Pages

దేవుడు - మతం


"దేవుడు - మతం" "కులం - వర్గం" ఇదేనా..?
జన జీవన మంత్రం..!

జీవ పరిణామ క్రమంలో శిఖరాగ్రాన్ని చేరినవాడు మానవుడు. నేడు మనిషి మనిషిగా జీవించేందుకు ఎంతమాత్రం అవకాశం లేదు..!

            ఇందుకు కారణాలు నాలుగు. 1) దేవుడు 2) మతం 3) కులం 4) వర్గం ఇవి మనిషిలోని మానవత్వానికి మత్తుమందు జల్లి అతని చైతన్యాన్ని మంటగలిపాయి. మానవుల్ని ఛిన్నాభిన్నం చేసి, వారిని చెక్క ముక్కల కింద చీల్చి వేశాయి. మానవ జీవిత స్వేచ్ఛను అరికట్టి, అవి మానవత్వానికి ఊపిరిపోశాయి.

       మానవ అజ్ఞానంలోంచి పుట్టినవాడే దేవుడు. ప్రకృతిలో తన దృష్టికి కనిపించే వస్తువుల్నీ, జరిగే సంఘటనల్నీ శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోలేని నాటి ఆదిమ మానవుడు తనకన్న పూర్తి భిన్నమైన ఏదో మహాశక్తియో, మహాశక్తులో ప్రకృతి ఉనికికి కారణమై ఉంటాయని భావించాడు. అతడు అప్పటికింకా ప్రకృతి గర్భం నుంచి బొడ్డు కోసుకుని బైటపడలేదు. ఇంకా ప్రకృతిలో భాగంగానే ఉంటున్నాడు. నిప్పు, నీరు, గాలి, నేల ఇత్యాది ప్రకృతి శక్తులకు దైవత్వమారోపించడం ద్వారా ఆదిమ మానవుడు మొట్టమొదటి దేవుళ్లను సృష్టించాడు.

         మానవుడు మృగదశలో ఉన్నప్పుడు కొండగానో, బండగానో, ఏరుగానో, చెట్టుగానో వెలసిన దేవుడు, మానవ విజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ కొండ- బండ రూపాన్ని వదిలి - మృగమై, ఆ పిదప మనిషై, ఆ తర్వాత నిరాకారుడై నిరంజనుడై నిర్వికల్పుడై చిట్టచివరికి అదృశ్యమైపోయాడు. అంటే మత సిద్ధాంతాలు అభివృద్ధి చెందిన కొద్దీ, ఈ దేవుళ్ళు ప్రకృతి శక్తులతో తమకున్న సంబంధాన్ని వదిలించుకుని ఊహాప్రపంచంలోకి అమాంతం వెళ్లిపోయాడు.

          దేవుడికి మళ్లీ పూజారి వర్గం ఒక ఆకారం కల్పించింది. పూజాపుస్కారం, నామకరణం, అన్నప్రాశన, పెళ్ళీ పేరంటం, వ్యభిచారం, ఇత్యాది అమాంబాపతు లక్షణాలన్నీ పూజారివర్గం దేవుళ్ళకు అంటగట్టింది. తిండిపోతు దొంగలైన పూజారులు, దేవుడనే బూచిని తమస్వార్థ సంకుచిత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తత్ఫలితంగా మనుషులు చేసిన దేవుళ్ళ చేతిలో మనుషులే బానిసలుగా మారిపోయారు.
దేవుడనే బూచిని చూపి, మనిషి మెదడుపై జల్లిన మత్తుమందే - మతం. ఈ మతం పేరిట, మానవుల మధ్య అభేద్యమైన కోటగోడలు కట్టారు. ఈ మతం పేరిటే, మతకర్తలు, మతోన్మాదులూ మారణహోమం గావించి, మానవ రుధిరాన్ని ఏరుల్లా పారించారు. మానవ శిరసుల్ని కోట గుమ్మాలకు చట్టారు. ఆది శంకరుడు లాంటి మత దురహం కారులు , జైన- బౌద్ధ- చార్వాకుల చెవుల్లో సీసం కాసిపోశారు. ఆర్యులు అనార్యుల్నీ, యూదులు క్రైస్తవుల్ని, కేధలిక్కులు ప్రొటెంస్టెంట్లనీ, మతం పేరిటే క్రూర మృగాలకన్న దారుణంగా చిత్రవధ చేశారు.

