పూనకాలు రావడం, జాతర్లలో డప్పులకు అనుగుణంగా ఊగిపోతూ భక్తులు నృత్యాలు చేయడం వెనుక రహస్యం ఏమిటి?
పూనకాలు, దయ్యంపట్టడం వంటివి పల్లెటూళ్ల లో విరివిగా చూస్తాము. తమాషా ఏమిటంటే ఈ పూనకాలు,
దయ్యాలు బాగా డబ్బులున్నవాళ్లకు, పారిశ్రామికాధిపతులకు, ప్రొఫెసర్లకు,
ఐఏఎస్ అధికార్లకు, శాస్త్రవేత్తలకు,
రాజకీయనాయకులకు ఎప్పుడూ పట్టవు. వారెపుడూ పూనకాలతో ఊగిపోవడం
మనం చూడం. ఎటొచ్చీ గ్రామీణుల్లోనూ, అందునా పేదవర్గాలలోనూ,
ఇళ్లల్లో తాగుబోతులు, జూదగాళ్లు వున్నచోట్ల ఇలాంటి హడావిడి చూస్తాము. ముఖ్యంగా ఈ పూనకాలు స్త్రీలలో ఎక్కువ.
ఇటీవల కాలంలో ఖమ్మం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కొందరు మహిళలు
పూనకాలు వచ్చి, భవిష్యవాణిని వినిపిస్తూ మీడియాలో గొప్ప ప్రచారం
పొందుతున్నారు. పూనకాలు లేదా దయ్యంపట్టడం ప్రధానంగా రెండు రకాలు.
ఒకటి : దొంగవేషాలు. మామూలుగా మాట్లాడితే ఎవరూ
వినరని లేని పూనకానికి పూనుకుంటారు. దయ్యం పట్టినట్లు నటిస్తారు. మనసులో వున్న తిట్లు,
శాపనా ర్థాలు, ఆందోళనలు,
ఆలోచనలు, అవసరాలు బయటపెట్టేం
దుకు దయ్యం పట్టడం, పూనకాలు ఆవహించడం వంటి ముసుగులో కేకలేస్తుంటారు.
ఇలాంటి దయ్యాల్ని సుతారంగా నాలుగు బడితె దెబ్బలతో వదల గొట్టొచ్చు లేదా అడిగిన మాంసం
కూరో, నగలో ఇచ్చి సంతృప్తిని కలిగించే కార్యక్రమమో
చేస్తే దయ్యం మాయమవు తుంది. పూనకం పూర్తవుతుంది.
ఇక రెండోది: ఇది ఓ రకమైన మానసిక జబ్బు. మనస్సులో
వున్న ఎన్నో కష్టాలు, ఆవేదనలు, అగచాట్లు మితిమీరినపుడు వారి అదుపాజ్ఞలు లేకుండానే పిచ్చి పిచ్చిగా
మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రకోపనాల న్నింటినీ కలిపి 'హిస్టీరియా' జబ్బు అంటాము. ఇది ముఖ్యంగా పీడిత మహిళల్లో
గమనిస్తాము. రోజూ తాగి వచ్చి తన్నే భర్త, చదువు సంధ్యలు
మానేసి బలదూరుగా తిరుగుతూ రోజూ వచ్చి ఇంట్లో అవీయివీ పట్టుకెళ్లి, జూదాల్లో, పోకిరీ వేషాల్లో పారేసుకొనే
కొడుకులు, అత్తల ఆరళ్లు భరించలేక మానసికంగా ప్రతిక్షణం
కుమిలిపోతున్నా ఏమి చేయలేని పరిస్థితి దాపురించినపుడు వారి అదుపాజ్ఞల్లో లేకుండానే
మానసిక ప్రకోపనాలు ఏర్పడే అవకాశం ఉంది. అపుడపుడూ ఇలాంటి ప్రకోపనాలు మితిమీరి,
వారు వింత ప్రవర్తనల్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి 'పూనకాల్ని', 'దయ్యం'పట్టడాల్ని మనం సానుభూతితో అర్థంచేసుకోవాలి. కాసేపు విశ్రాంతినివ్వాలి.
పూనకం వచ్చిన వారిలోని మానసికస్థితిని మెరుగుపర్చేందుకు మానసిక వైద్యుణ్ణి సంప్రదించిగానీ,
ఇంట్లో కష్టాల్ని కలిగించే అంశాల్ని కాస్తన్నా తగ్గించిగానీ
స్వాంతన కలిగించాలి. ఇలాంటి పూనకాల్ని వేప మండలతో కొట్టి, చీపురుకట్టలతో బాది, వారిని హింసించి తగ్గించాలనుకోకూడదు.
వాళ్లను పీడిస్తున్న దయ్యాలు ఎక్కడో లేవు. ఇంట్లో తాగుబోతు భర్తే పెద్దభూతం,
ఆశల్ని అడియాసలు చేసిన కన్నకొడుకే కసాయి దయ్యం. కట్నం తేలేదని
బాధించే అత్తమామలే అసురగణం. కుటుంబ సమస్యలు, ఆర్థిక అగచాట్లు, అప్పుల పీడనలే ఆమె
పాలిట పిశాచాలు. ముందు ఆ దయ్యాల్ని, భూతాల్ని,
అసురగణాల్ని, పిశాచాల్ని
పొలిమేర దాటిస్తే ఎప్పటిలాగే ఆ మహిళలు బంగారు జీవితాన్ని పొందగలుగుతారు.
జాతర్లలో డప్పుల శబ్దాలకు అనుగుణంగా నృత్యాలు
చేయడం మామూలే. లయబద్ధమైన సంగీతాలకు, వాయిద్యాలకు
అనుగుణంగా పాదాలు తాడించడం, చేతులు కదిలించడం,
దేహం మొత్తాన్ని అనునాదంగా ఊగించడం మానవ నైజం. సంగీతమనే బలానికి
ప్రతిస్పందనే అలాంటి ప్రత్యానుభూత నృత్యాలు. వాటిని మనం అర్థంచేసుకోవాలి, ఆదరించాలి. అయితే మరీ విర్రవీగి అడ్డగోలుగా, లయ విరుద్ధంగా అసందర్భ భంగిమలతో హంగామా చేయడం మాత్రం మద్యపాన
ఫలిత వికృతాకృతమే! ఇక్కడ దయ్యం, గియ్యం ఏమీ లేదు. బాగా
కైపెక్కి కన్నూ, మిన్నూగానక చేసే వితండ తాండవమే అది. మద్యం
కైపు తగ్గాక మధ్యలోనే నృత్యం కానిచ్చి నిష్క్రమించేసి కథ ముగిస్తారు.
శాస్త్ర విజ్ఞానం ప్రకారం దయ్యాలు లేవు. దయ్యాన్ని
ఎవ్వరూ చూడలేదు. చూడలేరు కూడా. ఎందుకంటే అవి లేవు. మనుషులు చనిపోయాక ఆత్మలు దయ్యాలవుతాయని,
తీరని కోర్కెల్ని తీర్చుకొనేందుకు అనువైన మనుషుల్ని ఆవహించి,
అవసరాల్ని పరిపుష్టి చేసుకొన్నాకగానీ ఆ ఆత్మలు ఆవహించిన వారిని
వదల వనీ, వారికి పట్టిన దయ్యాల్ని మంత్రగాళ్లు మంత్రాలతో,
వేపాకు తాడనాలతో, పొగలతో,
'హాం, హీం, క్రీమ్, భ్రీమ్, హామ్..' వంటి భీకర శాపాలతో
మాత్రమే వదలగొట్టగలరని భావించడం సోమరిపోతుల్ని ప్రోత్సహించడమే అవుతుంది.
సినిమాలలో, కథలలో, కొన్ని టీవీ ఛానళ్లలో చూపుతున్న దయ్యాలు,
ఆత్మలు, ప్రేతాత్మలు,
పూర్వ జన్మ స్మృతులు, మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, బాణామతులు, చేతబడులు ఇవన్నీ అశాస్త్రీయ అమానుష ప్రక్రియలు. పనిగట్టుకొని దోపిడీశక్తులు,
మతఛాందస భావ వ్యాప్తి సంతృప్త మనస్కులు చేసే విషప్రచారాలు మాత్రమే.
అవసరాలు తీరని ఆత్మలు ఏవైనా దయ్యం రూపంలో
పేద, అమాయక ఆడవాళ్ళని ఆవహిస్తే ఆ దయ్యాలకేం లాభం?
ఏదైనా గొప్ప మంత్రినో, గనుల సామ్రాజ్యరాజునో, సాగరతీరాల్ని కబళించి
ప్రజల భూముల్ని కబ్జా చేసి వేలాది కోట్లు దండుకొనే సంపన్నులనో పట్టుకొంటే అన్ని కోర్కెలు
క్షణాల్లో తీరతాయి. అభ్యుదయవాదులమందరం ఆ దయ్యాలకు ఈ విధమైన అర్జీపెట్టుకొందాం. అపుడు
పేద మహిళలకు, గ్రామీణ రైతులకు పట్టిన దయ్యం వదులుతుంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య, సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక