Pages

రేప్ లు ఎందుకు జరుగుతున్నాయి????

 

ఎన్ని  చెట్టాలు తెచ్చినా ఆడవారి మీద జరుగుతున్న అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి అసలు లోపం ఎక్కడ ఉంది??? 


సెక్స్ ఎడ్యుకేషన్  లేకపోవడం 


మన విద్యావ్యవస్థ,  ఆచార వ్యవహారాలూ,  రాజకీయాలు అన్నీ ప్రక్షాళన చేస్తే తప్ప ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.   "సెక్స్ ఎడ్యుకేషన్ " అనేది చిన్నతనం నుంచి తప్పనిసరిగా ఉండాలి.  లేత మెదళ్లను అర్థం కానీ అయోమయం స్థితిలో పడేయడం  వల్లే సమస్యలు వస్తున్నాయి . 1st క్లాస్ పిల్లలికి సైన్స్ పాఠం చెప్పేటప్పుడు  "పార్ట్స్ ఆఫ్ ది బాడీ"  అంటూ చిత్రపటాన్ని చూపిస్తూ కళ్లు,  ముక్కు,  నోరు అని నేర్పిస్తారు. కానీ జెనిటల్ ఆర్గాన్స్ మాత్రం కవర్ చేసి వాటి గురించి అసలు చెప్పరు. ఎందుకు?  అవి మన శరీరంలో భాగం కాదా? !  అలా వదిలేసి చెప్పేది హిపోక్రసి అవుతుందే తప్ప సైన్స్ అవ్వదు. అభంశుభం తెలియని వయసులోనే కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదు అనే ఒక విషసంస్కృతికి అక్కడే బీజం పడుతుంది.  

పిల్లలు పెరుగుతున్న దశలో ఇలాంటి విషయాలపట్ల వాళ్లకు ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటిని తీర్చడానికి తల్లిదండ్రులు కానీ,  టీచర్లు కానీ ఇష్టపడరు.  పైగా అలాంటి ప్రశ్నలు వేసినందుకు తిట్టిపోస్తారు.  ( డౌట్ రావడమే తప్పైనట్టు ) కొన్ని విషయాలు కొందరితో అస్సలు మాట్లాడనే కూడదు అనే అభిప్రాయాన్ని పెద్దలే కలగజేస్తారు.  9th,  10th క్లాస్ కి వచ్చేసరికి సైన్స్ లో  'సెక్స్  డిటెర్మినేషన్ ' లాంటి లెసన్స్ చెప్పడానికి అటు టీచర్లు,  వినడానికి ఇటు పిల్లలూ ఇబ్బంది పడుతూ ఉంటారు.  సందేహాలు తీరకపోగా మరింత పెరుగుతాయి. తెలుసుకోవాలన్న ఆసక్తీ పెరుగుతుంది. దానికి ఈ ఆధునిక ప్రపంచంలో లెక్కలేనన్ని దారులు.  చిన్నతనం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా జ్ఞానాన్ని జ్ఞానంగా నేర్చుకున్నప్పుడు  మంచి ఏదో,  చెడు ఏదో తెలుసుకునే విచక్షణ ఏర్పడుతుంది. అలా కాక తప్పుడు భావనతో,  తప్పుడు మార్గాల్లో  తెలుసుకునే పిల్లల ఆలోచనలు తప్పు దారిలో వెళ్లే అవకాశముంది.  


ప్రశ్న తిరస్కరించే వారికి ప్రశ్నించే హక్కు లేదు 



 పిల్లలు ఎలాంటి ప్రశ్నలు వేసినా విసుక్కోకుండా,  తిట్టకుండా తల్లిదండ్రులు ఎలాంటి సంకోచం లేకుండా (ఇది పిల్లలకు అనవసరం అనే ఆలోచన లేకుండా ) అన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పగలిగితే,  తాము చేసే ప్రతీ పనిని నిస్సంకోచంగా తల్లిదండ్రులకు చెప్పుకునే స్వేచ్ఛ పిల్లలికి ఏర్పడుతుంది. అలా పేరెంట్స్ తో ఎలాంటి విషయమైనా చెప్పగలిగే పిల్లలు తప్పుడు పనులు చేయలేరు.  చాలా మంది పేటెంట్స్ టీనేజ్ లో ఉన్న తమ పిల్లలు ఏ విషయాలూ చెప్పరని అన్నీ దాచిపెడుతూ ఉంటారని అంటూ ఉంటారు.  మరి వీళ్ళు ఆ పిల్లలికి చిన్నతనం నుండి దాచకుండా అన్నీ చెప్పగలిగారా?  వీళ్ళు దాచిపెట్టినప్పుడు పిల్లలు దాచకుండా చెప్పాలని ఆశించడం ఎంతవరకు కరెక్ట్??  


