Pages

జ్యోతిష్యం ఒక వంచన.!

ఇది ఒక సాంఘిక దురాచారం!!
సాంఘిక నేరం???
""""""""""""""""""""

జ్యోతిష్యం:
డాక్టర్. నరిసెట్టి ఇన్నయ్య:

చదువుకున్నవారు, డిగ్రీలున్నవారు చేతులు చూపించుకుంటున్నారు.
 ముహూర్తాలు పాటిస్తున్నారు.
అర్ధరాత్రి పెండ్లిళ్లు చేస్తున్నారు.
అధికారంలో వున్నవారు, రాజకీయాల్లో వున్నవారు ప్రతిదానికీ ముహుర్తాలు పాటిస్తున్నారు.
ఎక్కడ చూచినా ఆస్తాన జ్యోతిష్యులు తయారయ్యారు.

"హిందూ"వంటి పత్రికలు జ్యోతిష్యాన్ని ప్రచురించడంలేదు. కాని చాలా దినపత్రికలు వార, దిన ఫలాలు, రాశిచక్రాలు వేస్తున్నాయి.

 ప్రపంచవ్యాప్తంగా యిది వున్నది.

సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులు విజ్ఞప్తి చేసినా, జ్యోతిష్యం శాస్త్రీయం కాదని తెలిపినా, అది కేవలం వినోదం అని ప్రకటించమన్నా, పత్రికలు మొండిగా పాఠకులను మోసం చేస్తున్నాయి.

ఏ రెండు పత్రికలూ ఒకేరోజు ఒకే విధమైన జ్యోతిష్యాన్ని ప్రచురించడంలేదు.

జ్యోతిష్యానికి ప్రత్యేక పత్రికలు వెలువడుతున్నాయి. జ్యోతిష్యం అంచనాలు ఎన్నివిధాల తప్పిపోయాయో, చూపినా, జనం ఇంకా గుడ్డిగా నమ్ముతూనే వున్నారు.

తప్పిపోయిన అంచనాలకు జ్యోతిష్యులు బాధ్యత వహించడం లేదు.

జనం మాత్రం మా కర్మ అనుకుంటూ, మరో ముహూర్తం కోసం, ఇంకో జ్యోతిష్యుణ్ణి వెతుక్కుంటూ పోతున్నారు.

జ్యోతిష్యం పూర్వకాలం నుంచీ వున్నది.
అన్ని దేశాల్లోనూ వివిధ రీతుల్లో పాటిస్తున్నారు.
 మన దేశ జ్యోతిష్యానికి అమెరికా జ్యోతిష్యానికీ చాలా తేడాలున్నాయి.
అలాగే మిగిలిన చోట్ల కూడా.

 జ్యోతిష్యం పూర్వంనుండి ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలపై ఆధారపడింది.
వాటి చలనం, అక్కడ నుండి వచ్చే వెలుగు, ఆకర్షణ మన జీవితాల్ని ప్రభావితం చేస్తాయనే నమ్మకమే జ్యోతిష్యానికి మూలం.
శాస్త్రంలో పరిశీలన ఒక భాగం.
అది రానురాను ఖగోళ శాస్త్రానికి దారితీసింది. ఖగోళశాస్త్రం శాస్త్రీయంగా, జ్యోతిష్యం నమ్మకంగా మిగిలిపోయింది.

పూర్వం రాజులు జ్యోతిష్యుల్ని పెట్టుకునేవారు. జ్యోతిష్యం తప్పిపోతే, చెప్పిన జ్యోతిష్యుణ్ణి వురితీసేవారట చైనాలో!
అలా కాకపోయినా, జ్యోతిష్యం  అంచనాలకు బాధ్యత వహించేటట్టు చేయడం అవసరం.
అప్పుడు కొంత అయినా అదుపు వస్తుంది.

 అమెరికాలో అధ్యక్షుడుగా రీగన్ జ్యోతిష్యులను పెట్టుకొని, వారి ప్రకారం నడుచుకున్నాడు.

అలెగ్జాండ్రియా, ఈజిప్టు, బాబిలోనియా, గ్రీక్, రోమన్ నాగరికతలలో జ్యోతిష్యం వుండేది.

