Pages

శాస్త్ర వివేచన

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలితాల్ని అనుభవిస్తూనే సనాతన ఆచారాలు పాటించడం రివాజు. సంస్కృతి పేరిట నిరర్థక క్రతువులు, పూజలు నిర్వహించడం పరిపాటి. తమ నమ్మకాలకు ఆధారం లేదని తెలిసినప్పటికీ వాటిని పట్టుకు వేలాడటం సర్వత్రా కనిపించే దృశ్యం. కార్యాకారణ సంబంధం లేని చర్య ఏదీ ఉండదు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అనేక కోర్సులు చేసేవారికి ఇది స్పష్టంగా తెలిసిన అంశం. అయినప్పటికీ హేతువును అనుసరించే దృష్టికోణం కనిపించదు. కాలం చెల్లిన నమ్మకాల్ని పట్టుకు వేలాడే ధోరణి సమసిపోలేదు. తుమ్మితే బయటికి అడుగుపెట్టరాదని, కాస్సేపు కూర్చొని బయలు దేరేవారిని చూస్తుంటాం. దాని వల్ల సమాజానికేం నష్టం లేదనేవారున్నారు. కానీ అది అక్కడితోనే ఆగిపోదు. పూజలు, నోములు ఇంటికి పరిమితమై ఉండటం లేదు. వీధికెక్కుతున్నాయి. విగ్రహాల్ని ప్రతిష్టించి వాడవాడలా ఉత్సవాల్ని నిర్వహించడంలోని ఔచిత్యం ప్రశ్నార్థకం. మూఢత్వం వ్యక్తిగత ఆచరణగానే మిగిలిపోదు, అది సామాజిక దురాచారంగా పరిణమించి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తుంది. కులాలు, మతాలు బలపడటానికి దారితీసి శాస్త్రీయ దృష్టికోణం బలహీనమవుతుంది. ఇది అంతిమంగా సమాజంలో అసమానతలు పెరగడానికి దారితీస్తుంది.

శాస్త్రీయ విజ్ఞానఫలాలు అనుభవిస్తారు. సాంకేతికరంగంలోని ప్రతి మార్పును అంది పుచ్చుకుంటారు. మన పనులు తేలికయ్యే వస్తుసామాగ్రి నంతా వశం చేసుకుంటాం. వేల మైళ్ళదూరంలో ఉన్నవారితో తలచిన క్షణమే మాట్లాడే సదుపాయాలతో పులకరిస్తాం. ఆధునాతన సాంకేతిక ప్రజ్ఞకు విస్తుపోతాం. ప్రకృతిని జయిస్తూ మనిషి మేధ విస్తరించే వైనానికి ముగ్ధులమవుతాం. కానీ శతాబ్దాల మూఢత్వాన్ని వదిలించుకోడానికి తటపటాయిస్తారు. విమానాలు ఎక్కుతాం. సముద్రాల మీద క్రూయిజ్‌ల్లో ప్రయాణిస్తాం. కంప్యూటర్లు, మొబైల్స్‌, లాప్‌టాప్స్‌ ఉపయోగిస్తాం. వాటిలోని సరికొత్త ఫీచర్స్‌ని అనుసరిస్తూ అప్‌డేట్‌ కావాలని తాపత్రయపడతాం. సాంకేతిక వైజ్ఞానిక ప్రగతి ఫలాల్ని అందిపుచ్చుకోడంలో ఎక్కడా వెనుకపడరు. కానీ అమెరికా వెళ్ళి కూడా నిమజ్జనాలు చేస్తారు. లక్ష వత్తుల పూజలు చేస్తారు. నిర్హేతుకమైన సామూహక క్రతువుల్ని నిర్వహిస్తారు. ఇదే ఎంత అసంబద్ధం. ఎంతటి వివేక రాహిత్యం. పై చదువులు చదువుతారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తారు. లక్షలు, కోట్లు సంపాదిస్తారు. కానీ శతాబ్దాల మూఢత్వాన్ని తల మీంచి దించుకోరు. శాస్త్రీయ దృష్టికోణంతో జీవితాన్ని వెలిగించుకోరు. ఇది దేశంలోని అత్యధికుల్లో కనిపించే అవలక్షణం. మన జీవితాలకీ, నమ్మకాలకీ మధ్యన అంతరం అతి పెద్దది. ఈ కారణంగానే మన దేశంలో శాస్త్ర పరిశోధనలు నామమాత్రం. సైన్స్‌ పరంగా ప్రపంచానికి మన కంట్రిబ్యూషన్‌ చాలా స్వల్పం. గత రెండు వందల సంవత్సరాల్లో సైన్స్‌ ఫలాల్ని అనుభవించడమే తప్ప సైన్స్‌ విస్తృతికి మనం అందిస్తున్న తోడ్పాటు పూజ్యం. ఎవరో కనిపెట్టిన, సాధించి పెట్టిన వాటికి వినియోగదార్లుగా మిగిలాం, అంతే తప్ప మనంగా వైజ్ఞానిక శాస్త్రానికి అందించింది శూన్యం. మూఢత్వాన్ని వదిలించుకునే సంకల్పం కొరవడటమే ఈ దుస్థితికి మూలం. శాస్త్రీయ వివేచన అలవరుచుకోనంత కాలం మన నమ్మకాలకు మనం బందీలం.