Pages

అంబేడ్కర్‌ గారు దళిత విద్యార్థులను ఉద్దేశించి పూణె లో చేసిన ప్రసంగం



(బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్‌ గారు దళిత విద్యార్థులను ఉద్దేశించి 1938 సెప్టెంబరు 11 న పూణె లో చేసిన ప్రసంగం (BAWS - 18(2)))

ఈరోజు సమావేశం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిప్పటికీ సభికులలో ఎక్కువ శాతం విద్యార్థుల కంటే ఇతరులున్నట్టుగా కనపడుతున్నది. దీన్నే బియ్యం కంటే పప్పు ఎక్కువగా ఉన్న కిచిడీ అంటారు. ఈ సమావేశం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసింది కాబట్టి నేను ముఖ్యంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తాను.

ఈ మధ్య నేను అన్యాయాలకు కష్టాలకు లోనై క్షోభ పడుతున్న నిరక్షరాస్యులు, అమాయకులు అజ్ఞానులు అయిన కొందరు గ్రామస్తుల బాధలు తెలుసుకుంటూ వారికి సేవ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాను. అందుకే విద్యార్థి లోకానికి కేటాయించవలసిన సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. చాలామంది నేను విద్యార్థులను పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు, కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారికి నేనేమి చెప్పదలుచుకున్నాను అంటే.. ఏ ఒక్క వ్యక్తి కూడా వివిధ కార్యాలను ఖచ్చితమైన సామర్థ్యంతో నిర్వర్తించడు. ఒక రచయిత అన్నట్లుగా "మీకు విజయం కావాలంటే మీకు ఆత్మ కేంద్రమైన భావాలు ఉండాలి".. పైన పేర్కొన్న వాక్యం చాల లోతైన భావం కలిగింది ఒక వ్యక్తి చాలా పనులను తాను ఒక్కడే సాధించాలని నిర్ణయం తీసుకుంటే అప్పుడు అన్నిటికీ న్యాయం చేయడం అసాధ్యం అవుతుంది. ప్రతి పనిలో వేలు పెట్టి ఎందులోనూ నేర్పరి కాలేని చందాన ఉంటుంది. వివిధ రకాల పనులను చేపట్టి ఒక్క పని కూడా సవ్యంగా పూర్తి చేయలేక పోవడం అనేది సవ్యమైన మార్గం కాదు. సమాజ పరంగా చూస్తే మనకు చాలా పరిమితమై వనరులు ఉన్నాయి.

దానికనుగుణంగా మానవుడు ముందుగా చిన్న పనులకు పూనుకొని ఒక్కొక్కటిగా విజయం సాధిస్తూ పురోగమించాలి. అగ్ర వర్ణాల హిందువుల చేతుల్లో అల్లాడుతూ, అన్యాయపు వేధింపులకు గురైన ప్రజల విముక్తి కోసం నేను కృషి చేస్తున్నాను. అందువల్ల విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ చూపలేక పోతున్నాను. అలా అని నేను విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నానని కాదు. ఇందుకు విరుద్ధంగా, నేను రాజకీయాలలో, సమాజసేవలో తీరికలేకుండా ఉన్నప్పటికీ నేను నా జీవితాంతం విద్యార్థిగానే జీవిస్తాను

కుటుంబ వ్యవహారాలను గూర్చి పెద్దగా చెప్పలేను; కాబట్టి ఆ విషయాలపై నేను మీకు మార్గదర్శకత ఇవ్వలేను. కానీ విద్యార్థిగా మన ప్రవర్తన గురించి కొంత చెప్పగలను. నా అనుభవమే మీతో పంచుకుంటాను. ఒక సామాజిక వర్గం నుంచి చాలామంది విద్యాలయాలకు వెళ్లి పట్టాలు సాధించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? మరీ ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాలుగా విద్యాభ్యాసం ఆచూకీ కూడా లేని సమాజం నుంచి విద్యార్థులు వస్తే? గతంలో మీలో ఒక వ్యక్తి కూడా పట్టభద్రుడు అవ్వడం చూసి ఉండరు. కొన్ని రోజుల క్రితం కృష్ణా జిల్లాలో మన వర్గానికి చెందిన యువకుడు పట్టభద్రుడై తే అతడు ఎంతటి ప్రఖ్యాతిగాంచాడంటే, మీరు కేవలం బి. ఎ అనే పదాలు అతని పేరు చివర చేరిస్తే చాలు పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరాన్ని ఆయనకు చేరవేసేవాడు. ఈరోజు మన సమాజంలో చాలామంది పట్టభద్రులే ఉన్నారు. సరదాగా చెప్పాలంటే నేను గురి చూడకుండా ఒక చిన్న రాయి విసిరితే అది కచ్చితంగా ఒక బి. ఎ కి తగులుతుంది.

