ప్రశ్న:- *విజ్ఞాన శాస్త్రానికి, సమాజానికి ప్రత్యక్ష సంబంధమంటూ ఏమైనా ఉందా ?*
జవాబు:- *మానవ సమాజాన్ని ప్రభావితం చేసిన ఎన్నో అంశాల్లో బలీయమైన అంశం: "శాస్త్ర సాంకేతిక రంగాలు". ఆదిమ మానవుడ్ని ఆధునిక మానవుడిగా తీర్చిదిద్దడంలో విజ్ఞాన శాస్త్రపు పాత్ర విప్లవాత్మకం. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తపస్సు ద్వారానో, కళ్లు మూసుకొంటేనే లేదా బీజాక్షరాన్ని నాలుక మీద రాస్తేనో మానవ సమాజానికి సంక్రమం కాలేదు. మానవజాతి సమస్తం యుగయుగాలుగా తరతరాలుగా తమ దైహిక శ్రమను, పరిణామ క్రమంలో ప్రత్యేకంగా ఇనుమడించిన మేధో శ్రమను జోడించి ప్రకృతిలో ఉన్న క్రమత్వాన్ని, అక్రమత్వాన్ని, వైవిధ్యాన్ని, సాధారణాన్ని, వరవడుల్ని, ఉత్పాతాల్ని, పరిశీలించడం ద్వారాను, ప్రకృతి విధించే సవాళ్లను ఎదుర్కొంటూ తమ వ్యక్తిగత, సామూహిక, సామాజిక అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు చేసే పోరాటం ద్వారాను ప్రకృతి సూత్రాలను అవగాహన చేసుకున్నారు. ఆ క్రమంలో వస్తువుల్ని ఉత్పన్న వస్తువులుగా, పరికరాలుగా మార్చుకున్నారు. పద్ధతుల్ని, ఉపాయాల్ని, సృజనాత్మకతతో క్రోడీకరించుకున్నారు.*
*"సైన్సు" ఏ కొద్దిమంది మేధావుల లేదా ప్రత్యేకమైన శక్తి గల కొందరి సృజనాత్మకత వల్ల మాత్రమే సంబంధించింది కాదు. ఇది ప్రజాబాహుళ్యపు సమిష్టి కృషి ఫలితం. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, సాంకేతిక పరికరాల రూపకర్తలది కేవలం ప్రజా బాహుళ్యపు శ్రమాధారిత శాస్త్ర సాంకేతిక రంగాల మానవ కార్యకలాపాలలో కేవలం నాయకత్వ పాత్ర మాత్రమే. సమాజం లేనిదే సైన్సు లేదు. సైన్సు లేని సమాజాన్ని ఊహించగలం గానీ, సమాజం లేని సైన్సు లేదు. వేదాలు ఉపనిషత్తులు శాస్త్ర గ్రంథాలు కావు. అవి మానవ సమాజం ఆచరించే శ్రామిక కార్యకలాపాలలోని కొన్ని సార్వత్రిక విషయాలకు జోడించబడ్డ భావోహ ప్రకటనలు మాత్రమే.*
*అసలు సిసలైన ప్రాయోజిక శాస్త్ర సాంకేతిక విషయాలు వ్యవసాయ రైతులు పంటలు పండించే ఏర్పాటుల్లోను, నాగలి దున్నడంలోను, పారలు పలుగుల్లోను ఉన్నాయి. ఆ పారను, పలుగును కొలిమిలో పెట్టి రూపకల్పనను, లాక్షణికతను ఒనగూర్చిన కమ్మరి చేతుల్లో ఉన్నాయి. ఖనిజాల్ని తవ్వి, వాటి నుంచి లోహాన్ని వెలికితీసిన గని కార్మికుల చేతుల్లో, మెదళ్లలో వున్నాయి. వీరందరికీ బట్టల్ని నార నుంచి దారపు పోగుల్ని తీసి వాటిని అల్లికలుగా చేసిన నేత పనివారి దేహ త్రిమితీయ లయల్లో వున్నాయి. మాసిపోయిన బట్టల్ని జాడించి బట్టపై కొడ్తే మలినం మాయమవుతుందన్న రజకుల రసాయన శాస్త్ర పరిజ్ఞానంలో ఉన్నాయి. ఫలానా నేలలోని మట్టికే (చవుడుకు) వస్త్రశౌద్ధ్య ధర్మాలున్నట్లు పురాణ గ్రంథాల్లోను, వేదోపనిషత్తుల్లోను లేదు. ఆ చదువులు రజకులకు లేవు.*
*పాదరక్షల్ని రూపొందించి, ఊహించి పరిపుష్టం చేసిన దళితుల కళాకోవిదంలో విజ్ఞాన గనులున్నాయి. ఏ చెట్టు పసరుకు ఏ లక్షణం ఉందో, ఏ పసరుతో ఏ వ్యాధి నయమవుతుందోనన్న శాస్త్రీయ పద్ధతిలో ప్రాచీన ఔషధాల్ని ఆవిష్కరించిన గ్రామీణ వైద్య పద్ధతుల్లో ఉన్నాయి. కుమ్మరి, కమ్మరి, బెస్త, పశుకాపర్లు తదితర వృత్తుల నిర్వహణలో సైన్సు వుంది. వీటి సమాకలనమే ప్రాచీన వైజ్ఞానిక భారతానికి వెన్నుదన్ను. భారతీయ శ్రామిక, జన కార్యకలాపాల్ని పరిశీలించిన మేధావులకే ప్రాచీన భారతీయ తాత్వికులు, గణిత పరిగణ్యులు, శిల్పులు, నేర్పరులు. వైజ్ఞానిక శాస్త్రపుటంశాలు విజ్ఞాన పరంపరతో తప్ప ఆకాశం నుంచి ఊడిపడవు.*
