ప్రశ్న : ఆత్మ ఉందా? ఉంటే శాస్త్రీయంగా నిరూపితమయిందా? పునర్జన్మ వుందా? పరకాయ ప్రవేశం సాధ్యమా?
జవాబు : ఉన్నదాన్నే ఉన్నదన్నట్లు శాస్త్రీయంగా ఋజువుల కోసం శాస్త్రజ్ఞులు అన్వేషిస్తారు.
ఉన్నదనుకొన్నది ఏ విధమైన పరిశోధనల ద్వారానూ ఋజువు కానప్పుడు ఆ ఉన్నదనుకొన్నది కేవలం
అబద్దమని శాస్త్రం చెబుతుంది. దాని ఉనికికి ఏ విధమైన ఆధారాలు లేవని వ్యక్తీకరిస్తుంది.
ఉన్నదనుకొన్నదేదీ? దాని లక్షణాలు ఏ విధంగా వున్నాయనుకొంటున్నారు?
వంటి ప్రశ్నలకు వచ్చే జవాబుల ఆధారంగానే ఉన్నదనుకొంటున్నది ఉందా
లేదా అని ప్రయోగాలు చేస్తారు. అదే శాస్త్రీయ పద్దతి. ఆత్మ కూడా ఈ కోవలోకే చెందింది.
'ఆత్మ' అంటే ఏమిటి?
అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం ఆధారంగానే ఆత్మ వుందాలేదా అన్న
విషయం విదితం అవుతుంది. మనం విన్న కథలు, పురాణాలు,
ఉపదేశాలు, విశ్వాసాలు ప్రకారం
'ఆత్మ' అనేది ప్రతి జీవిలోనూ
ఉన్న జీవానికి ప్రతినిధి. 'ఆత్మ' అనేది లేకుంటే ప్రతి జీవి మృతజీవి లేదా నిర్జీవ పదార్థమే. పని చేస్తున్న సెల్‌ఫోన్‌లోని పనితనానికి, జీవంతో వున్న మీరు, నేను మనలోని జీవన కార్యకలాపాలకి
కాసేపు సంధానిద్దాం. బాగా చార్జింగ్ అయిన సెల్‌ఫోన్ ను ఆన్ చేసిన వెంటనే ఎన్నో కార్యకలాపాల్ని
అది చేస్తుంది. అది నిర్వర్తించే కార్యకలాపాలు, పనులు, అనువర్తనాలు (applications) అన్నింటిని కలగలిపి 'పనిచేస్తున్న' సెల్‌ఫోన్ అంటాము. ఎవరయినా 'నీ సెల్‌ఫోన్ పనిచేస్తోందా
? పాడయ్యిం దా? అంటే మనం ఏమంటాము?'
'పని చేస్తోంది' అంటాము. లేదా
'పనిచేయడంలేదు పాడయ్యింది' అంటాము. ఓవరాల్‌గా ఫోన్ పని చేయడాన్ని 'ప్రాణి జీవం'గాను ఏ పని చేయని స్థితిని 'మరణం'గాను భావిద్దాం. మొబైల్
ఫోన్‌లాగే ప్రాణి ఎన్నో పనులు చేస్తుంది. నడుస్తుంది, మాట్లడుతుంది, ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఆలోచిస్తుంది,
పడుకొని మళ్లీ లేస్తుంది, కోపిస్తుంది, నవ్వుతుంది. ఇవన్నీ చేసే ప్రాణిలో ఓవరాల్‌గా
'జీవం వుంది' అంటాము.
సెల్‌ఫోన్‌లోని పదార్థాల,
నిర్మాణాల, అమరికల, సర్క్యూట్ల, విద్యుత్ప్రవాహక,
కాంతి విద్యుద్ధర్మాల, యాంత్రికతల తీరుతెన్నుల సమాహారంగానే సెల్‌ఫోన్ అన్ని విధాలయిన సంక్లిష్ట కార్యకలాపాలను
నిర్వర్తిస్తోంది. అందుకే సెల్‌ఫోన్ 'పనిచేస్తోంది'
అంటాము. మరి ఆ పని దేనివల్ల వీలయ్యింది. కేవలం బ్యాటరీల వల్లనా?
అయితే బ్యాటరీలను చెంబులో పెడితే చెంబు మరి సెలఫోనలాగా పని చేయదు
కదా! మరి సెల్‌ఫోన్ సంక్లిష్ట పనితీరుకు కారణం కేవలం ఆ సెల్‌ఫోన్‌లోని తెర మాత్రమే
కారణమా? మరి బ్యాటరీలను తీసేసిన తర్వాత తెర వెలగదే?
మరి తెర, బ్యాటరీలు రెండూ వుంటే
సెల్‌ఫోన్ పనిచేస్తుందా? లోపలున్న ఇంటిగ్రేటెడ్
సర్క్యూట్ బోర్డు మాత్రమే సెల్‌ఫోన్‌ను పనిచేయిస్తున్నదా? ఆ ఐసిబిని తీసుకెళ్లి జామెట్రీ బాక్సులో పెడితే ఆ జామెట్రీ బాక్సు సెల్‌ఫోన్ లాగా
పనిచేస్తుందా? పోనీ ఆ జామెట్రీ బాక్సుపైన సెల్‌ఫోన్ తెరను,
మరో పక్క బ్యాటరీలను పెడితే అపుడయినా అది సెల్‌ఫోన్ అవుతుందా? అలాగే తల మాత్రమే జీవం కాదు, గుండె మాత్రమే జీవం కాదు. కానీ గుండె లేకుండా జీవంలేదు. తెరలేకుండా సెల్‌ఫోన్
లేదు. కానీ తెర మాత్రమే సెల్‌ఫోన్ కాదు. బ్యాటరీ లేకుండా సెల్‌ఫోన్ పనిచేయదు. కానీ
బ్యాటరీ మాత్రమే సెల్‌ఫోన్ కాదు. అలాగే తల లేకుండా మనిషి లేకున్నా తల మాత్రమే మనిషి
కాదు. ఊపిరితిత్తులు లేకుండా మనిషి జీవంతో వుండడు. కానీ ఊపిరితిత్తులు మాత్రమే జీవంతో
ఉన్నాయని కాదు.
కాబట్టి ఎన్నో కణ జాలాల, శరీరభాగాల, అవయవాల, జీవ రసాయనాల, జీవ భౌతిక
వ్యవస్థల సమిష్టి వ్యవస్థే జీవంతో ఉన్న మనిషి. ఇందులో కీలకమైన అంశాలు లేనట్లయితే మనిషి
జీవంతో వుండడు. లేదా కీలకమైన అంశాల మధ్య సమన్వయం లేకున్నా మనిషి జీవంతో వుండడు. అంటే
'జీవం' అనే పదం ఏక వచనమే అయినా
జీవం ఒక వస్తువో, ఒక నిర్థిష్ట పరికరమో హద్దులు, పరిమాణాలు వున్న శిల్పం కాదు. 'దేశం' అన్న పదము ఏకవచనమే. కానీ దేశమంటే ఒక వస్తువా?
'ప్రభుత్వం' అన్న పదమూ ఏకవచనమే.
కానీ 'ప్రభుత్వం' అంటే ఒక కంప్యూటరా? అలాగే జీవం అనేది కూడా
సంక్లిష్ట పాదార్థిక, వివిధ శక్తి వినిమయాల,
భౌతిక రసాయనిక ప్రక్రియల సమిష్టి వ్యవస్థ. అయితే 'ఆత్మ' వాదులు మనిషి లేదా
జీవిలోని జీవాన్ని ఒక ఏకవచన నిర్దిష్ట పరికరం లేదా నిర్దిష్ట ఏకీకృత వస్తువుగా పరిగణిస్తారు.
