Pages

*సైన్సు మానవుల హక్కు : వరల్డ్‌ సైన్స్‌ డే*



శాంతిని, అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ఏడాది నవంబర్‌ 10ని ప్రపంచ సైన్సు దినంగా జరుపుకుంటున్నాం.
దీన్ని యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషన్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) 2001లో ప్రకటించింది.
ఆ మరుసటి ఏడాది 2002 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 'వరల్డ్‌ సైన్స్‌ డే' జరుగుతూ ఉంది.

దీని ముఖ్యోద్దేశం ఏమిటంటే:
 
1.
వైజ్ఞానిక రంగంలో జరుగుతున్న అనేక పరిశోధనల గూర్చి సామాన్యజనానికి తెలియజెప్పడం.

2.
శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ప్రాచుర్యాన్ని కలిగించడం.

 3.
ఒక రకంగా సైన్సును సమాజానికి దగ్గరగా తీసుకురావడం!

సమాజానికి, శాస్త్ర పరిశోధనలకు మధ్య దూరం ఎక్కువగా ఉన్న సంగతి మనం గ్రహిస్తూనే ఉన్నాం.
శాస్త్రవేత్తలు వారి వారి పరిశోధనా రంగా ల్లో తలమునకలై ఉంటారు.
సామాన్యులు వారి వారి దైనందిన కార్యక్రమాల్లో నిమగమై ఉంటారు.
సైన్సు గురించి, సైన్సు పరిశోధనల గురించి తెలుసుకోవాలనుకునే జనం తక్కువ.

జీవ పరిణామ క్రమంలో మనిషి ఇక్కడి దాకా ఎలా వచ్చాడో తెలుసుకోవడానికి ఒక మంచి ప్రసంగం ఏర్పాటు చేసి, 'అందరూ ఆహ్వానితులే.. ప్రవేశం ఉచితం' అని చెప్పండి. ఏ కొద్దిమందో వస్తారు. దానికి బదులు 'మీ అరికాళ్ళు చూసి, స్వామీజీ మీ భవిష్యత్తు చెప్తారు. ప్రవేశ రుసుము ఐదువందల రూపాయలు' అని బోర్డు పెట్టి చూడండి. విచిత్రంగా జనం విపరీతంగా క్యూ కడతారు. తొక్కిసలాట జరిగి పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చినా రావొచ్చు.

ఇలాంటివి మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.
ఈ పరిస్థితి మారాలి. పరిస్థితి మారాలంటే విద్యావంతుల సంఖ్య పెరగాలి. అంతకన్నా ముఖ్యంగా ప్రజల్లో వివేకం పెరగాలి.

విద్యావంతులు అయినా, కాకపోయినా ఫరవాలేదు.
మంచీ చెడూ విచక్షణతో పాటు, జనంలో విజ్ఞత పెరగాలి. మూఢనమ్మకాలకు దాసోహమనకుండా ప్రశ్నిస్తూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే తెలివిగలవారై ఉండాలి.
సమాజం ఆ స్థాయికి చేరాలీ అంటే... ఇలాంటి సైన్స్‌ డేలు, సైన్సుకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి.

గుడ్డిగా నమ్ముతూ ఉండడం తప్ప, జనంలో ప్రశ్నించే తత్వం కొరవడుతూ ఉంది.

అందుకు మూల కారణం.. చిన్నప్పుడు పాఠశాలల్లో లభించిన విద్యావిధానమే.
ఏ ప్రశ్న అడిగితే ఏ జవాబు రాయాలి అనేది బట్టీయం వేయిస్తారే తప్ప, విద్యార్థులు విషయం అర్థం చేసుకుని ప్రశ్నించడం అనేది వారికి నేర్పుతున్నామా?

 
ప్రశ్నించడం నేర్పించని విద్యావిధానం లోపభూయిష్టమైందే.

పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇవ్వకుండా 'నోరుమూసుకుని చెప్పింది నేర్చుకో' అనే ఉపాధ్యాయులది తప్పుడు బోధనే.

'
చెప్పింది చెయ్యి' అని కోప్పడే తల్లిదండ్రులదీ తప్పుడు పెంపకమే.

ఈ రోజు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇన్ని వైజ్ఞానిక విప్లవాల మధ్య ఆధునికుడు మనగలుగుతున్నాడంటే రాత్రింబవళ్ళు కృషి చేస్తూ, జీవితాలు త్యాగం చేస్తున్నవారు శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు. మరి వీరి గురించి జనానికి తెలియజేయాల్సిన అవసరం లేదా?

ఓ గాయకుడు గొప్పగా పాడతాడు.
ఓ నర్తకి గొప్పగా నర్తిస్తుంది.
ఓ నటుడు అత్యద్భుతంగా భావోద్వేగాలు ప్రదర్శిస్తాడు.
 
