుంది..

ఐతే ఒక మందుపై పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత (అవే కెమికల్స్ తో, అవే ఫార్ములాతో తయారు చేసి) 30 నుండి 80 శాతం తక్కువ ధరలతో "జనరిక్" షాపుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలా తక్కువ ధరలకు, జనరిక్ షాపుల్లో అమ్మే మందులనే జనరిక్ మందులంటారు. వీటిపై ముద్రించబడే యం ఆర్ పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు..

బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి..

ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఎజెన్సీలకూ, మందుల షాపులకూ, ( కొన్ని సందర్భాలలో డాక్టర్లకు కూడా) అందరికీ నష్టమే కదా. అందుకనే జనరిక్ మందులపై, "అవి బ్రాంబెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు..

కాబట్టి మనలాంటి వాళ్ళం, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు ఈ విషయమై ప్రజలను చైతన్య పరచాలి. సమాన్య జనం సధ్యమైనంత వరకు తక్కువ ధరల్లో లభించే జనరిక్ మందులనే కొనుక్కునేలా మనమందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..
   ---
చెలిమెల రాజేశ్వర్, జేవీవీ, తెలంగాణ.