ఆ జ్ఞానం పేరెంట్స్ కే లేదు 


అసలు దేన్ని ఆమోదించాలి ,  దేన్నీ తిరస్కరించాలి అనే జ్ఞానం పేరెంట్స్ కే లేనప్పుడు పిల్లలకి ఎలా వస్తుంది!!!  'అసలు పిల్లలు ఎలా పుడతారు'?  పిల్లలికి వచ్చే అతి సాధారణమైన సందేహాన్ని  (నేర్చుకోవడంలో భాగం ) చెప్పడానికి తిరస్కరిస్తారు.  ఇప్పుడు వస్తున్న అల్లరి చిల్లరి వల్గర్ సినిమాలు పిల్లలతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మెదడులో ఎంతో కాలంగా ఉన్న చిక్కుముడులు అశ్లీలంతో కలిసి విడిపోతుంటే తెలిసీ తెలియని వయసులో పిల్లల ఆలోచనలు తప్పుదారి పట్టకుండా ఎలా ఉంటాయి.??  మెదడు కలుషితం కాకుండా ఎలా ఉంటుంది??!!  రేప్ లు జరగకుండా ఎలా ఉంటాయి!?  

విలువలతో కూడిన అవగాహన కల్పించే సెక్స్ ఎడ్యుకేషన్ ని పెద్దలు అసహ్యించుకుని పిల్లలికి దూరం చేస్తే...  అసహ్యించుకోవాల్సిన అశ్లీల, అసభ్యకర విషయాలకు అవగాహనారాహిత్యంతో పిల్లలు దగ్గరవుతున్నారు. 


అవగాహన లేమి ప్రమాదకరం 


నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక రోజు zoology  క్లాస్ జరుగుతుండగా  NACO (National Aids Control Organisation) నుండి కొందరు వచ్చారు స్టూడెంట్స్ కి  ఎయిడ్స్ పట్ల అవేర్నెస్ కల్పించడానికి. చాలా విషయాలు చెప్పారు.  తర్వాత కండోమ్స్ చూపించారు అవి ఎలా వాడాలి,  ఎలా రక్షణ కల్పిస్తాయి వివరంగా చెప్పారు. మా zoology సర్ కూడా వాళ్లకు సహకరిస్తూ మాకు వివరించారు.  వాళ్ళు వెళ్ళిపోయాక  అమ్మాయిలు గోల.  అందరి ముందు,  బాయ్స్ ముందు ఇంత చెత్తగా మాట్లాడతారా?  సర్ కి అయినా బుద్ధి ఉండాలి కదా అని ఏవేవో మాటలు అందులో తప్పేంటో నాకు అర్థం కాలేదు?  అది చదువులో భాగం కాదా? !  తెలుసుకోవలసిన అవసరం లేదా? ! 

ఇంటర్ లోనే హిందీ సర్ ఉండేవాడు.  మాకు మహాభారత్ నాన్ డిటైల్డ్ గా ఉండేది.  అందులో ద్రౌపది వస్త్రాలు పీకడం, ఇతర ఆడవాళ్ళ పాత్రలు ఎంతో ఉత్సాహంగా,  కుళ్ళు జోకులతో,  వెక్కిలి నవ్వులతో చెప్పేవాడు. అమ్మాయిల్ని అదో రకంగా చూస్తూ...  వాడి వికృత చేష్టలు అందరూ తెగ ఎంజాయ్ చేసేవాళ్ళు అమ్మాయిలు.  వాడిని చూస్తేనే నాకు  అసహ్యం. హిందీ మీదే విరక్తి పుట్టేది. ఇలాంటి ప్రమాదకరమైన ధోరణి ఎవ్వరూ అడ్డుకోరు. చాలా మందికి ఇది తప్పుగానే అనిపించదు.  నేర్చుకోవాల్సిన దాన్ని అసహ్యించుకుంటున్నారు.  అసహించుకోవాల్సిన దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.  


విలువలతో కూడిన చదువే పరిష్కారం


పాఠ్య పుస్తకాల్లో ఎందుకూ పనికిరాని పురాణాలు కాదు పిల్లలికి కావలసింది. వాస్తవాలు, విలువలతో కూడిన జ్ఞానం.  దేశంలో ఆడపిల్లల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే చాలా మంది పేరెంట్స్ అలాంటి న్యూస్ కూడా పిల్లలికి తెలియకుండా జాగ్రత్తపడతారు.  అడిగినా చెప్పరు.  మీకెందుకు పెద్దవాళ్ళ విషయాలు అంటారు.  చిన్నతనం నుండి విలువలు, బాధ్యతలు తెలియకుండా పెంచితే పెద్దయ్యాక ఒక్కసారిగా ఎలా వస్తాయి??  

ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే,  ఆ అమ్మాయి ఎంతటి నరకాన్ని అనుభవించి ఉంటుందో, ఎలాంటి మానసిక క్షోభకు గురై ఉంటుందో పిల్లలికి కచ్చితంగా చెప్పాలి.  ముఖ్యంగా మగపిల్లలికి.  పసితనం నుంచి ఆ పెయిన్ ఫీల్ అవుతూ పెరిగే పిల్లలు ఆడవారితో అసభ్యముగా ఎప్పటికీ ప్రవర్తించలేరు. అందుకే పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి సంఘటనలు,  పర్యవసానాలు,  వాటివల్ల కలిగే బాధ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే పాఠాలు ఉండాలి.  అలాగే తల్లి తను సమాజంలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, కలిగిన బాధ మగపిల్లలికి కచ్చితంగా చెప్పాలి.   ఆ పెయిన్ మగపిల్లలు చిన్నతనం నుండి ఫీల్ అయినప్పుడే సమాజంలో ఆడపిల్లల గౌరవం నిలబడుతుంది.


No comments: