Pages

జ్యోతిష్యం ఓ మూఢనమ్మకం


క్రీ..1543లో కోపర్నికస్ మన సౌర కుటుంబానికి సూర్యుడు కేంద్రమని, ఇతర గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని 'సూర్య కేంద్రక సిద్ధాంతం' ప్రతిపాదించాడు. చదువుకున్న ప్రతి ఒక్కరు పాఠ్యపుస్తకాల్లో సూర్యుడు ఒక నక్షత్రమని, మన సౌర వ్యవస్థకు సూర్యుడే మూలమని చదువుకున్నవారే


అయినా జోతిష్యాన్ని మనలో చాలామంది నమ్మడం విచిత్రం. జ్యోతిష్యం చెప్పిన నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, రాహువు, కేతువు, శని ఉన్నారు. ఇందులో సూర్యుడు అసలు గ్రహమే కాదు. ఒక పెద్ద నక్షత్రం. చంద్రుడు భూమికి ఉపగ్రహం. రాహువు, కేతువు అనే గ్రహాలు మన సౌర వ్యవస్థలో లేనేలేవు. నవగ్రహాల్లో గ్రహాలుగా చెప్పిన నాలుగు గ్రహాలు శుద్ధ అబద్ధం అని తేలిపోయింది.ఇక జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా పరిగణించడం ఎంతవరకు సబబు?

గ్రీకులు మన దేశంపై దండయాత్ర చేసినప్పుడు (క్రీ.పూ 4 శతాబ్ది) వారిద్వారా మన దేశంలోకి ఖగోళ విజ్ఞానం వచ్చిం దంటారు. ఖగోళశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న అసమర్థత కారణంగా జ్యోతిష్యం అనే అసమర్థ జ్ఞానం తయార యిందని కొందరు భావిస్తున్నారు. జ్యోతిష్యం కొంతమంది పరాన్న జీవులకు భుక్తి అయింది

మన పురాణాల్లో రోహిణి, కృత్తిక, మృగశిర అంటూ 60 నక్షత్రాల పేర్లు చెప్పి, నక్షత్రాలు దక్ష ప్రజాపతి కుమార్తెలని, వారిని చంద్రుడు వివాహం చేసుకు న్నాడని, దేవతల గురువైన బృహస్పతి భార్య తారతో చంద్రుని అక్రమ సంబంధం కారణంగా బుధుడు పుట్టాడని చెప్పడంలో ఏదైనా శాస్త్రీయత ఉందా? ఈరకంగా దేవతలు, దేవుళ్లకు అక్రమ సంబంధాల వల్ల గ్రహాలు పుట్టాయని చెప్పడం, విషయాన్ని ఉన్నత చదువులు చదివినవారు, అధికార హోదాలో ఉన్నవారు కూడా నమ్మడం మూర్ఖత్వం కాక మరేమిటి?

 అంతరిక్షంలోని గ్రహాలను కూడా దేవుళ్లను చేసి అమాయక ప్రజల పొట్టకొడుతూ దోచుకుతింటున్నారు కొందరు పండితులు.
సూర్యచంద్రులు, భూమి వాటి కక్ష్యలో అవి తిరుగుతున్నప్పుడు ఒకదాని నీడ మరోదానిపై పడి గ్రహణాలు ఏర్పడతాయి.కానీ జ్యోతిష్యులు మాత్రం రాహు కేతువులు మింగినందువల్ల గ్రహణాలు ఏర్పడతాయని చెబుతారు

రాహు కేతువుల పుట్టుకకు కూడా మరో కథ ఉంది. పురాణాల్లో వీరిద్దరూ అమృతం తాగటానికి ప్రయత్నించిన రాక్షసులు. జగన్మోహినిగా ఉన్న విష్ణువు వీరిని పసిగట్టి సుదర్శన చక్రం ప్రయోగించితే అమృతం తాగిన వీరి తలలు రాహువు, కేతువులై విశ్వంలో తిరుగుతు న్నాయట. తిథులు, వారాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, యమ గండం, రాహుకాలం అంటూ ప్రజలను మభ్యపెట్టి తమ పొట్ట గడుపుకోడానికి కొందరు సృష్టించిన అభూత కల్పనలు ఇవి. వీటిలో ఏమాత్రం శాస్త్రీయత లేదు.

ముహూర్తాలు ఒకరోజు మంచిది, ఒకరోజు చెడ్డది అని చెప్పడం తప్పు. అన్ని రోజులు మంచివే. గడచిపోయిన సమయం తిరిగిరాదు. మనిషికి ఉన్న ఈజీవితకాలంలో ప్రతీక్షణం విలువైనదే. విలువైన సమయాన్ని పనికిరాని విషయాలకు కేటాయించడం విజ్ఞత కాదు. ఫలానా రోజు మంచిది కాదని భూమి తిరగడం ఆగిందా! సూర్యోదయం ఆగిందా! ఇవన్నీ ప్రకృతి నియమాలు. ప్రకృతి నియమానుసారం జరగాల్సిన విషయాలు.

గ్రహాలకు కూడా కులాలను ఆపాదించే కుహనా సంస్క్తృతీ కనిపిస్తున్నది. ఒక్కో దిక్కుకు ఒక్కో దేవత అట. ఒక దిక్కు మంచిది, ఒక దిక్కు మంచిది కాదని చెప్పే వాస్తుకు ఎట్లాంటి శాస్త్రీయత లేదు. భూమి నిరంతరం తన చుట్టూ తాను బొంగరంలా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటే దిక్కులు-వాస్తు అని చెప్పేదాంట్లో డొల్లతనం ఏంటో ఇట్టే తెల్వదా

భూమి తన మీద ఉన్న సమస్త జీవులను, గృహాలను, పర్వతాలను, సముద్రాలను... ఇట్లా సకల చరాచర జీవులతోపాటు తనచుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న ఊహే ఎంత అద్భుతంగా ఉంది! భూమితోపాటు మనమంతా విశ్వంలో బ్రమణం, పరిబ్రమణం చేస్తున్నాం. ఇక మనం కల్పించుకున్న దిక్కులకు విలువేముంది!

ఇవ్శాళ భారతీయ సమాజంలో ఉన్న అత్యంత మూఢనమ్మకం జోతిష్యం. సామాన్యుల జీవితాలను ఇది అతలాకుతలం చేస్తు న్నది. పెండ్లికి, పుట్టుకకు, శోభనానికి, చదువులకు, ఉద్యోగాలకు చివరికి చావుకు కూడా ముహూర్తం చూసుకోవడం చూస్తుంటే జ్యోతిష్యం అనే జాడ్యం ఎంతగా ముదిరిపోయిందో అర్థమవు తున్నది

ఒక వ్యక్తి ఫలానా రోజు, ఫలానా సమయంలో చనిపోయాడు కనుక ఆరోజు ముహూర్తం బాగాలేదు, శాంతి జరిపించి సంవత్సరీకం అయిపోయేదాకాఉన్న ఇల్లు వదిలి వేరే చోట ఉండమని చెప్తున్నవారిని ఏమనాలో అర్థం కావడంలేదు. ముహూర్తం చూసి కడుపులో ఉన్న పిల్లల్ని ప్రపంచంలోకి తీసుకురావడం పిచ్చి పరాకాష్టకు నిదర్శనంగా చెప్పాలి.

 పంచాంగంచూసి, ముహూర్తం పెట్టించుకొని 'సిజేరియన్' చేయించుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయింది. బిడ్డలను కనడమనేది ఒక సహజమైన ప్రక్రియ. అండాశయాలు ఆడపిల్ల పుట్టుక నుంచే ఉంటాయి. ఆడపిల్ల ఎదిగినకొద్దీ అండాశయాలు వృద్ధి చెంది యుక్త వయసు వచ్చాక పరిపక్వ అఅండాలు ఏర్పడతాయి. అప్పుడు అండం విడుదలవుతుంది. ఇట్లా అండం విడుదల కావడాన్ని 'అండోత్సర్గ' అంటారు. అట్లా విడుదలైన అండం శుక్రకణంతో కలిస్తే పిండం తయారవుతుంది. పిండం గర్భ సంచిలో బిడ్డగా ఎదుగుతుంది. అండం ఏర్పడటం, అది పిండంగా రూపుదిద్దుకోవడానికి ముహూర్త సమయాలకు సంబంధం లేనప్పుడు బిడ్డ పుట్టడానికి మాత్రం ముహూర్తం చూడటం నిజంగా మూర్ఖత్వమే మరి.

ఫలానా నక్షత్రంలో పుట్టినవారికి ఫలానా రంగురాయి ధరిస్తే మేలు కలుగుతుందని వ్యాపారం చేసేవారు, న్యూమరాలజీ అంటూ నంబర్ల వ్యాపారం, రుద్రాక్షల వ్యాపారం, కుబేర యంత్రం, ధనలక్ష్మీయంత్రం అంటూ సత్తు రాగిరేకుల వ్యాపారం... ఇట్లా ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకొని ఎంతో వ్యాపారం చేస్తున్నారు స్వార్థపరులు.

- శైలజ బండారి
నవ తెలంగాణ వార్త పత్రిక నుండి సేకరించినది..