Pages

మహాపురుషులు - రాజా రామ మోహన రాయ్

 

          సతీసహగమనం లో మరోకోణం : నాటి బెంగాల్ లో కులీనులు అనే ఒక తెగకు చెందిన బ్రాహ్మణయువకులకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయడం గౌరవంగా భావించేవారు.కానీ ఆ బ్రాహ్మణవరులు చాలినంతమంది లేక పోవడం వల్ల ఒక్కొక్క వరుడికే 30,40,50, ఒక్కొక్కసారి వందమంది కన్యలనుకూడా కట్టబెట్టే ఆచారం ఉండేద.  అలాంటి సందర్భాల్లో ఆ భర్త చనిపోతే భార్యలంతా సహగమనం చేయాల్సి వచ్చేది.దగ్గరగా ఉన్నవారు భర్తతో కలిసి చితిమీదకి వెళ్లేవారు. కానీ దూరంగా ఉన్న భార్యల సంగతేమిటి?  అలాంటివారు మగడు ధరించిన గుడ్డపీలికో, అతను వాడిన ఏదైనా వస్తువో తెప్పించి దాన్నిమీద వేసుకుని తామున్న ఊరిలోనే చితి కల్పించుకుని అందులో ఉరికేవారు.  భర్త చనిపోయిన స్త్రీలు సహగమనం చేస్తే   పుణ్యం వస్తుందనీ,కుటుంబకీర్తి పెరుగుతుందనీ ఒప్పించడం,ఒప్పుకోకపోతే బలవంతంగా స్మశానానికి తీసుకుపోయి చితిపైకి  తోసేయడం, ఆమె ఏడ్పులు ఎవరికీ విన్పించకుండా భేరీలు మోగించడం.ఏదోవిధంగా పైకి లేవబొతే వెదురుకర్రలతో నొక్కిపెట్టడం వంటివి తెలిసినవే. 1815 నుండీ 1825వ సంవత్సరం వరకూ ఒక్క కలకత్తా నగరం లోనే సుమారు ఐదువేలమంది ఈ దురాచారానికి బలయ్యారు.  దీని నిర్మూలనకు కృషి చేసిన రాజా రామమోహన్ రాయ్ జీవితం పూలబాట కాదు.

 

జమీందారుల ఇంట పుట్టి,కన్నవాళ్ళు రెండుసార్లు ఇంటినుంచి వెళ్లగొట్టినా,ప్రాణాలకు ముప్పు వాటిల్లినా  తాను నమ్మిన ఆశయ సాధనకే జీవితాన్ని ధారపోశాడు. 1774 లో బెంగాల్ లో సంప్రదాయ హిందూ దంపతులకు పుట్టిన రామమోహనరాయలు కాశీలో విద్యాభ్యాసం చేసి, ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి విగ్రహారాధనను ఖండిస్తూ గ్రంధం రాశాడు. అదే బెంగాల్ భాషలోని మొదటి వచన కావ్యం.ఆ రచన చేసినందుకు తండ్రి కోపంతో ఇంటినుంచి వెళ్ళగొట్టాడు.కొన్నాళ్లపాటు ఎక్కడెక్కడో తిరిగి ,టిబెట్ కి వెళ్లి బౌద్ధులతో వాదోపవాదాలు చేశాడు.కోపించిన బౌద్ధగురువులు రామమోహనరాయ్ ని అంతం చేయాలనుకున్నారు. అక్కడి స్త్రీలు దాచిపెట్టి కాపాడారు.అదిగో నాటినుంచీ ఆయన స్త్రీజనోద్ధరణకు కంకణం కట్టుకున్నాడు.

 

రెండోసారీ గృహ బహిష్కరణ:  కొడుకుమీద బెంగపెట్టుకున్న తండ్రి కొన్నాళ్ళయ్యాక రామమోహనరాయ్ ని పిలిచి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ కొడుకు  బ్రాహ్మణ మతాచారాలను ఖండించడం చూసి రెండోసారి ఇంటినుంచి వెళ్ళగొట్టాడు. ఆరేళ్లపాటు ఇంగ్లిష్,ఫ్రెంచ్, లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలను నేర్చుకుని పదమూడేళ్లపాటు గుమస్తా ఉద్యోగం చేసి, సంఘసంస్కరణ కోసం దాన్ని మానేసి కలకత్తాలో స్థిరపడ్డాడు.

 

ఉద్యమబాట: దొరతనం వారికి పలుసార్లు విజ్ఞప్తులు పంపించాడు.చిన్న చిన్న పుస్తకాలు రాశాడు. ఉపన్యాసాలిచ్చాడు. దురాచార దుర్మార్గం గురించి ప్రజలకు బోధించాడు.పండితులతో వాదించాడు.అయినా కొద్దిమందిమాత్రమే ఆయన పక్షం వహించారు.

 

ఛాందసపండితుల ప్రతిదాడులు: లక్షలాది సంప్రదాయవాదులు సహగమనం లేకపోతే హిందూమతం చెడిపోతుందని, కాబట్టి సతీసహగమన ఆచారాన్ని కొనసాగనివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు  చేశారు.రామమోహనరాయ్ ని నిందిస్తూ గ్రంధాలు రాసి ప్రజల మెప్పు పొందారు.

 

గవర్నర్ జనరల్ సముచిత నిర్ణయం:  లార్డ్ విలియం బెంటిక్ రామ్మోహన్ రాయ్ వాదాలన్నీ సమంజసంగా ఉన్నాయని భావించి 1829వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన సతీసహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేసాడు.

( చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి " మహాపురుషుల జీవితములు " నుండి )

No comments: