Pages

సైన్సుపై యుద్ధం దేశాభివృద్ధికి ఆటంకం..


భారత దేశంలో సైన్సుపై యుద్ధం జరుగుతోంది. దేశం నుండి సైన్సును, శాస్త్రీయ దృక్పథాన్ని నిర్మూలించి బర్బర రాజ్యాన్ని స్థాపించడం కోసం తాలిబాన్ల తరహాలో ప్రయత్నం సాగుతోంది. విశేషమేమంటే సైన్సుపై జరుగుతున్న ఈ యుద్ధానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, బాబాలు, యోగులు ఇతర కాషాయ పరివార ఆయనను అనుసరిస్తున్నారు. 
''సైన్సు మనల్ని అహేతుక భావజాలం నుండీ, పాక్షిక దృక్పథాల నుండీ కాపాడుతుంది'' అని రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ కొద్ది సంవత్సరాల క్రితం చెన్నరులోని భారతీయ విద్యాభవన్‌ నిర్వహించిన ఒక స్మారకోపన్యాసంలో పేర్కొన్నారు. జోతిష్యం, రసవాదం రెండూ మిధ్యాశాస్త్రాలనీ, పాజిటివ్‌, నెగెటివ్‌ ఎనర్జీ అని దొంగ వైద్యులు, దొంగ బాబాలు చెప్పేవన్నీ పనికిమాలిన మాటలనీ ఆయన పేర్కొన్నాడు. 
ఈ మాటలు చెప్పినందుకు రామకృష్ణన్‌ భారత దేశంలో ఉండి ఉంటే కాషాయ సైన్యం ఈపాటికి ఆయనపై దేశద్రోహం ముద్ర వేసి వెళ్లగొట్టేది. కానీ ఆయన దేశానికీ, అశాస్త్రీయ భావాలకూ దూరంగా ఉండి స్వేచ్ఛగా పరిశోధనలు చేయబట్టి నోబెల్‌ బహుమతి సాధించే వరకు వెళ్లారు. 
''సైన్సు ఆధారంగా చేసే నిర్ణయాలతో పోలిస్తే మూఢనమ్మకాల సంస్కృతిపై ఆధారపడి చేసే నిర్ణయాలు ఎల్లప్పుడూ నష్టదాయకంగా ఉంటాయి'' అని ఆ నోబెల్‌ బహు మతి విజేత చెప్పారు. మనం చెప్పే విషయాలు సరైనవేనని తేలాలంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో నిరూపితమవ్వాలి, అంతే కాని ఇక్కడ జరిగింది, అక్కడ ఎవరో చేశారు అని చెప్పే మాటల ద్వారా లేక ఎక్కడో యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల ద్వారా వీటిని నిరూపించలేం అని రామకృష్ణన్‌ స్పష్టం చేశారు. 
మరి మన నాయకులు ఏం చెబుతున్నారు? 
మన పురాణాల్లో ఉన్న వినాయకుడు ప్లాస్టిక్‌ సర్జరీ చేయడం వల్ల అలా ఏర్పడ్డాడని ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల క్రితం ముంబయిలో జరిగిన వైద్య నిపుణుల సదస్సులో చెప్పారు. ఆయన ఇంకో విషయాన్ని కూడా కనిపెట్టారు. మహాభారతంలో కర్ణుడు జనిటిక్‌ ఇంజినీరింగ్‌ వల్ల పుట్టాడని చెప్పారు. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ మూఢత్వంలో ప్రధానిని మించిపోయారు. ''చార్లెస్‌ డార్విన్‌ పరిణామ వాదం తప్పు. ఎందుకంటే నరవానరం మనిషిగా మారడాన్ని ఎవరూ చూడలేదు'' అని మంత్రివర్యులు సెలవిచ్చారు. ఈయనగారి అజ్ఞానపు వ్యాఖ్యలు ప్రపంచమంతా మీడియాలో చూసి ప్రజలు నవ్వుకున్నారు. పరిణామం అనేది ఒకటి రెండు సంవత్సరాల్లో జరిగేది కాదనీ కొన్ని వేల లక్షల సంవత్సరాల్లో జరిగే క్రమం అని కూడా తెలియని అజ్ఞాని భారత దేశ విద్యాశాఖను ఏలుతుంటే మన దేశం నవ్వుల పాలు కాక ఏమవుతుంది? 