         గొరికి పారేసిన వెంట్రుకలిస్తే దేవుడు మురిసిపోయి, కోరిన వారాల్నీ శిరిసంపదలను ఇస్తాడనేంతదాకా, ఈ మతమే నేడు జనంలో ప్రచారం చేస్తోంది. ఈ లోకంలోని మానవుల కష్టసుఖాల్తో సంబంధంలేని మతం, చచ్చింతర్వాత స్వర్గాన్ని చూపి బెల్లిస్తోంది. అంచేత, ఈ మతం నల్లమందు. ఈ మతం - తిండిపోతు దొంగల కేంద్రం. ఈ మత కర్మల్ని ఆసరాచేసుకున్న పూజారి వర్గం, అమాయక ప్రజల జేబులు గొడుతోంది. అంచేత, ఈ మత పిచ్చిని నాశనం జేయనంతదాకా , మానవుడు మానవుడుగా మనలేడు. మానవత్వానికి చోటులేదు.

          ప్రపంచంలో ఏ దేశంలో లేని కులం కుష్టురోగం ఈ దేశంలోని హిందువులకే దాపురించింది. చరిత్ర పరిణామ క్రమానికి చెందిన ఒకానొక దశలో , శ్రమ విభజన కోసం ఏర్పడ్డ వర్ణ వ్యవస్థ నేటి కుల వ్యవస్థగా రూపుదాల్చింది.
బ్రహ్మదేవుని తలలోంచి బ్రాహ్మలు, భుజాలలోంచి క్షత్రియులు, కడుపులోంచి వైశ్యులు, కాళ్ళలోంచి శూద్రులు పుట్టారని హిందూ, పురోహిత వర్గానికి చెందిన ధర్మశాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. అయితే, పంచములు దేవుని ఏ అంగంలోంచి జన్మించారో ఈ వంచకులు మాత్రం చెప్పలేదు.

         మొదట్లో మూడు వర్ణాలన్నారు. తర్వాత నాలుగన్నారు. నేడు 2030 కులాలూ, లక్షకి పైగా చిల్లర తెగలూ హిందువుల్లో ఉన్నాయి. అంటరానివారనీ, చెప్పరానివారనీ, ఛండాలురనే పేర్లు పెట్టిన ఈ వైదిక పురోహితులు, కోటానుకోట్ల మానవుల్ని మాల- మాదిగ గూడేలకి తరిమేశారు. తరతరాలుగా వారిని పురుగులకన్నా హీనంగా చూశారు. అస్పృశ్యత ధర్మసమ్మతమేనని పూరీ శంకరాచార్యులు లాంటి ద్రోహులు, నేటికీ సిగ్గూ బిడియం లేకుండా ప్రచారం చేస్తున్నారు. అంచేత, ఈ కుల తత్వ పిశాచాన్ని, ఏడు నిలువుల లోతున పాతెయ్యనంతదాకా ఈ జాతికి విముక్తి లేదు. ఈ జనానికి భవిషత్తు లేదు. అధికుడని, అధముడనీ కులాల్ని సృష్టించి , నేటికీ అవి ధర్మ సమ్మతమేనని వదరుతున్న వారిని ప్రజా ద్రోహులుగా పరిగణించాలి. సమస్త మానవులూ సమానమేనన్న మానవతా వాదానికి పట్టాభిషేకం చేయాలి.

       ఆదిమ మానవ సమాజంలో, ఉన్నవాడూ లేనివాడూ అనే భేదం లేకుండా, అంతా సమిష్టి కృషి ద్వారా సుఖంగా జీవించారు. సమాజంలో ప్రయివేటు ఆస్థి రావడంతో, మానవులు ధనికులుగాను, దరిద్రులుగానూ చీలిపోయారు. అతికొద్ది మంది కుబేరులు, అశేష ప్రజానీకాన్ని పీడించి కోట్లకి పడగ లెత్తుతుంటే, కోటానుకోట్ల ప్రజలు భీకర దారిద్య్రంలో హీనంగా బతుకుతు న్నారు. అంచేత, ఈ ఆర్థిక అసమానతులు లేని సమాజ నిర్మాణం జరగాలి.
- సివీ
( '' డార్విన్‌ పరిణామవాదం'' - పుస్తకం నుంచి)
సౌ జ న్య  o - whatup message