ఇప్పుడు మనలో చాలామంది డిగ్రీ పూర్తి చేసినప్పటికీ మనం ఎవరితో అయితే పోరాటం చేస్తున్నామో వారు మనకంటే చాలా ముందున్న విషయాన్ని గమనించాలి. ఈ రోజు అధికారంలో ఉన్న వారందరూ అగ్రవర్ణాలకు చెందినవారే. మీరు ఏదైనా కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగం కోసం అడిగితే మీకే ఉద్యోగాలు లేవు ఎందుకంటే అక్కడున్న పై అధికారులు ఖాళీలను వారి బంధువులతో భర్తీ చేస్తున్నారు కాబట్టి. మీరు పట్టభద్రులైనంత మాత్రాన మీకు ఉద్యోగాలు రావు. అగ్రవర్ణాల వారితో మిరు మీ మేధస్సుతో పోటీ పడకపోతే, మీ విద్య మీకు ఉపయోగపడదు. వాస్తవానికి మిమ్మల్ని, మీ పూర్వికులను వందల సంవత్సరాలు ఎలా అణగదొక్కారో అలాగే ఇప్పుడు కూడా మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తారు. మీ చదువు ఎలా ఉండాలంటే మన విద్యార్థులందరూ కలిసి ఈ ప్రపంచాన్ని ఏలే లాగ ఉండాలి. ఒక్క పట్టాతో సంతృప్తి చెందకండి మీ బాధ్యతలను గుర్తు పెట్టుకొని విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నించండి. నేను మొట్టమొదట బారిస్టరు అయినప్పుడు అందరు నన్ను హేళన చేశారు. కాని, నా కార్య నిర్వహణ పద్ధతితో వాళ్ళందరి నోళ్ళు మూయించాను.

మనం ధగధగలాడుతూ ప్రకాశించకపోతే మనకు గుర్తింపు, మర్యాద, గౌరవం దక్కవు. కాని ఇతర కులాల వారి పరిస్థితి ఈ విధంగా లేదు. బంగారమంత విలువైన మన పనిని ఇనుప రేకు విలువ అంత పరిగణిస్తారు. కానీ అగ్రకులాలవారు అయితే ఇనుపరేకు అంత పని చేస్తే బంగారం అంత విలువ ఇస్తారు. సమాజంలో కార్యకలాపాలు విధంగానే జరుగుతున్నాయి. ఒక అంటరానివారి మహిళ గాని, శుభ్రం చేసే వ్యక్తి భార్య గాని, చెప్పులు కుట్టుకునే వ్యక్తి భార్యగాని బంగారపు ఆభరణాలు ధరిస్తే అగ్రవర్ణాల వారు ఆ ఆభరణాలను నకిలీవంటారు. కాని అగ్రవర్ణాలకు చెందిన ఒక మహిళ ఇత్తడి ఆభరణాలు ధరించిన అవి బంగారం అని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులనే ఎక్కడికి వెళ్లినా మనం ఎదుర్కొంటాం. మనం చేసే పని విశిష్టమయినది అయితే మనకు గుర్తింపు పొందగలిగే అవకాశం వస్తుంది. ఈ కార్యసాధనకై మనం మనపై అపార నమ్మకం విశ్వాసం రూపొందించుకోవాలి.