2017 సెప్టెంబర్‌లో ఈయనగారే బెంగళూరు ఐఐటిలో మాట్లాడుతూ... రామాయణంలో పేర్కొన్న 'పుష్పక విమానం' లాంటి 'ఆవిష్కరణల' గురించి ఐఐటి విద్యార్థులకు బోధించాలని సలహా ఇచ్చారు. ''అమెరికాకు చెందిన రైట్‌ బ్రదర్స్‌ విమానాన్ని కనుగొనడానికి ఎనిమిదేళ్ల ముందే శివకర్‌ బాబూజి తాల్పాడే అనే భారతీయుడు విమానాన్ని కనుగొన్న విషయం మీకు తెలుసా? ఐఐటి విద్యార్థులకు ఈ విషయాలు బోధిస్తున్నారా?'' అని ఆయన ప్రశ్నించారు. కానీ తాల్పాడే సిద్ధాంతాల ద్వారా విమానం తయారు చేయడం సాధ్యం కాదని బెంగళూరు ఐఐటి వెలువరించిన అధ్యయన గ్రంథంలో తేల్చి చెప్పింది. 
నోబెల్‌ బహుమతి గ్రహీత రామకృష్ణన్‌ చెప్పినట్లు ఆధారాలు లేని, ప్రయోగాల్లో నిగ్గుతేలని విషయాలు పట్టుకుని వాటినే సైన్సుగా నమ్మించడానికి సంఫ్‌ు పరివార్‌ శక్తులు నిత్యం ప్రచారం చేస్తుంటే, దేశాన్ని నడపాల్సిన ప్రధాని, మంత్రులు కూడా ఇదే దారిలో వెళ్లడం మన దేశంలో నిజమైన సైన్సు అభివృద్ధిని ఆటంక పరుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నిజమైన సైన్సును మరుగున పరిచి అశాస్త్రీయమైన విషయాలను ముందుకు తెచ్చి వాటినే సైన్సుగా భ్రమింపజేసేందుకు ప్రధాన మంత్రి నుండి కింది వరకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారు. బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్‌లో ఒక రకమైన యోగా చేస్తే క్యాన్సర్‌ వ్యాధి తగ్గిపోతుందని కేంద్ర మంత్రి ('ఆయుష్‌' శాఖ) శ్రీపాద్‌ నాయక్‌ 2016లో చెప్పారు. దాన్ని తను నిరూపిస్తానని కూడా చెప్పారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఆయన ఇంకా నిరూపించలేదు. హర్‌ద్వార్‌కు చెందిన బిజెపి ఎంపీ ఇటీవల లోక్‌సభలో మాట్లాడుతూ ''లక్షల సంవత్సరాల క్రితమే రుషి కణాదుడు అణు పరీక్ష జరిపాడని'' పేర్కొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రతి జంతువూ ఆక్సిజన్‌ పీల్చుకుని కార్బన్‌ డై ఆక్సయిడ్‌ విడుదల చేస్తుందని మనకు తెలుసు. కానీ రాజస్థాన్‌ బిజెపి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి వాసుదేవ్‌ దేవ్నాని ''ఆవు మాత్రమే ఆక్సిజన్‌ పీల్చుకుని ఆక్సిజన్‌ విడుదల చేస్తుందని' చెప్పాడు. ఆయనే మరో గొప్ప విషయాన్ని కూడా చెప్పాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ కనుగొన్నాడని మనందరికీ తెలుసు. కానీ న్యూటన్‌ కన్నా వెయ్యేళ్ల క్రితమే రెండవ బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టాడని దేవ్నాని కనిపెట్డారు. అస్సాం బిజెపి ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రి ''ప్రజలు చేసుకున్న పాపాల వల్ల క్యాన్సర్‌ వస్తుందని'' కనిపెట్టారు. వైద్య మంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు రావడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గాడు. 
కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ యోగా వ్యవసాయం గురించి కనిపెడితే, మరో కాషాయ 'వ్యవసాయ వేత్త' సుభాష్‌ పాలేకర్‌ ఆవు మూత్రంతో వ్యవసాయం కనిపెట్టారు. ''పాజిటివ్‌ ఆలోచనల సహాయంతో విత్తనాలకు శక్తి సమకూర్చడమే యోగా వ్యవసాయ రహస్యం'' అని కేంద్ర మంత్రి చెప్పారు. ''పరమాత్మ శక్తి కిరణాలతో మనం విత్తనాల సామర్థ్యాన్ని పెంచగలం'' అని ఆయన చెప్పారు. 'ఆవు పేడ, మూత్రం'తో వ్యవసాయం చేసే విధానంపై సుభాష్‌ పాలేకర్‌ వందలాది మంది వ్యవసాయ శాస్త్రవేత్తలకు 'లెక్చర్లు' ఇచ్చారు. దీనికోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారు. 'ఆవు పేడ, మూత్రం చాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యాలయాలతో ఇక పని లేదు' అని పాలేకర్‌ పదే పదే ప్రకటించడంతో రాష్ట్రం లోని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఈ నేతల బాటలోనే కింది స్థాయిలో కాషాయ పరివారం పని చేస్తూ, సైన్సుపై తమదైన శైలిలో దాడులకు దిగుతోంది. తాయెత్తులు, వాస్తు దోషాలు, అదృష్ట యంత్రాలు, రంగు రాళ్లు, జోశ్యాలు.. ఒకటేమిటి సమాజంలోని మూఢ నమ్మకాలన్నిటినీ వినియోగించుకుని ప్రజల భావజాలంపై దాడులు చేస్తున్నారు. బాబా రామ్‌దేవ్‌ లాంటివారు ఈ నమ్మకాల ఆధారంగా వేల కోట్ల రూపాయల వాణిజ్య సామ్రాజ్యాలు నిర్మించేస్తున్నారు. 
భారత దేశం శాస్త్రీయ దృక్పథం, ఆలోచనలతో మాత్రమే ముందుకు పురోగమిస్తుందని భావించిన మన జాతి నిర్మాతలు రాజ్యాంగంలో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. 
పౌరుల ప్రాథమిక విధులను గురించి వివరించే రాజ్యాంగం లోని 51 ఎ అధికరణంలో... ''శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, అన్వేషణ, సంస్కరణ స్ఫూర్తినీ పెంపొందించడం'' ప్రతి పౌరుని ప్రాథమిక విధిగా పేర్కొన్నారు. 
ఇలా రాజ్యాంగంలో పేర్కొన్నారంటే మన దేశ పరిస్థితుల్లో దానికో ప్రాధాన్యత ఉంది. దేశంలో విస్తారమైన ప్రజానీకం నిరక్షరాశ్యులుగా ఉండడం, సమాజంపై ఫ్యూడల్‌ ఆలోచనా ప్రభావం బలంగా ఉండడం, సుదీర్ఘ కాలం దేశం వలస పాలనలో మగ్గడం... ఈ కారణాల రీత్యా స్వాతంత్య్రానంతరం దేశం పురోగమించాలంటే ప్రజల ఆలోచనా విధానం అభివృద్ధికర మార్గంలో సాగాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ అంశాన్ని చేర్చారు. 
శాస్త్రీయ దృక్పథం (సైంటిఫిక్‌ టెంపర్‌) అనేది ఒక జీవన విధానం. ఆధునిక సైన్సు ఏ పద్ధతుల్లో అభివృద్ధి చెంది నేడు మానవాళికి సేవ చేస్తోందో ప్రజలు కూడా రోజువారీ జీవనంలో అటువంటి పద్ధతులు అనుసరించాలని దీనర్ధం. శాస్త్రీయ పద్ధతిలో ప్రతి దాన్నీ ప్రశ్నించడం, భౌతిక వాస్తవికతను పరిశీలించడం, పరీక్షించడం, సైద్ధాంతీ కరించడం, విశ్లేషించడం, ఇతరులకు చెప్పడం అనే క్రమం ఉంటుంది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలంటే ప్రజల్లో తర్కం, చర్చ, వాదన, విశ్లేషణ వంటి గొప్ప ధోరణులను అభివృద్ధి చేయాలి. 
యూరప్‌లో లిబరల్‌ బూర్జువా వర్గం ఈ దృక్పథాన్నే ఆయుధంగా చేసుకుని ఫ్యూడల్‌ శక్తులపై పోరాడి పారిశ్రామిక విప్లవం సాధించింది. అభివృద్ధి చెందింది. మన దేశంలో కూడా స్వాతంత్య్ర పోరాటంలో లిబరల్‌ బూర్జువా వర్గం ఈ ఆయుధాన్నే ఉపయోగించుకుంది. నిజానికి శాస్త్రీయ దృక్పథం అనే మాటను వాడింది మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. ఈ ధోరణి మన దేశంలో పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక పునాది పడడానికి ఎంతగానో తోడ్పడింది. 