*జీవ పరిణామంలాగే, మానవ సామాజిక పరిణామంలానే వైజ్ఞానిక పరిణామం సాగింది. మానవ సామాజిక పరిణామ క్రమంతో అంతరికంగా, అనుబంధంగా సమాంతరంగా పెనవేసుకొని పెరిగినదే శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం. కోటి సంవత్సరాల క్రితమే మానవుడు భూమ్మీద ఉన్నాడనడం ఎంత అబద్ధమో, వేల సంవత్సరాల క్రితమే వైమానిక శాస్త్రం, ఆధునికంగా అమలవుతున్న వైద్య పరిజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం ఉన్నాయనడం అంతే అబద్ధం. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి సమాజంలోని ఉత్పత్తి, సంబంధాలకు లోబడి ఉంటుంది తప్ప అన్యధా కాదు. మానవుడు ఈ భూమ్మీద ఆవిర్భవించి 20 లక్షల సంవత్సరాలు కూడా కాలేదు. 450 కోట్ల సంవత్సరాల జీవావిర్భావ నిడివితో పోలిస్తే మానవావిర్భావం క్షణికాంశం. మానవుడికి లిపి తెలిసింది కేవలం 10 వేల సంవత్సరాల లోపే. ఆధునిక విజ్ఞాన శాస్త్రపు పరంపర కొన్ని శతాబ్దాలదే! అయితే కొలది కాలంలోనే మానవ సమాజంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్ని ఉత్పత్తి పద్ధతులు విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతే తీవ్రతతో విజ్ఞాన శాస్త్రమూ ఎదిగి శాఖోశాఖలుగా విస్తరించింది. విస్తరిస్తోంది.*
*మానవ సామాజిక మనుగడకు, ఆ సమాజం ఉపయోగించే వస్తువుల, పద్ధతుల ఉత్పత్తి సంబంధాలకు ప్రతిబింబంగానే శాస్త్ర సాంకేతికతా పరిజ్ఞానం సమాజంలో ఫరిఢవిల్లుతుంది. నేడు పదార్థపు పరిజ్ఞానం, కాలం, స్థలం గురించిన అవగాహన కనిష్ఠం గా క్వార్కుల స్థాయి నుంచి గరిష్ఠంగా కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాలబిలాల వరకు విస్తరించడానికి ప్రోదికూర్చింది సామాజికపుటoశాలే. నేలవిడిచి సాము చేయడం ఎంత అవాస్తవమో సమాజపుటావల సైన్సు ఉందనుకోవడం అంతే అవాస్తవం. సరిహద్దులు, జాతి, భాష, సంస్కృతి, లైంగికత వంటి విషయాలతో నిమిత్తం లేకుండా సకల లక్షణాల్ని, సార్వత్రికతను సాధించుకొన్నది, సంతరించుకొన్నది సమీక్షించుకొంటున్నది, సంరక్షించుకొంటున్నది శాస్త్రమే. అయినా శాస్త్ర సాంకేతిక ఫలితాలు వర్గ సమాజాల్లో అందరికీ ఒకే విధంగా ప్రయోజనకరంగా లేవు. సైన్సుకు వివక్షలేకున్నా, సాంకేతిక శాస్త్రాల ఉపయోగాల ఆచరణకు వర్గ విచక్షణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా నొప్పి, వేదన, కష్టం, దౌర్భాగ్య దుస్థితి, దైన్యత వంటి అనామోదిత లక్షణాల స్థానే సమ సమాజం, సార్వత్రిక వికాసం రావాలంటే ప్రజాసైన్సు ఉద్యమ కార్యాచరణ దిక్సూచి సాధనం. ఆ ఉద్యమాన్ని నడిపే రాజకీయ వేదికే రంగస్థలం. నేడు మతతత్వాన్ని పెంచుతున్న రాజకీయ నేపథ్యంలో శాస్త్రానికి ఆయువుపట్టు అయిన శాస్త్రీయత , శాస్త్రీయ దృక్పథం రుజువును కోరే హేతుబద్ధతలకు ఛాందస మేఘాలు ముసురుకొంటున్నాయి. సైన్సును కేవలం ఓ తంతులాగా భావించమంటున్నాయి. ఇది సైన్సు అభివృద్ధికి, సామాజిక ప్రగతికి ప్రతికూలం.* allikayala@gmail.com