మీ విశ్వాసం కంటే కూడా గొప్ప అతీతమైన శక్తి ఏదీ లేదు . మన విశ్వాసాన్ని మనం వీడకూడదు. ఉదాహరణకు రంగంలోకి దిగబోతున్న ఓ వస్తాదు భయస్తుడిగా పిరికివాడిగా ఉంటే అతను ఎలా పోరాటం చేయగలుగుతాడు? నాకు నేను ఎప్పుడూ అనుకుంటాను..నేనేమి కోరుకుంటానో అదే జరుగుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే నా విశ్వాసాన్ని నేను నాకే ప్రకటించుకుంటాను. కొందరు నన్ను అతివిశ్వాసపరుడిగా, గర్విష్టిగా పిలుస్తారు. కానీ అది నా గర్వం కాదు నా విశ్వాసం.

మీలాగే నేను కూడా అంటరాని మహిళకు పుట్టాను. నాకు ఇతరుల కంటే ఆరోగ్యకరమైన వాతావరణం కానీ, మెరుగైన సౌకర్యాలు లేవు. నేను ఒక చిన్న వంద అడుగుల గదిలో నా తల్లిదండ్రులతో సోదరీ సోదరులతో కలిసి జీవిస్తూ కిరోసిన్ లాంతరు గుడ్డి వెలుతురిలో చదువుకున్నాను. ఈ అడ్డంకులతో, విపత్తులతో పోరాడి అధిగమించి ఇవన్నీ సాధించగలిగాను అంటే ఆధునిక సౌకర్యాలు అనుభవిస్తున్న మీకు ఇవి సాధించడానికి ఎందుకు కష్టమవుతుంది? ఒక వ్యక్తి సమర్థుడిగా మేధావిగా కేవలం నిరంతర కృషితోనే తయారు కాగలడు.

ఏ వ్యక్తి కూడా నాయకుడిగా పుట్టడు. ఇంగ్లాండ్ లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎనిమిది సంవత్సరాలు పట్టే కోర్సుని రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే విజయవంతంగా పూర్తి చేశాను. దీని కోసం నేను రోజుకి 24 గంటలు కష్టపడ్డాను. ఈరోజు నా వయస్సు 40 సంవత్సరాలు దాటినప్పటికీ నిర్విరామంగా నేను పద్దెనిమిది గంటలు పని చేయగలను. కానీ నేటి తరం యువత మాటేమిటి? ఒక్క అరగంట సేపు పని చేస్తే చాలు విరామం కావాలి. మనస్సు మళ్ళించడానికి సిగరెట్ తాగడమో తాగటమో, కాళ్లు చాపుకుని పడుకుని ఉండటమో లేదా నస్యం పీల్చటమో చేస్తారు. ఈ వయస్సులో కూడా నాకు అటువంటి పదార్థాలు కానీ, విరామం కానీ, మార్పు కానీ అవసరం లేదు. సహనం, ఓర్పు, అంకితభావం అంటే అలా ఉండాలి.

నిర్విరామ, నిరంతర కృషి వల్లే విజయాన్ని సాధించగలుగుతారు. సులభంగా ఒక్క పట్టా పొందటం వల్ల మనం ఏమి సాధించలేము. డిగ్రీలు అంటే జ్ఞానం సంపాదించడం కోసం ఉపాధ్యాయుల సహాయంతో పోగుచేసిన విద్యా వనరులు. విద్యాలయానికి డిగ్రీలకు మేదస్సుకు ఎటువంటి సంబంధం లేదు. గొప్ప వ్యక్తుల జీవితాలనుండి మనం పాఠాలు నేర్చుకుని నిరంతరం జ్జానార్జన చేస్తూ ఉండాలి. పట్టభద్రులు అవగానే మనం విద్యనభ్యసించడం మానకూడదు.