దేశభవిష్యత్తును అంచనావేస్తూ చెప్పే జ్యోతిష్యం, వ్యక్తిపరంగా చెప్పే జ్యోతిష్యం వుండేది. మరణాలకు,ఉపద్రవాలకు గ్రహాలు కారణం అని నమ్మేవారు.
పూర్వం నుండి వస్తున్న ఆ నమ్మకం అలా అంటురోగంలా ప్రబలుతూ వచ్చింది.

తెలుగు రచయిత చలం కూడా రమణాశ్రమంనుండి అందరికీ వుత్తరాలు రాసి, అష్టగ్రహ కూటమికి ప్రపంచం అంతమౌతున్నదనీ రమణాశ్రమానికి వస్తే బ్రతికిపోతారని జోస్యం చెప్పాడు.
అలాంటిదేమీ జరగలేదు.
చలం రాసింది నిజమేనని నమ్మి వెళ్ళినవారున్నారు. అలా రాసినందుకు చలానికి శిక్షలేదు.
బెంగుళూరులో రామన్ అనే జ్యోతిష్యుడు చెప్పినవి ఎన్ని విధాల తప్పిపోయాయో శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

 హెచ్.నరసింహయ్య యీ విషయమై ఒక సంచలనం ప్రచురించారు.
అయినా రామన్ పట్ల శిక్షలు లేవు.
అందుకే జ్యోతిష్యులు బాధ్యతారహితంగా రాస్తున్నారు.
 అంచనాలు వేస్తున్నారు.
దీనివలన జరిగే నష్టాలు అనూహ్యం.
 జోతిసష్యులు సాంఘిక నేరస్తులు.
 వీరిపట్ల చట్టం అవసరం.

చాలా జోతిష్యాలు అందరికీ వర్తించేటట్లు అస్పష్టంగా వుంటాయి.
నెల మొదటివారంలో జీతాలు వస్తాయి గనుక, సంతోషంగా వుంటారని, నెల చివరలో కష్టాల్లో వుంటారని స్థూలంగా సూచించడం యిందులో భాగమే.
అలాగే రుతువులు, శీతోష్ణస్థితిని బట్టి అంచనాలు చెప్పడం ఒక వ్యూహం మాత్రమే.
అలెగ్జాండ్రియా లైబ్రరీలో పనిచేసిన సుప్రసిద్ధ టాలమీ మొదలు న్యూటన్, కెప్లర్ వరకూ జ్యోతిష్యాన్ని నమ్మారు.
 ఆధునిక కాలంలో సైకాలజిస్టు కార్ల్ యూంగ్.ఇసెంక్ లు నమ్మారు.

 శాస్త్రీయంగా జ్యోతిష్యాన్ని రుజువుచేయాలని కృషిచేసి విఫలమయ్యారు.
జ్యోతిష్యం అశాస్త్రీయమని రుజువైంది.
అయినా అది వదలడం లేదు!

కెప్లర్ కాలానికి ఆరు గ్రహాలే తెలుసు.

ఆ తరువాత ఖగోళవిజ్ఞానం మరో మూడు గ్రహాల్ని కనుగొన్నది.

ఇండియాలో ప్రాచీనకాలం నుండి నవగ్రహాలను అంటిపెట్టుకున్నారు.

ఉత్తరోత్తరా ఖగోళవిజ్ఞానం ప్రకారం కనుగొన్న ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్ చేర్చలేదు అంటే అన్ని గ్రహాల ప్రభావాన్ని భారతీయ జ్యోతిష్యం పరిగణలోకి తీసుకోకుండానే, మనిషి భవిష్యత్తును అంచనా వేస్తున్నాయన్నమాట.

మరి గ్రహాల ప్రభావం నిజంగా మనిషిపైవుంటే భారతీయ జ్యోతిష్యం వదలివేసిన గ్రహాల మాటేమిటి?
అసంపూర్తి అంచనాలు సరైనవి ఎలా అవుతాయి?

 భారతీయ జ్యోతిష్యంలో గ్రహాలకూ,నక్షత్రాలకూ తేడా కూడా తెలియకుండా గ్రంథాలు రాశారు.

 సూర్యుడు నక్షత్రాలలో ఒకటి.
అది స్వయంప్రకాశం.
అదికూడా ఒక గ్రహంగా పేర్కొన్నారు. నవగ్రహాలకు వెలుగు వుండదు. గ్రహాలు సూర్యుని వెలుగు స్వీకరిస్తాయి.

నవగ్రాహలలో రాహువు, కేతువు అనేవి కేవలం గ్రహణం సందర్భంగా ఏర్పడే నీడ మాత్రమే.

 అదికూడా గ్రహంగా భావించడం తెలియకనే.
భూమి చుట్టూ తిరిగే చంద్రుణ్ణి కూడా గ్రహాల్లో చేర్చారు.

ఈ విధంగా ఖగోళశాస్త్రానికి భిన్నంగా లోపభూయిష్టంగా వున్న భారతీయ జ్యోతిష్యం యింకా ఎందరినీ నమ్మిస్తున్నదంటే, మనం ఎంత వెనుకబడివున్నామో గ్రహించాలి.

మూఢనమ్మకాలు మన గుత్తాధిపత్యం కాదు. యూరోప్, అమెరికాలలో సైతం జ్యోతిష్య వ్యాపారం సాగుతూనే వున్నది.
ఒక రంగంలో చదువుకున్నవారు తమకు తెలియని ఇతర రంగాల విషయాలన్నీ అద్భుతాలని భావిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రిక జ్యోతిష్యాన్ని ప్రచురించడంలేదు.
కాని వాషింగ్టన్ పోస్టు వంటివి రాశిఫలాల్ని వేస్తున్నాయి.
అమెరికా మూఢనమ్మకాల వ్యతిరేకసంఘం విజ్ఞప్తి చేయగా,

కొన్నిసార్లు పత్రికలు జ్యోతిష్యం అసలే మానేశాయి. పాఠకులను వంచించటంలో భాగమే జ్యోతిష్యం ప్రచురించడం.

శాస్త్రజ్ఞులు ఖగోళ పరిశీలన చేసిన అనంతరం గ్రహాలకు,
 నక్షత్రాలకు
ప్రాచీన గ్రీకు, రోమన్ దేవుళ్ళ పేర్లు పెట్టారు. అదికూడా మూఢనమ్మకాలను అట్టిపెట్టడానికి దోహదం చేస్తున్నది.

జ్యోతిష్యం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రాచీనులు భయంతో కథలు అల్లి,వాటినే నమ్మినట్లు తెలుసుకోవచ్చు.
మాఘ గ్రహాలకు, నక్షత్రాలకు,ఆకాశంలో జరిగే వాటికీ దైవ ప్రభావాన్ని చూచారు.

జ్యోతిష్యంలో పేర్కొనే గ్రహాల ఆధారంగా, ఆకాశంలో రాశిచక్రాలను వూహించారు.
ఆకాశాన్ని విభజించి రాశిచక్రాలు వేయడం పూర్వీకుల కట్టుకథల ప్రతిభకు నిదర్శనం.
 భారతీయులు, పాశ్చాత్యులు యీ పనిచేశారు. త్రిశంకుస్వర్గంవలె రాశులు కూడా మానవ సృష్టికి నిదర్శనమే.
రాసులు నిజంకాదు.
జ్యోతిష్యాన్ని శాస్త్రీయమని చూపాలనే ప్రయత్నంలో ఫ్రెంచి గణిత శాస్త్రజ్ఞుడు మైకెల్ గాక్విలిన్ చాలామంది పుట్టిన తేదీలు రాశిచక్రాలకు పొందిక వున్నట్లు పేర్కొన్నాడు. అయితే అన్ని సందర్భాలలో ఇది రుజువు కాలేదు. ఎవరు ఎన్ని తిప్పలు పడినా శాస్త్రీయం అని మాత్రం నిక్కచ్చిగా నిర్ధారించలేకపోయారు.

మన రాష్ట్రాంలో తెలుగు విశ్వవిద్యాలయం తెలుగుదేశం హయంలో దోణప్ప వైస్ ఛాన్సలర్ గా వుండగా, డిగ్రీ, డిప్లోమా జ్యోతిష్య కోర్సులు పెట్టింది.