అయితే ఆ వస్తువుకు రూపం వుండదు. 'జీవం' వున్న స్థితికి కూడా రూపం వుండదు. 'ఆత్మ'కు నిర్దిష్ట హద్దులు ఉండవంటారు. జీవం అన్న
స్థితికి కూడా నిర్దిష్ట హద్దులు వుండవు. 'ఆత్మ'కు నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదంటారు. 'జీవం' అనే స్థితికి కూడా నిర్ధిష్ట ద్రవ్యరాశి వుండదు.
ఇలా సంక్లిష్ట ధర్మాల, నిర్మాణాల,
వ్యవస్థల, రసాయనాల, యాంత్రికతల సమిష్టి ప్రతినిధిగా 'జీవం' అన్న పదాన్ని పరిగణిస్తాము. అదే 'జీవం' అన్న పదానికి 'ఆత్మ' అన్న పదాన్ని పర్యాయ
పదంగా వాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. వచ్చిన గొడవల్లా అక్కడ కాదు. కానీ 'ఆత్మ'వాదుల ప్రకారం 'ఆత్మ' బరువు, హద్దులు, రూపంలేని ఓ నిర్దిష్ట
పరికరం. అది చెంబులో నీళ్లున్నట్లు (ఆ నీళ్లకు బరువు ఉండదనే విధంగా, ఆ నీళ్లకు ఘన పరిమాణం వుండదనే విధంగా, ఆ నీళ్లు మంటలో పోసినా ఆవిరి కావన్న విధంగా) వుంటుంది. ఆ చెంబులో
నీళ్లను మరో చెంబులోనో, బకెట్లోనో,
తొట్టిలోనో పోసే విధంగా 'ఆత్మ' ఒక జీవి నుంచి మరో జీవికి బదలాయించుకొంటుంది.
ద్రవ్యరాశి, కాలం, రూపం (స్థల విస్తారం) అన్న రాశులు లేకుండా ఈ విశ్వంలో ఏదీ లేదన్నది శాస్త్రం. Every thing including vacuum has one or more of these attributes.. (ఉన్న ప్రతి వ్యవస్థకు ద్రవ్యరాశి గానీ, రూపంగానీ, కాలానుగుణ వ్యక్తీకరణ గానీ, విద్యుదావేశం గానీ ఉండితీరాలి. లేదా కొన్ని గానీ, అన్నీ గానీ వుండాలి) ఈ నిర్వచనానికి 'ఆత్మ'
వాదుల 'ఆత్మ' పొసగదు. 'కుక్క' అంటే ఫలానిది అన్న తర్వాత ఓ రూపానికి తోక వుండకుండా శరీరం వుండకుండా,
కాళ్లు ఉండకుండా, నోరు ఉండకుండా,
మొరగకుండా, చెవులు లేకుండా ఉంటే
ఆ రూపాన్ని 'కుక్క' అనలేము. అలాగే ఓ 'వ్యవస్థ'కు రూపం, స్థలం కాలానుగుణ పాదార్థిక
పరిమాణం లేనట్లయితే ఆ వ్యవస్థే లేదన్నది శాస్త్రం. కాబట్టి 'ఆత్మ' అనేది కూడా లేదు. ఎందుకంటే 'ఆత్మ' వాదులు ఆపాదించిన ధర్మాలున్న
వ్యవస్థకు వైజ్ఞానిక నిరూపణలు లేవు. ఒక జీవి చనిపోయాక మరో జీవికి ఆత్మ బదలాయించుకొంటుందన్నది
వారి వాదన. 'ఎ' అనే జీవిలో 'ఆత్మ' వుంది. అది బయటపడితే 'ఎ' మరణించినట్లు అర్థం. అది 'బి' అనే పదార్థంలోకి వెళితే 'బి'లో జీవం వున్నట్లు
అర్థం. 'బి' అనే రూపం సిద్ధంగా లేకుంటే 'ఎ' నుంచి బయటపడ్డ 'ఆత్మ'
కొంతకాలం 'దయ్యంగా' వుంటుంది. లేదా మరో కుక్క కడుపులోనో, స్త్రీ గర్భంలోనో ఉన్న 'బి' పిండంలోకో వెళ్లి 'బి'
అనే జీవిగా జన్మిస్తుంది. ఇదే 'ఎ' జన్మ 'బి' జన్మగా పునర్జన్మించినట్లు వారి వాదన.
ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైన భౌతిక (ద్రవ్యరాశి,
స్థలం, కాలానుగుణ పాదార్థిక
రూపం, విద్యుదావేశాల ప్రోదిక్ర రూపం DNA
(Deoxy Ribonucleic Acid). లేదా కనీసంలో కనీసం RNA
(Ribo Nucleic Acid) అయినా వుండాలి. DNA లేదా RNA లేకుండా జీవం అనే మాటకు అర్థం లేదు. నిర్మాణంతో సంబంధం లేకుండా ఆత్మ మాత్రమే జీవం అయినట్లయితే బల్ల రూపంలో జీవులు ఎందుకు
లేవు. ఉన్నట్లుండి ఓ శిల్పంలోకి ఆత్మ వెళ్లడం వల్ల శిల్పం జీవంతో వున్న శిల్పంగా మారడంలేదు.
కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు వున్నాడు. ఎన్నడయినా మట్టిరాయి మాట్లాడిందా?
కానీ మట్టి రాయి రూపంలో వున్న జీవులు వున్నాయి గానీ అందులో మట్టి
రాయిలాగా ముద్దగా లేదే. అందులో కణాలు, కణాల్లో కణాంగాలు,
కణాంగాల్లో ధర్మాలు, రసాయానాలు, ద్రవాలు, అణువులు, అణువులలో పరమాణు పొందికలు, పరమాణు పొందికల్లో నిర్దిష్ట అమరిక ఎందుకు ఉండాలి? ఆ నిర్మాణాల్ని అటూ యిటూ కదిపితే ఆ 'ఆత్మ' (జీవం) ఎందుకు పారిపోవాలి? (జీవి మరణించాలి?) మంటలో మండనిది,
నీళ్లలో తడవనిది లేశ మాత్రం పొటాషియం సైనైడు పడగానే పారిపోయే
పిరికిపందగా ఎందుకుంది? 'ఆత్మ'కు మార్పు లేనట్లయితే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఎందుకు వస్తున్నాయి? జబ్బులు ఎందుకు
వస్తున్నాయి? బల్లి తోక తెగితే తోక కూడా కదులుతుంది. తోక
తెంచుకున్న బల్లి కదులుతుంది. బల్లి తోకలోని కదలికలకు కారణమైన ఆత్మ ఎవరిది?
తోక తెంచుకున్న బల్లి కదలికలోని ఆత్మ ఎవరిది? ఆత్మను కత్తితో కోయలే మన్నారు కదా! అది ఎలా విభజించబడింది?
ఇలా ఎన్నో ప్రశ్నలకు రవంతయినా ఆమోద యోగ్యమైన సమాధానం ఆత్మవాదులు
యివ్వరు. 'ఆత్మ' అన్న ఆలోచనకు, నిర్వచనానికే అస్తిత్వంలేనపుడు, ఆత్మల బదలాయింపు తో జరుగుతాయన్న 'పునర్జన్మ' అన్న భావన పూర్తి అసంబద్ద ఆలోచన. పరకా య ప్రవేశం
అన్న దానికీ అర్థం పర్థం లేదు. ఈ శరీరం నుండి ఆ శరీరానికి వెళ్లింది ఏమిటి?
ఇదేమన్నా టెన్నిస్ బంతినా కాసేపు ఈ కోర్టులో కాసేపు ఆ కోర్టులోకి
వెళ్లడానికి..
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.