ఓ ఆటగాడు మైదానంలో బంతులు అద్భుతంగా విసిరేస్తాడు. జనం వారికి అభిమానులుగా మారి, వారికి భజన చేస్తుంటారు.

నిజమే.
కఠోర సత్యమేమంటే వీరంతా ఎంటర్‌టేయినింగ్‌ రంగానికి సంబంధించినవారు.
సమాజానికి ఆనందాన్ని వినోదాన్ని పంచేవారే గానీ, మనుషుల ఆలోచనా రీతిని,సమాజ గతిని మార్చేవారు కాదు.
నూతన శకంలోకి తీసుకుపోయేవారు కాదు.
ఆ పని నిబద్దతగల, దార్శనికులైన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, రచయితలు, తత్త్వవేత్తలు, క్రాంతికారులైన ప్రజానాయకులు, ఒక ధ్యేయంతో పనిచేసే ఉపాధ్యాయులు, అంకిత భావం గల కార్యకర్తలు మాత్రమే చేయగలరు.
కానీ, సమాజం వారిని పట్టించుకోదు.
 
ప్రభుత్వాలూ పట్టించుకోవు.
నగరాల్లో, మహానగరాల్లో పెద్దపెద్ద పరిశోధనాశాలలుంటాయి. వాటి ముందు నుంచి రోడ్డుమీద వెళ్ళే జనానికి లోపల ఆయా పరిశోధనా శాలల్లో ఏం జరుగుతుందో తెలియదు.
అన్ని రంగాల వారు తిరుగుతుంటారు కానీ, లోపల జరిగే ప్రయోగాల గూర్చి తెలుసుకుందామనుకునే వారు తక్కువ. అందుకే ఇలాంటి 'సైన్స్‌ డే'లు అవసరం అవుతున్నాయి.

వీటివల్ల అప్పుడప్పుడైనా సగటు మనిషికి వైజ్ఞానిక విశేషాల గూర్చి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.

నిత్యజీవితంపై సైన్సు ప్రభావం గురించి, మానవ జీవితంలో దాని అవసరం గురించి జనానికి సరైన అవగాహన రావాలి.

సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే సైన్సు గురించి సమాజం తప్పని సరిగా తెలుసుకోవాలి. అప్పుడు గాని అశాస్త్రీయ భావాల్ని, విధానాల్ని ఎండగట్టడానికి వీలుకాదు.

అందుకోసమే ప్రపంచ వ్యాప్తంగా ఈ సైన్స్‌డే జరుపుతున్నారు.

పాఠశాల స్థాయి నుంచి పెద్ద పెద్ద ప్రయోగశాలల దాకా సెమినార్లు, కాన్ఫరెన్సులు, ప్రముఖ విజ్ఞానవేత్తల ముఖాముఖి కార్యక్రమాలు, సైన్సు స్పృహగల రచయితల ఉపన్యాసాలు వంటివి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.
అంతే కాదు, ప్రత్యేక ప్రదర్శనలు, ఊరేగింపులు కూడా నిర్వహిస్తూ సామాన్యుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. వారి అవగాహన పెంచుతున్నారు.

జులై 1999లో హంగరీ-బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రతినిధులందరూ చర్చించి వరల్డ్‌ సైన్స్‌డే గాని, వరల్డ్‌ సైన్స్‌ వీక్‌గానీ జరుపుకోవడం తప్పనిసరని నిర్ణయించారు.
ఆ కాన్ఫరెన్స్‌ను యునెస్కో, అంతర్జాతీయ సైన్స్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా పెద్ద ఎత్తున జరిపాయి.
ఆ తర్వాత యునెస్కో ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు అక్టోబరు 1999లో పారిస్‌లో సమావేశమై సైన్స్‌డేకి రూపురేఖలు, విధివిధానాలు రూపొందించింది.

ప్రతి సంవత్సరం 28 ఫిబ్రవరిని మన దేశంలో 'నేషనల్‌ సైన్స్‌ డే'గా జరుపుకుంటున్నాం.
ఇది కేవలం మన దేశానికి మాత్రమే సంబంధించింది.
ఆ రోజునే 1930లో మన దేశ శాస్త్రవేత్త సర్‌.సి.వి.రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది.

 
ఇకపోతే నవంబర్‌ 10న జరుపుకునే కార్యక్రమం ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేరోజు జరుపుకునేది.
 
మొదట 2002-2008 మధ్య కాలంలో వరల్డ్‌ సైన్స్‌ డే పేరుతో ఒక ఐదారేండ్లు సైన్సు ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. తర్వాత ఒక్కో సంవత్సరం ఒక్కో అంశానికి ప్రాధాన్యమిస్తూ జరుపుకోవాలని నిర్ణయించారు.

ఇంతవరకు ప్రాధాన్యమిచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.