 ఆ తరువాత సి.నారాయణరెడ్డి వైస్ ఛాన్సలర్ గా వుండగా హేతువాద సంఘం పక్షాన నేను అభ్యంతర పెట్టగా, నాకూ కొత్తపల్లి వీరభద్రరావుకూ ఒక సమావేశం ఏర్పరచారు.

వాదోపవాదాలు విన్న తరువాత, శాస్త్రీయమని రుజువుపరచడం యూనివర్శిటీ బాధ్యత అని నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.

డిగ్రీస్థాయిలో జ్యోతిష్యం తొలగించారు.

రామన్ అనే బెంగుళూరు జ్యోతిష్కుడు అభ్యంతరపెట్టి, రాజకీయవత్తిడి తీసుకరావడానికి ప్రయత్నించినా, నారాయణరెడ్డి లొంగకుండా, శాస్త్రీయమనే ఆధారాలు చూపమన్నారు.

రామన్ చూపలేకపోయారు.

డిప్లోమా కోర్సు నుండి జ్యోతిష్యాన్ని తొలగించమని వైస్ ఛాన్సలర్ పేర్వారం జగన్నాధంను కోరగా, ఆయన సెనెట్ లో చర్చకు పెట్టారు.
సెనెట్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

 శాస్త్రీయమని రుజువు చేయటానికి ముందుకు రాలేదు.

 యూనివర్సిటీల స్థాయి అలా వుంది. ఒక ఆస్పత్రిని పరిశోధనా కేంద్రంగా స్వీకరించి, పుట్టినవారిపై ఎలాంటి ప్రభావం వుంది, ఉత్తరోత్తరా జ్యోతిష్యం చెప్పినవి వారిపట్ల రుజువు అయ్యాయా, పరిశీలించే బాధ్యత యూనివర్సిటీపై వుంది.

 కేవలం కొందరికి ఉద్యోగాలు కల్పించే నిమిత్తం యిలాంటి కోర్సులు పెడితే, ఆ కోర్సుల డిగ్రీలు పట్టుకొని, వారు మరికొందరికి హానిచేయవచ్చు. యూనివర్శిటీలు బాధ్యతారహితంగా, రాజ్యాంగవిరుద్ధంగా వున్నాయనడానికి (51Ah నిబంధన) ఇదొక ఉదాహరణ.

జ్యోతిష్యంలో చంద్రుడిని గూర్చి చిలవలు పలవలుగా పేర్కొంటారు. భూమికి ఉపగ్రహమైన చంద్రుడిలోకి యంత్రాల్ని పంపడం, మానవులు వెళ్ళి అక్కడి పదార్ధం తేవడం, పరిశీలించడం జరిగింది. అయినా చంద్రుడిపట్ల కట్టుకథలు చెబుతూనే వున్నారు. చంద్రుడి ప్రభావం పెద్ద స్థలాలపైనా, సముద్రాలపైనా వుంటుంది. చిన్నస్థలాల మీద నదులు, చెరువుల మీద వుండదు. మనుషులపై ఎలాంటి ప్రభావం లేదు. గురుత్వాకర్షణ శక్తి పెద్దవాటిపైనే వున్నట్లు స్పష్టంగా రుజువైంది. అమావాస్య, పున్నమి పేరిట చెప్పే చంద్రుడి ప్రభావ కథలన్నీ వినోదించేవిగాని, నమ్మవలసినవి కావు. మనుషులు వెళ్ళి వచ్చిన చంద్రుడు వేరు. మత గ్రంథాలు పేర్కొనే చంద్రుడు వేరనే మూర్ఖ నమ్మకస్తులూ వున్నారు.

మనపై మనకు విశ్వాసం, ధైర్యం లేనప్పుడు జ్యోతిష్యం వంటి బలహీనతలు చోటుచేసుకున్నాయి.

డాక్టర్. నరిసెట్టి ఇన్నయ్య‌‌‌
- హేతువాది, మార్చి 1994.

సౌ జ న్య  o - whatup message