Pages

నీ అంతులేని స్వార్థం

నీ అంతులేని స్వార్థం ,నీ నిర్దయలే
నీ పాలిటి శతృవులై నిన్ను చుట్టుముడతాయని
నీవు తెలుసుకోక తప్పని రోజొచ్చింది.
                             -భార్గవ జి
-----------------------------
మన సొంత పిల్లలనే ప్రేమించేందుకు మనకు టైం లేదు.
పిల్లలను మన కలలు నెరవేర్చే 
సాధనాలుగా మార్చుకుని చాలా కాలం అయింది.
ఇక మంది పిల్లలను మనం ఎప్పుడు ప్రేమిస్తాం !
కుటుంబమే లేని అనాధ బాలల 
ఉనికే మనకు తెలియనప్పుడు
వారెట్ల పెరుగుతున్నారో మనకేం పట్టింది?
పేదరికం కాటుకు చిక్కి 
వివక్షతల ,నిర్లక్ష్యాల కోరలకు బలై
ప్రేమలేక ,ఆదరణ దొరకక , 
దయగల ఒక మాట నోచుకోక  
ఎండిపోయిన గుండెల గురించి 
మనకు పట్టింపు లేదు.
బండచాకిరితో చిన్నప్పుడే కాయలు కాచిన చేతులను మనం ఎప్పుడు చూస్తాం ?
హింస ,దౌర్జన్యం ,బలప్రయోగం తప్ప
బతకడానికి వేరే నియమాలుంటాయని 
అనుభవంలోకి రాని పసి హృదయాలు
ఏ వ్యక్తిత్వాలు సంతరించుకుంటాయో 
మనకేమి తెలుసు.?
మనం కట్టుకున్న అద్దాల మేడలపై 
రాళ్ళు పడినప్పుడు
మనం భద్రంగా పెంచుకుంటున్న పూలకుండీలను
ఎవరో పగల గొట్టినపుడు
మన భద్ర జీవితాల్లో కలకలం రేగినప్పుడు మాత్రమే
మనం ఉలికి పడి నిద్రలేస్తాం.
మన చుట్టూ సమాజం కూడా 
ఒకటుందని కనుగొంటాం.
నీకు రక్షణ ఇవ్వడానికే తప్ప , 
నీకు అవకాశాలివ్వడానికే తప్ప,
నీకు సేవలందివ్వడానికే తప్ప
సమాజమెందుకు అని నీవనుకుంటుంటావు. 
సమాజానికి నీవుకూడా తిరిగి ఏమైనా 
ఇవ్వాల్సుంటుందని నీకెవరూ చెప్పలేదు కద.
సమాజమంటే నీ ఇష్టానుసారం వాడుకుని వదిలేసే ఒక ఉచిత వనరు అనే కద నీ అవగాహన.
అయితే నీవు వాడుకుని వదిలేసే 
సమాజం నీ సమస్యగా మారుతుందనీ
నీవు పట్టించుకోని సమాజమే
నీకు ప్రమాదాలు తెచ్చిపెడుతుందనీ 
నీకెవరూ చెప్పలేదు కద.
అంతా నా తెలివే ,అంతా నా చాకచక్యమే 
అంతా నా లౌక్యమే అని విర్రవీగే నీకు
నీ భద్రతా ,నీ శాంతి ,నీ సుఖాలూ
సమాజం వేసిన భిక్ష అనీ ,
ఏ సుఖాలూ నోచని జనాల చాకిరీ వల్లే 
నీకీ భద్ర జీవితమనీ నీవు తెలుసుకోవలసిన రోజొచ్చింది.
నీపిల్లలతో పాటూ అందరు పిల్లలూ 
సంతోషంగా ,ప్రేమగా ఎదిగినప్పుడే 
అందరూ బాగుంటారని నీవు గ్రహించాల్సిన రోజొచ్చింది. 
నీ ఇంట్లో చెత్త వీధిలో పారేస్తే చాలదు.
నీ వీధిలోని చెత్త కూడా నీవు ఎత్తేయాల్సి వుంటది.
నీ ఒక్కడివి సంతోషంగా , గౌరవంగా ఉంటే చాలదు.
అందరికీ ఆ సంతోషం, గౌరవం ఎలా దక్కుతాయో 
నీవు ఆలోచించాల్సి ఉంటుంది.
నీ అంతులేని స్వార్థం ,నీ నిర్దయలే
నీ పాలిటి శతృవులై నిన్ను చుట్టుముడతాయని

నీవు తెలుసుకోక తప్పని రోజొచ్చింది.
(మిత్రుడు భార్గవ జి వాల్ నుండి)