కానీ కాషాయ పరివారం ఇప్పుడు శాస్త్రీయ దృక్పథానికీ, విజ్ఞాన శాస్త్రానికీ విరుద్ధమైన భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. 'అన్నీ వేదాల్లోనే ఉన్నాయష' అంటూ ఏ చాందసత్వాన్నయితే మహాకవి గురజాడ ఈసడించుకున్నారో ఆ చాందసవాదం నేడు గద్దెనెక్కి మనల్ని పరిపాలిస్తోంది. ఈ చాందసవాదం నేతల ప్రకటనలకే పరిమితం కాలేదు. పాలకుల అండతో పాఠ్య పుస్తకాల ద్వారా, మీడియా ద్వారా, చాందసవాదుల అశాస్త్రీయ కార్యకలాపాల ద్వారా ప్రజల మస్తిష్కాలను ఆవహించేస్తోంది. ప్రతి రోజూ టీవీ కార్యక్రమాల ద్వారా, సినిమాల ద్వారా, పత్రికల శీర్షికల ద్వారా ఎన్నెన్ని మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ భావాలు ప్రచారం అవుతున్నాయో చూస్తున్నాం. 
బిజెపి దాని వెనుకనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక వ్యూహంలో భాగంగానే సైన్సుపై దాడి చేస్తున్నాయి. దేశంలో హిందూమత రాజ్యం ఏర్పాటు చేయాలని అవి ప్రయత్నిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రాండ్‌ ప్రాజెక్టులో అదో భాగం. అందుకే వారు ఆధునిక సైన్సుపై దాడి చేస్తూ ప్రాచీన భారత సమాజంలో ఘనీభవించిన మూఢ నమ్మకాలను సైన్సుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి తద్వారా వారు ప్రాచీన భారత సమాజంలో అభివృద్ధి చెందిన సైన్సుకు కూడా ద్రోహం చేస్తున్నారు. మన దేశ చరిత్రలో సైన్సు ఒక దశ వరకు అభివృద్ధి చెంది తరువాత ఫ్యూడల్‌ యుగంలో ఇటువంటి చాందస భావాలు పెరగడం వల్ల దాని అభివృద్ధి ఆగిపోయింది. సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రజాస్వామ్య భావాలు పరిఢవిల్లిన పారిశ్రామిక యూరప్‌లో అది అభివృద్ధి చెందింది. 
మన దేశంలో కూడా సైన్సు మళ్లీ ఉరకలెత్తాలంటే ప్రజల్లో శాస్త్రీయ భావాలు పెరగాలి. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారం చేస్తున్న చాందస భావాలకు అడ్డుకట్ట వేయాలి. ఈ సందర్భంగా మనం ప్రొఫెసర్‌ రామకృష్ణన్‌ చెప్పిన ఈ వాక్యాలు మననం చేసుకోవాలి: ''దేశంలో ఎవరు ఏ మాంసం తినాలి అన్న ఈ చెత్త వాదనలు, మతం పేరుతో ఈ గుంజాటనలు దేశానికి నష్టదాయకం. ఈ వాదనలు చేస్తున్నవారు తమను తాము దేశభక్తులమని మురిసిపోవచ్చు గాక. కానీ వాస్తవానికి వారు దేశాన్ని నష్టపరుస్తున్నారు...ఆధునీకరణ, పారిశ్రామీ కరణ విషయంలో ఇప్పటికే మనం చైనా కన్నా బాగా వెనుకబడిపోయాం. వాళ్లు కృత్రిమ మేథస్సును పెద్ద ప్రాధాన్యతగా తీసుకుని పురోగమిస్తున్నారు. రోబోటిక్స్‌ మీద, పునరుత్పత్తి ఇంధనాల మీద పెట్టుబడి పెడుతున్నారు. రానున్న కాలంలో ఇది పెద్ద మార్పును తీసుకొస్తుంది. భారతదేశం ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే బాగా వెనుకబడిపోతుంది.'' 
ప్రజలు శాస్త్రీయ దృక్పథం నుండి తప్పుకుంటే ఏమవుతుందో ఈనాడు మనం ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ వంటి దేశాల్లో చూస్తున్నాం. ఒకప్పుడు ఆధునికతవైపు అడుగులేస్తున్న ఈ దేశాలపై అమెరికా దాడి చేసి చాందస శక్తులను పెంచి పోషించిన ఫలితంగా నేడు అక్కడ చీకటి శక్తులు రాజ్యమేలుతున్నాయి. పౌర హక్కులు, ప్రజాస్వామ్యం లేని అంధ యుగం లోకి ఆ దేశాలను తీసుకుపోయాయి. 
భారతదేశం కూడా ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ప్రజల మస్తిష్కాలపై చాందస శక్తులు పూర్తి విజయం సాధించకుండా అడ్డుకోవాలి. దీనికి ప్రజల్లో సైన్సునూ, శాస్త్రీయ దృక్పథాన్నీ ప్రచారం చేయడం అవసరం.