జీవులన్నీ
ప్రకృతిలో భాగమే. ఈరోజు అనేక కారణాలవలన ప్రకృతి విధ్వంసానికి గురవుతున్నది.
అభివృద్ధిపేరిట సాగే చర్యలతో పర్యావరణం పాడవుతున్నది. భూమి, గాలి, నీరు మానవ తప్పిదాలవల్ల కలుషితం
అవుతున్నాయి. ఈచర్యలతో అనేక జీవరాసులు నశించిపోతున్నాయి. మనం గతంలో చూసిన సాధారణ
పిచ్చుక (హౌస్ స్పారో) ఇప్పుడు అరుదుగా తప్ప కనిపించడం లేదు. ‘పిచ్చుక బొమ్మ’ చూపించి, అవి గతంలో మన ఇళ్ళలోనే తిరిగేవని
భావితరాలకు చెప్పవలసిన దుస్థితి వచ్చింది.
పర్యావరణ వినాశనం ఏ స్థాయిలో ఉన్నదో ఈ బలహీనమైన పిచ్చుక మనలను హెచ్చరిస్తున్నది. ఇంటి కప్పులకింద, పూర్వపు రోజులలో అయితే పెంకుల అడుగుభాగంలో, పిచ్చుకలు మన ఇళ్లలోనే గూళ్లు నిర్మించుకునేవి. ఆడ, మగ పిచ్చుకలు కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లుపెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి బాధ్యత పడతాయి. వాటి కిచకిచలతో ఇళ్ళకు ఎంతో కళవచ్చేది. ప్రతిధాన్యంగింజా వలుచుకొని బియ్యం గింజని మాత్రం అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి. కానీ, ఇళ్లు ఇరుకై, వాకిలీ పెరడూ హరించుపోయి చివరకు చెట్లు కూడా లేకుండాపోతున్న కాలంలో ఇక పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుంది? ఇంధన కాలుష్యం, గృహనిర్మాణంలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న అపార్ట్‌మెంట్ల సంస్కృతి, సాంకేతికంగా వచ్చిన మార్పులు పిచ్చుకలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు. విస్తృతంగా సాగుతున్న సెల్ టవర్ల నిర్మాణం వాటి ఉసురు తీస్తున్నది. సెల్‌టవర్లనుంచి వెలువడే తరంగాలతో వాటి పునరుత్పత్తి శక్తి నశిస్తున్నదని కొందరి వాదన. పంటలపై క్రిమిసంహార మందులను ప్రయోగించి మనం చంపుతున్న పురుగులను తిని పిచ్చుకలు మరణిస్తున్నాయి.
పిచ్చుకలతోపాటు ఇతరపక్షులనూ రక్షించే ఉద్దేశ్యంతో మార్చి -20న ‘ప్రపంచ పిచ్చుకలదినోత్సవం’ జరుగుతున్నది. పర్యావరణ, పక్షిప్రేమికులు ఒకచోట కలసి తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకొనేందుకు వీలుగా సభలు సమావేశాలు జరిపి, అంతరించిపోతున్న పక్షి జాతుల రక్షణకు సంకల్పించడం దీని ఉద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కృషిలో మనమూ పాలుపంచుకుందాం. పిచ్చుకలతోపాటు అన్ని పక్షి జాతులను కాపాడుకుందాం. పక్షుల జీవనానికి అవసరమైన కృత్రిమ గూళ్ళు ఏర్పాటు చేయాలి. వేసవిలో పక్షులు నీరు దొరకక చాల ఇబ్బంది పడతాయి కనుక ఇంటిజాలీలపై, షేడ్‌లపై, ఇంటిముందున్న ఖాళీ జాగాల్లో నీరుపెడితే వాటికోసం వస్తాయి. అలాగే, రకరకాల పక్షుల కూతలతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణమూ ఏర్పడుతుంది. పక్షి ఏదైనా దాన్ని బ్రతికించుకోవాలి.