Pages

జోర్డానో బ్రూనో - ఒక ఇటాలియన్ తత్వవేత్త


జోర్డానో బ్రూనో (ఇటాలియన్:Giordano Bruno, లాటిన్:Iordanus Brunus) ఒక ఇటాలియన్ తత్వవేత్త. బైబిల్ కి విరుద్ధమైన సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని ప్రభోదించినందుకు క్రైస్తవ మత పెద్దలు ఇతన్ని సజీవ దహణం చేశారు. ఇతను కూడా క్రైస్తవ సన్యాసే కానీ ఇతను క్రైస్తవ పెద్దలు ఆమోదించిన భూకేంద్ర సిధ్ధాంతాన్ని నమ్మలేదు. ఇతను ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతాయని, ఈ భూమి లాంటి భూములు విశ్వంలో ఇంకెన్నో ఉంటాయని నమ్మేవాడు. 1548లో ఇటలీలో జన్మించిన గ్యియర్డెనో బ్రూనో కోపర్నికస్‌ సిద్ధాంతానికి ఆకర్షితుడైనాడు. 1572లో మతగురువుగా అభిషిక్తుడైనప్పటికీ, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దీనిపై మరింత పరిశీలనలను, పరిశోధనలను చేసి మరిన్ని అదనపు అంశాలను చేర్చి అనంత విశ్వ సిద్ధాంతంను ప్రతిపాదించాడు. బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమైనవి కదా! మత బోధకులకు కోపం తెప్పించిన అంశం భూమికి, సూర్యునికి అంతం, ఆరంభం ఉంటాయన్నది. బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసును నమోదు చేశారు. 1593లో బ్రూనోను గాలి, వెలుతురు చొరబడని ఒక కారా గృహంలో బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారాగారంలో బ్రూనో సుమారు ఏడు సంవత్సరాలకుపైగా నరకయాతన అనుభవించాడు. ప్రతిరోజూ మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వచ్చేది. దాని సారాంశం బ్రూనో తన ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవడం, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఖండించడం, తాను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం. అయితే ప్రతి రోజూ బ్రూనో ఈ ప్రతిపాదనలు తిరస్కరించేవాడు. చివరకు బ్రూనోను మతద్రోహిగా, సైతానుగా, రెచ్చగొట్టే ఉపన్యాసకుడుగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి, ఒక్క రక్తంబొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చెయ్యాలన్న మరణశిక్షకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోజు 1600 ఫిబ్రవరి 17. మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుప సంకెళ్ళతో బ్రూనోను బంధించి, పెడరెక్కలు విరిచికట్టి, తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా ఉండటానికి వీలుగా నాలుకను ఇనుపతీగలతో చుట్టి, నోటికి అడ్డంగా గుడ్డను కట్టి రోమ్‌నగర వీధుల గుండా ఊరేగిస్తూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏ పని చేసినా వారికి ఈ శిక్ష తప్పదంటూ నినదిస్తూ ఊరేగించారు. బ్రూనో ఆశయాల వల్ల ప్రభావితమైన ప్రజలు వీధిలో బారులుతీరి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. బ్రూనోను ఊరేగిస్తూ పేద మతసన్యాసులు నివసిస్తున్న భవన సముదాయం మధ్యలో వథ్యశిలగా పిలిచే నిలువెత్తు స్తంభానికి బంధించి అతని నోట కట్టిన గుడ్డను, ఇనుప తీగను తొలగించి తన తప్పును ఒప్పుకున్నా క్షమించి బతకనిస్తామన్నారు. బ్రూనో నా మరణశిక్ష నాకన్నా మిమ్ములను ఎక్కువ యాతన పెడుతున్నది. దీనికి కారణం నేను పలికే నిజాలు. నేను నమ్మిన సిద్ధాంతం కచ్చితమైనది. సత్యమైనది. నేను ఏ తప్పూ చేయలేదు అని తేల్చి చెప్పాడు. బ్రూనో కాళ్ళ వద్ద ఆముదంలో ముంచిన గుడ్డలను వేసి నిప్పంటించారు. బ్రూనో పాదాలకు మంటలంటుకొని కొద్దికొద్దిగా ఎగిసిపడుతూ శరీర భాగాలను దహించి వేస్తున్నా, తన కనుబొమలు, వెంట్రుకలు కాలుతూ సజీవదహనం అయిపోతూ కూడా సత్యం ఎల్లప్పటికీ శాశ్వతమైనది. విశ్వం గూర్చి సత్యాన్ని త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు అని నినదిస్తూ మరణించాడు. 30 సంవత్సరాల తర్వాత పలువురు మేధావులు దీన్ని తప్పిదంగా గుర్తించి బ్రూనో స్మారకార్థం ఒక స్థూపాన్ని అక్కడ నిర్మించారు. తర్వాతి కాలంలో సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని పలు సవరణలతో ప్రపంచం మొత్తం ఆమోదించింది. బ్రూనో బలిదానానికి గుర్తుగా వైజ్ఞానిక లోకం, విద్యార్థి వర్గాలు, ప్రజా సైన్సు ఉద్యమ కార్యకర్తలు ఫిబ్రవరి 17న సత్యాన్వేషణ దినోత్సవంగా పరిగణిస్తాయి. తమకు తెలియని కాలంలో మానవ సమాజం కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను తయారు చేసుకోవచ్చు. కాలక్రమంలో పరిశీలనల వల్ల, ప్రయోగాల వల్ల ఆ నమ్మకాల, విశ్వాసాల డొల్లతనం బయటపడవచ్చు. రుజువైన సత్యాన్ని మతం పేరుతో, సంప్రదాయం పేరుతో తిరస్కరించే శక్తులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంటాయి. వీరిని ఎదుర్కొని సత్యాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడే సమాజం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది.