Pages

*'మహా మానవి మేరీ క్యూరీ'*


*నాకు నచ్చిన📕*
*ఒక అమెరికన్ విలేఖరి  ఫ్రాన్స్ లోని ఓ మారుమూల పల్లెలోని కుటీరం దగ్గరికి వెళ్లి  కాళ్లకు చెప్పులు కూడా లేకుండా సామాన్య దుస్తుల్లో ఉన్న ఓ స్త్రీని "అమ్మగారు ఇంట్లోనే ఉన్నారా ?" అనడిగాడు."లేరు.'మనుషుల గురించి కాకుండా ఆలోచనలగురించి తహతహలాడమని ఆమె మీకు చెప్పమన్నారు." అందామె.ఆ సామాన్యస్త్రీయే రెండు నోబెల్ బహుమతులూ ,19 డిగ్రీలూ ,15 బంగారు పతకాలూ అందుకున్న  మేడం క్యూరీ అని పాపం ఆ విలేఖరికి తెలియదు. "అక్కా!నేను కష్టపడి డబ్బు సంపాదించి నిన్ను డాక్టర్ చదివిస్తాను.ఆ తరువాత నువ్వు నన్ను చదివించు" అనే చెల్లెళ్ళు ఉంటారనీ  క్యూరీ చరిత్ర చదివే వరకూ మనకూ తెలియదు.గ్రాము లక్షా యాభై వేల డాలర్లు విలువచేసే రేడియంను  కనిపెట్టి  అది కేన్సర్ చికిత్సకి అవసరం. కాబట్టి పేటెంట్ రైట్స్ తీసుకుని  ధనవంతులైపొమ్మని సలహా ఇస్తే" రేడియం కరుణా సాధనం.అది మానవాళికంతటికీ చెందుతుంది"అని చెప్పిన మహోన్నత వ్యక్తి మేడం క్యూరీ 1867 నవంబర్ 7 న పోలాండ్ లో పుట్టింది.ఆమెకి  తల్లిదండ్రులు పెట్టిన పేరు 'మేర్యా స్క్లోడోవస్కా'.* తండ్రి నాస్తికుడు.తల్లి రోమన్ కేథలిక్.

*చదువుపట్ల మేర్యా పడిన తపననీ,పట్టుదలనీ పిల్లలకు చెప్పాలి.* హైస్కూల్ చదువులోనే బంగారుపతకం పొందినా ఆరోజుల్లో పోలెండ్ లో స్త్రీలకు ఉన్నతవిద్యపై నిషేధం ఉందటంవల్ల  పారిస్ లో చదవడానికి తన అక్క తో కలిసి ఒక చిత్రమైన ఒప్పందం చేసుకుంది.మార్యా డబ్బు సంపాదించి అక్కను పారిస్ లో డాక్టర్ చదివించాలి.అక్క డాక్టరయ్యాక మార్యా ని పారిస్ కి తీసుకెళ్లి చదివిస్తుంది.ఆ ఒప్పందాన్ని ఆచరణలో పెట్టడానికి మార్యా  పడిన  పాట్లు వర్ణనాతీతం .పదిహేడేళ్ల మార్యా  ప్రయివేట్లు చెప్పింది.కుటుంబాన్ని విడిచిపెట్టి ధనవంతుల ఇళ్లలో గవర్నెస్ గా పనిచేసింది.తన ఖర్చులకోసం ఆలోచించకుండా సంపాదన అక్కకు పంపించేది.ఖాళీ సమయాల్లో సైన్స్ ,గణితం,సాహిత్యం చదివేది.అలా ఏడేళ్లు కష్టపడ్డాక ఫ్రాన్స్ వెళ్లగలిగింది.

