Pages

దిష్టి - దృష్టి


"దిష్టి"లో ఉన్న శాస్ర్తీయ‌త ఎంత‌ ?

"""""""""""""""""""""""""""""'''"""
ప్రశ్న: దిష్టి అంటే ఏమిటి ? ఇంటి గుమ్మం దగ్గర గుమ్మడికాయ కట్టడం, వాహనాల ముందర నిమ్మకాయలు వేలాడదీయడం వంటి ఆచారాలు దిష్టి నివారణకోసమని అంటుంటారు. అసలు దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఎంత ?
                
జవాబు: దిష్టి అనేది 'దృష్టి' (Vision) కి వికృతరూపం. ఎవరైనా అందంగానో, అద్భుతంగానో కనిపిస్తే ఇంట్లో ఆడాళ్లుఇరుగు దిష్టి, పొరుగుదిష్టి, నా దిష్టి, అన్ని దిష్టిలు మటుమాయం... అంటూ మెటికలు విరవడమో, ఉప్పు పట్టుకెళ్లి నిప్పుల్లో పోయడమో చేస్తారు. పెళ్లయిన నూతన దంపతులు ఇంటికి వస్తే వారు ఇంట్లోకి వెళ్లకముందు అక్కడున్న అమ్మలక్కలు ఓ పెద్ద పళ్లెంలో పసుపు నీళ్లు పెట్టి అందులో హారతిదీపం పెట్టి దిష్టి తీస్తారు. ఇవి తాత్కాలిక దిష్టి చేష్టలు.

మీరన్నవి దీర్ఘకాలిక దిష్టి నిర్మూలనా కార్యకలాపాలు. కొత్తగా ఇల్లు కట్టుకొన్న వాళ్లు లేదా ఇల్లు పూర్తయి ఇంట్లో ఉన్న వాళ్లు దిష్టి నమ్మకస్తులయితే ఆ యింటి గుమ్మంపైన బూడిద గుమ్మడి కాయను గానీ లేదా 'చందమామ' కథల్లో కోరలున్న రాక్షసుల్లాంటి ముఖాలున్న ఓ భయంకర బీభత్స రూపంలో వున్న బొమ్మనుగానీ (2డి లేదా 3డి లో లభ్యమవుతున్నాయి) వేలాడదీస్తారు.
లక్షలాది రూపాయల మాసికవేతనాలు, ఆదాయాలు ఉన్నవారు కార్లు తదితర వాహనాలను కొనగలరు. వాటిని కొన్న తర్వాత కొన్ని విధాలయిన దేవతలు / దేవుళ్లు ఉన్న దేవాలయాల దగ్గరకు తీసుకెళ్లి పూజలు చేయించి మీరన్న విధంగా నిమ్మకాలు, వెంట్రుకలు, గవ్వలు తదితర పఠాస్థిలను వాహనాల గ్రిల్లులకు తగిలించి వేలాడదీస్తారు. ఇది వాహన దిష్టి నిర్మూలన చేష్టలు.

ఇక్కడ దిష్టి చేష్టలు చేసే అందరి పరమార్థం ఒక్కటే. దిష్టి అంటే తమ మీద, తమ పిల్లల మీద, తమ యిళ్ల మీద, తమ వాహనాల మీద, తమకున్న విలువయిన వ్యక్తులు, సంపదల మీద ఇతరుల దృష్టి పడి అసూయ చెంది ఆయా విలువయిన వస్తువులు, లేదా వ్యక్తులకు హాని తలపెట్టడమో లేదా వాళ్ల దృష్టిలోనే 'చెడు లక్షణం' ఉండడం వల్ల తమ విలువయిన వాటికి ఆ 'చెడుదృష్టి' వల్ల అనియంత్రితంగా (automatically) నష్టం వాటిల్లడమో జరుగుతుందన్న భావన ఉండడం.

వైజ్ఞానికంగా చూస్తే పంచేంద్రియాలలో అతి ప్రధానమైన కన్ను కాంతి గ్రాహక ఇంద్రియావయవం. 'పంచేంద్రియానాం నయనం ప్రధానం' అన్న తెలివితేటలున్నవాళ్ళు అలనాటి కాలంలోనే ఇంటర్నెట్‌, ఖండాంతర, గ్రహాంతర వాయు వాహనాలు, రాకెట్లు వున్నాయనేవాళ్లు ఇంద్రియాల జ్ఞానయంత్రాంగం (Sensing mechanism)  గురించి కనీస అవగాహన గానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా అశాస్త్రీయ భావాలు, అశాస్త్రీయ వాదనలతో ముడిపడి వున్న 'దిష్టి' భావన మీద నిరసన వ్యక్తం చేయరు. సైన్సుకున్న లక్షణాలు రెండు : 1. తెలియని వాటిని తెలుసుకోవడం. 2. తెలిసిన వాటికి విరుద్ధంగా వున్న భావాల్ని ఎదిరించడం. ఎవరయినా మొదట ప్రక్రియలో విజయం సాధిస్తే ఈ రెంటిలోను ఏ విధమైన వాస్తవ కార్యరూపాలు లేకుండా 'అవి మాకు ఎప్పుడో తెలుసు' అంటూ గొప్పలు చేస్తుంటారు. స్వకుచమర్ద్దనకు పాల్పడతారు. వారు ఆచరించే ప్రక్రియలు అశాస్త్రీయంగా ఉండడం వల్ల ఎవరయినా వాటిని ప్రశ్నిస్తే.. వాళ్ల మీద తిరగబడతారు. ఛాందసత్వానికి, నియంతృత్వానికి, ఫాసిజానికి కొన్ని సూచికలు ఇవే! ఇలాంటివే!

కాంతి ఓ శక్తి రూపం. అది ఎపుడూ నిలకడగా వుండదు. పయనిస్తూనే వుంటుంది. శూన్యంలో కాంతి ప్రయాణించే వేగం ఓ విశ్వస్థిరాంకం (Universal Constant). దాని విలువ సెకనుకు సుమారు 3 లక్షల కి.మీ. వేగానికి మించిన వేగంతో ప్రయాణించే వ్యవస్థ గానీ భౌతిక రూపంగానీ, శక్తి స్వరూపంగానీ లేవు. కాంతికి తరంగ స్వభావం (Wave nature), కణ స్వభావం (Particulate nature) రెండూ ఏకకాలంలోనే ఉన్నాయి. ఒక నాణేనికి బొమ్మ, బొరుసు పార్శ్వాలు రెండూ ఏకకాలంలోనే వున్నట్లు కాంతికి కూడా కణతరంగ ద్వంద్వ స్వభావం (wave particle dual nature) ఉంటుంది. నిర్దిష్ట బిందువునుంచి ఎన్ని కాంతి తరంగాలు ఓ సెకనులో దాటుతాయో ఆ రాశిని ఆ కాంతిపౌనఃపున్యం అంటాము. ఒకే విధమైన తరంగ ప్రావస్థ (Phase) ఉన్న ప్రకప్రక్క బిందువుల మధ్య దూరాన్ని ఆ కాంతికున్న తరంగ దైర్ఘ్యం (Wavelength) అంటాము. ఇలా కాంతి తరంగ దైర్ఘ్యాల విస్తారం ప్రకారం చూస్తే కాంతికున్న విశిష్టత వైవిధ్యం మరే వ్యవస్థకు లేదు. కొన్ని వందల కి.మీ. తరంగ దైర్ఘ్యం నుంచి, మిల్లిమీటరులో కొన్ని కోట్ల వంతుకన్నా తక్కువ నిడివిగల తరంగ దైర్ఘ్యమున్న కాంతులు వున్నాయి. వీటినే వర్ణాలు (colours) లేదా శ్రేణులు (ranges) అంటాము. మానవుడు చూడగల కాంతి తరంగాల శ్రేణిని దృశ్యకాంతి (visible range) అంటారు. సుమారు 800 నేనో మీటర్ల నుంచి సుమారు 400 నేనో మీటర్ల మధ్య తరంగ దైర్ఘ్య నిడివి ఉన్న కాంతిని మాత్రమే మన కన్ను గుర్తించగలదు. ఇలాంటి కాంతి వస్తువుల మీద భవనాల మీద, వ్యక్తుల మీద పడి ఆ కాంతి పరావర్తనం చెంది మన కంటిపాప (pupil) ద్వారా కంటి కటకం (optical lens) ద్వారా రెటీనా మీద కేంద్రీకృతమవుతుంది. అక్కడ కంటి లోపల రెటీనా మీద ఉన్న రాడ్లు కోన్లు అనే దృష్టి కణాలు ఆ కాంతిని విద్యుత్‌ సంకేతాలుగా మార్చడం వల్ల ఆ సంకేతాలు దృన్నాడుల (దృక్‌+నాడులు) ద్వారా మెదడుకు చేరతాయి. ఆ సంకేతాల సమాకలనాన్నే మనం మన ఎదురుగా ఉన్న వస్తువు లేదా వ్యక్తి లేదా వ్యవస్థ రూపంగా చూస్తాము. అంటే మనం చూసే భవనాలు, వాహనాలు, వ్యక్తులు, అందగత్తెలు, అద్భుతాల వ్యక్తులు, పసిపాపలు మీద సౌరకాంతి గానీ, కెమెరా కాంతిగానీ, ఇంటి దీపాల కాంతిగానీ పడి ఆయా పదార్థాల నుంచి పరావర్తనం చెందగా ఆ పరావర్తిత కాంతి మన కంటిని చేరడం వల్లనే ఆయా పదార్థాల్ని లేదా వస్తువుల్ని లేదా వ్యక్తుల్ని మనం 'చూస్తున్నా'మన్నమాట.
అంటే కంటిలోకి కాంతి వెళ్లడాన్నే 'దృష్టి' అంటారు. కన్ను ఓ కుళాయి గానీ, టార్చిలైటుగానీ, మేఘంగానీ పండుగానీ కాదు. కంటి నుంచి ఏమీ రాదు. ఏడిస్తే, నవ్వితే కన్నీరు / ఆనంద భాష్పాలు తప్ప. ఆ కన్నీరు లేదా ఆనంద భాష్పాలు వాహనాల మీద పడే అవకాశమెటూ లేదు.
ఇక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కోట్లాదిమంది నమ్మే దిష్టికి అర్థం ఎక్కడీ అర్థం పర్థంగానీ, వైజ్ఞానిక ఆమోదం గానీ లేని దిష్టిని నమ్మనివారు ఎందరు? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, చదువరులు, నాయకులు, విద్యా వైజ్ఞానిక పాలకులు, అధికారులు నూటికి 99 మంది వాహనాలకు నిమ్మకాయలు, వాళ్ల యింటి గుమ్మం మీద గుమ్మడి కాయలు వేలాడుతుంటాయి. అలాంటి ముష్టి ముదనష్టి దిష్టి చేష్టల నష్టాలతో, చాంధస్వభావాల కష్టాల నిష్టూరం వల్లనే భారతదేశ విజ్ఞానాభివృద్ధి పట్ల సరియైన దృష్టిలేక వ్యాకులతతో వుంది.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, 
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
email: allikayala@gmail.com