ఖగోళశాస్త్రం (2009)
సైన్సు కోణంలోంచి సంస్కృతి (2010)
 
హరిత సమాజాలు (20011)
 
ప్రపంచ దేశాల సత్సంబంధాల కోసం సైన్సు (2012)
 
జల పంపిణీ - నిల్వలు - కొత్త విధానాలు (2013),
 
సైన్సు బోధనలో ఉన్నత స్థాయి - ప్రామాణికత (2014)
 
భవిత కోసం సైన్సు (2015)
సైన్స్‌ సెంటర్ల, మ్యూజియంల నిర్వహణ (2016),
సైన్సు - గ్లోబల్‌ అవగాహన (2017)
వంటి అనేక విషయాల మీద దృష్టి కేంద్రీకరించి ప్రపంచ దేశాలన్నీ సైన్స్‌డే - నిర్వహించుకున్నాయి.

మానవ హక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌ వెలువడి డైబ్భయి ఏండ్లయిన సందర్భంగా ఈ 2018 సంవత్సరం ''సైన్సు - మానవుల హక్కు'' అనే అంశం ఎంపిక చేశారు.

దాన్నే నినాదంగా తీసుకుని ప్రపంచ దేశాలన్నీ ఏక కంఠంతో నినదించాలని యునెస్కో పిలుపునిచ్చింది.
దేశాలన్నీ ఎక్కడికక్కడ తగిన కార్యక్రమాలు రూపొందించుకుని, నిర్వహించుకోవాలని కోరింది.
 
ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే కార్యక్రమం కాదు. ప్రయివేటు రంగాల్లోని వ్యవసాయ, వ్యాపార, విద్య, వైద్య, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక సంస్థలన్నీ ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

సామాన్య పౌరులు కూడా ఇందులో భాగస్వాములై సమాజంలో సైన్సు ప్రాముఖ్యానికి గుర్తింపు వచ్చేట్టు చేయాలని విశ్వమానవులకు యునెస్కో విజ్ఞప్తి చేసింది.

''
సైన్సు - మానవుల హక్కు'' అనే అంశంతో పాటు భద్రతగల భవిష్యత్తుకు దారులు వేయాలని, సమాజానికి అవసరమైన సైన్సు విధి విధానాలు (పాలసీలు) చట్టాలు రూపొందించుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో శరణార్థులయిన సైన్సు పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు భద్రత కల్పించి, వారి పరిశోధనలు కొనసాగేలా వసతులు కల్పించాలని కూడా యునెస్కో ప్రపంచ దేశాలను కోరింది.

మెరుగైన సమాజ నిర్మాణం కోసం సైన్సు ఎంతో అవసరమన్న విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉంది.

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, మనం కూడా ప్రాంతీయ స్థాయిలో పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, పౌరసంఘాల్లో అన్ని చోట్లా వైజ్ఞానిక దృక్పథం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలి. కొత్త ఆలోచనల్ని ప్రచారం చేస్తూ జనం మెదళ్ళలో కొత్త ద్వారాలు తెరవాలి.

ముఖ్యంగా ఈ పని పిల్లల్లో, యువకుల్లో విరివిగా జరగాలి. వారితోనే భవిష్యత్తులో సమాజ స్వరూపం మారుతుంది.

సైన్సు అందిస్తున్న అన్ని సౌకర్యాలను వాడుకుంటూ,
వాటి వెనక గల కృషిని తెలుసుకోకుండా,
 
పురాతన భావజాలానికి ఊడిగం చేసేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. మన దేశంలో ఎక్కువగా ఉన్నారు.
అసలైన ప్రమాదం వీరితోనే గనక,
చాకచక్యంగా వారిని మంచి పద్ధతిలో అదుపులోపెట్టి,
సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంది.

 
సైన్సు అవగాహన విస్తృత మవుతున్నకొద్దీ మనుషుల మధ్య మాత్రమే కాదు, దేశాల మధ్య, జాతుల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు తగ్గి, స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి.

ఉదాహరణకు ఇజ్రయిల్‌- పాలస్తీనా సైన్స్‌ ఆర్గనైజేషన్‌ (ఐపీఎస్‌ఓ) అనే సంస్థ ఏర్పడి చురుకుగా పనిచేస్తూ ఉంది.

ఒకవైపు మనిషి స్వార్థ చింతన, మరొక వైపు రాజకీయ దురాగతాలు సమాజాన్ని వెయ్యేండ్లు వెనక్కి నడిపించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, బాధ్యత గల పౌరులు సైన్సు అవగాహనతో మరింత స్థిరంగా నిలబడి తమ గమ్యాన్ని తాము చేరుకోవాల్సిన అవసరం ఉంది.
 
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించాల్సి ఉంది.
వైజ్ఞానిక స్పృహ గల ప్రజలే స్థిర చిత్తులై నిలబడినప్పుడు, మార్పు తప్పక ప్రజల వల్లే వస్తుంది!!