 *పారిస్ వెళ్ళాక  ఫ్రెంచ్ భాషకు అనుగుణంగా తనపేరును మేరీగా మార్చుకుంది. యూనివర్సిటీ లో 1825 మంది విద్యార్థుల్లో కేవలం 23 మంది మాత్రమే స్త్రీలు.భౌతిక శాస్త్రంలో అయితే ఆమె ఒక్కతే స్త్రీ.యూరప్ లో విజ్ఞానశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళ కూడా ఆమే.ఐదు నోబెల్ బహుమతులందుకున్న కుటుంబం కూడా ఆమెదే.*

*వెంటాడిన కష్టాలు:* పారిస్ కి రైలెక్కి నాల్గవ తరగతి టిక్కెట్ లో నిలబడి ప్రయాణం చేసింది.పెళ్ళైపోయిన అక్కదగ్గర ఉండటం ఇష్టం లేక యూనివర్సిటీ దగ్గర అద్దె తక్కువని ఒక భవన ఐదవ అంతస్తులో అటకగది అద్దెకు తీసుకుంది.ఆమె పరిస్థితి ఎంత దయనీయం అంటే బొగ్గుల బస్తాను అంతపైకి స్వయంగా మోసుకెళ్లేది.ఒకోసారి రెండు రొట్టెముక్కలూ,టీ తో ఆకలితీర్చుకునేది.అప్పుడప్పుడు భోజనం మాట మర్చిపోవడంవల్ల స్పృహ తప్పి పడిపోయేది. సాయంత్రం ప్రైవేట్లు చెప్పేది. గ్రంద్యాలయానికెళ్లి రాత్రి 9 గంటలవరకూ చదివి ఇంటికొచ్చి నూనె దీపపు కాంతిలో రెండింటివరకూ చదివేది..రాత్రుళ్ళు చలికి తట్టుకోలేక తనదగ్గరున్న బట్టలన్నీ మీద వేసుకుని పడుకునేది.

*ఉన్నతమైన వ్యక్తిత్వం :*  మతం మీదా దేవుడిమీదా పూర్తిగా నమ్మకం పోయిన మేరీ చర్చిలో కాకుండా వేరేచోట, నిశ్చితార్ధపు ఉంగరం,గౌను లాంటివి కూడా లేకుండా అతి నిరాడంబరంగా *పియరీ క్యూరీ* ని పెళ్ళిచేసుకుంది.బంధువులిచ్చిన డబ్బులతో దంపతులిద్దరూ రెండు సైకిళ్ళు కొనుక్కుని గ్రామసీమలకు హనీమూన్ కి వెళ్లారు.మొదటి నోబెల్ బహుమతి అందుకున్న దుస్తులతోనే రెండో నోబెల్ నీ కూడా అందుకుని నిరాడంబరత్వంలో తనకు తానే సాటి అనిపించుకుంది. *భర్త చనిపోయినపుడు ఫ్రెంచ్ ప్రభుత్వం  పింఛను ఇస్తానంటే "తనకు పనిచేసే శక్తి ఉందనీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు అవసరంలేదనీ చెప్పడమే కాకుండా యుద్ధ సమయంలో తన బంగారువెండి పతకాలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించిన త్యాగమయి.క్యూరీ ఫౌండేషన్ స్థాపించి ఆరువేల మంది కేన్సర్ రోగులను ఆదుకున్న అమృతమూర్తి మేడం క్యూరీ.*

*రేడియం కనిపెట్టిన ఆనందంలో క్యూరీ దాన్ని పరీక్ష నాళికలో వేసి కోటుజేబులో పెట్టుకుని తిరిగేది.పియరీ చిన్న రేడియం ముక్కను చేతికి కట్టుకునేవాడు.నిప్పుతో చెలగాటమని వారికి ఆ తరువాతే అర్ధమయింది.రేడియో ధార్మికత కారణంగా మహామానవి మేరీక్యూరీ 1934 జూలై 4 న తుదిశ్వాస విడిచింది.*
*ప్రతిరోజూ జ్ఞానాన్ని పొందాలనే తీవ్రతపనే మానవుణ్ణి ఈనాడు అతడున్న అద్వితీయ స్థితికి లేవనెత్తింది* ------మేడం క్యూరీ.
*'మహా మానవి మేరీ క్యూరీ'* పుస్తకం నుంచి.(పీకాక్ బుక్స్ ప్రచురణ.పేజీలు 96,ధర 60రూ )

*---
ప్రకాష్ 🖋*