జ్ఞానంతో పాటు మనకు నీతి, నైతిక విలువలు ఉండాలి. నైతిక విలువలు లేని విజ్ఞానం ఉపయోగం లేనిది. ఎందుకంటే జ్ఞానం ఒక ఆయుధం లాంటిది. ఒక వ్యక్తికి జ్ఞానం అనే ఆయుధంతో పాటు నైతిక విలువలు కూడా తోడైతే ఇతరులను అతను కాపాడగలుగుతాడు; కానీ ఆ వ్యక్తి నీతి లేనివాడు అయితే జ్ఞానం అనే ఆయుధాన్ని, ఇతరులను నాశనం చేయడానికి వాడతాడు. జ్ఞానం ఖడ్గం లాంటిది. దాని విలువ దానిని వాడే వారిపై ఆధారపడి ఉంటుంది. ఒక నిరక్షరాస్యుడు ఇతరులను మోసం చేయలేడు. అతనికి ఇతరులను మోసం చేసే కళ తెలియదు. కానీ ఒక చదువుకున్న వ్యక్తి సత్యాన్ని అసత్యంగా చూపి అసత్యాన్ని సత్యంగా చూపి తన వాదనతో ఒప్పించి మోసం చేస్తాడు. బ్రాహ్మణులు, వ్యాపారస్తులు ,ఇతర చదువుకున్న గ్రామస్తులు తమ జిత్తులమారి ఉపాయాలతో ఎలా మోసం చేస్తారో మీరు చూసే ఉంటారు. మీ నీతి, నైతిక విలువలు చాలా బలంగా ఉండాలి. చురుకుదనం మేధస్సు కనక మంచి భావాలతోనూ, నైతిక విలువలతోను తోడైతే వాటిని మొసం చెయడానికి దుర్వినియోగం చేయరు. నైతికత లేని విద్యావంతుల వల్ల సమాజం, జాతి నాశనం కావడం కచ్చితం. విద్యకంటే నీతి, నైతిక విలువలు ముఖ్యమైనవి కాబట్టి ప్రతి వ్యక్తికి మంచి నైతిక విలువలుగల గుణం ప్రధానం

నేను నా ప్రసంగం ముగించే ముందు రాజకీయాల గురించి కొన్ని మాటలు చెప్పటం నా భాద్యతగా భావిస్తున్నాను. సాధారణంగా మనవాళ్లు పేదరికం కారణంగా తమ జ్ఞానాన్ని తమ ఆహారం సంపాదించుకోవడానికి తప్ప దేనికి వాడరు. నేను వారిని నిందించలేను. ఈరోజు స్పృశ్యులైన హిందువులు తమ అధికారాన్ని నెలకొల్పుకున్నారు. కాబట్టి వారి పరిస్థితులు తృప్తికరంగాను, వారి పురోగతికి మార్గం అన్ని విధాలా సానుకూలంగా ఉంది. దీనికి విరుద్ధంగా మీ మార్గం ముళ్ళ తో నిండి ఉంది. కారణం కనుక్కోవడం పెద్ద కష్టమేమి కాదు. ముఖ్య కారణం మనం అల్పసంఖ్యాకులం కావడమే. అధికసంఖ్యాకులు మనల్ని ఎందుకు వేదిస్తున్నారంటే మనం సంఖ్యలో బలహీనులం. పైగా మనం ఎవ్వరమూ అధికార స్థానాలలో లేము కాబట్టి.


ఈరోజు న్యాయస్థానంలో అడుగుపెడితే మనకేం కనబడుతుంది. మ్యాజిస్ట్రీట్ బ్రాహ్మణుడు, గుమస్తా బ్రాహ్మణుడు, పోలీస్ అధికారి కూడా బ్రాహ్మణుడే. ఇటువంటి పరిస్థితుల్లో మనం కోర్టుకు వెళితే మనకు న్యాయం జరుగుతుందా? కచ్చతంగా జరగదనే చెప్పాలి. ఎన్నో తీర్పులు చెప్పే సమయంలో మేజిస్ట్రేట్ అంటరానివారి పక్షాన సాక్ష్యం చెప్పడానికి అంటరానివారే ఉన్నారు కాబట్టి వారిని నమ్మలేమని చెప్పారు. కానీ స్పృశ్యులు అయిన వారికి స్పృశ్యులే సాక్ష్యం చెబితే నమ్ముతారు. కాంగ్రెస్ నాయకులు సైతం కాంగ్రెస్ సభ్యలకు మాత్రమే సహాయం చేయడానికి అంగీకరిస్తారు. కాబట్టి మన వాళ్లు ఉన్నతస్థానాల్ని సాధించలేకపోతే అణచివేతను నిరోధించడం అసాధ్యం అవుతుంది. కానీ అటువంటి స్థానాలను మనం ఎలా సాధించాలి? దీని గురించి మీరు ఆలోచించాలి.

దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిగా మనల్ని మనం వ్యవస్థీకరించి కోవాలి. అందరు అంటరానివారు ఐక్యమత్యంతో ఉండాలి. మన వారు నిరక్షరాస్యులు వారు చదువుకోలేదు, ఆలోచించలేరు. పెత్తనం చేసే గ్రామస్థుల ప్రతి సలహాను, కోరికను అంగీకరిస్తారు. భయాల వల్ల తప్పుడు సలహాల వలన మనుష్యులు విడిపోయే గొప్ప ప్రమాదం ఉంది. చైతన్యం, ఐక్యమత్యం పెంచడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా? ఈ బాధ్యతను విద్యార్థులు నిర్వహించగలరో లేరో అని కొందరి అభిప్రాయం. విద్యార్థులు తమ విద్యార్థి జీవితంలో జ్ఞానం పెంచుకోవడానికి చేసే విశేష కృషిని ప్రశంసించాలి. కాని దానితో పాటు వారు సమాజాన్ని చైతన్యం చేయడానికి, ఐక్యమత్యం తీసుకొచ్చే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకోవాలి. మన స్వార్ధం పక్కకు జరిపి మన సంఘం ఏర్పాటుకు కృషి చేయాలి. మన సొంత లాభాల పైన కాకుండా సమాజ శ్రేయస్సు పైన మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

ఇక రెండవది మన పురోగతి అభివృద్ధి కోసం హరిజన్ సేవక్ సంఘం లాంటి వేల సంఘాలు ఏర్పడ్డాయి. కాని వారి లక్ష్యం నాకు అర్థం కావడంలేదు. వారి కృషి మానవాళి ఉద్దరణకా లేక కోడి పెట్టలుగా భావించి చంపే దుర్భుద్ధితో తిండిగింజలు మనపైన విసురుతున్నారా? ఇటువంటి సంస్థల వల్ల వచ్చే నష్టాలేంటి, లేక లాభలేంటి అని ఆలోచన చేయడం ఎంతైనా అవసరం. బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన ఇటువంటి సంస్థలను మన వాళ్ళు ఆశ్రయిస్తే, " నీకు అన్నం పెట్టిన వాడిపై అవిశ్వాసం చూపకు" అనే పాత నానుడి ప్రకారం మన స్వాభిమానాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మహాభారతంలోని ద్రోణాచార్య, భీష్మ ఉదాహరణలు మీకు బాగ తెలుసు. పాండవులవైపు న్యాయం ఉండగా, వారికి వ్వతిరేఖంగా ఉందుకు పోరాడుతున్నావని భీష్ముని అడిగితే, ఆయన చెప్పారు..అర్థస్యో పురుషో దాసః (,డబ్బు మనిషిని బానిసను చేస్తుంది) అగ్ర కులాలవారు స్తాపించిన అలాంటి సంస్థల నుండి లాభం పొందాల వద్దా అని మీరే నిర్ణయించుకోండి.

నేను మీకు ఇంకొక కథ చెప్ప గలను. పూర్వం దేవతలు, దానవులు యుద్ధం జరుగుతుంది. దానవుల గురువు శుక్రాచార్యుడికి సంజీవని మంత్రం తెలియడం వల్ల, యుద్ధభూమిలో కోల్పోయిన అందరికీ తిరిగి ప్రాణం పోసేవాడు. కానీ దేవతల వైపు ప్రాణాలు పోగొట్టుకుంటే, వారిని తిరిగి ప్రాణాలతో తీసుకురాలేకపోయారు. ఇందువలన రోజు రోజుకి దేవతల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. దేవతలందరూ వారిలో వారు చర్చించుకుని గురుపుత్రుడు, కచుడిని శుక్రాచార్యుని వద్దకు మారువేషంలో పంపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకనుగుణంగా కచుడు ఈ మంత్రాన్ని నేర్చుకోవడానికి శుక్రాచార్యుని వద్దకు వెళ్లాడు. మొదటగా అతను శుక్రాచార్యుని కూతురు దేవయానిని తనతో ప్రేమలో పడేసాడు. దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి కచునికి సంజీవనీ మంత్రం నేర్పించాలని బ్రతిమలాడింది. కాని, ఎప్పుడైతే దానవులకు కచుడి నిజ స్వరూపం తెలిసిందో అప్పుడే అతనిని చంపి కాల్చి బూడిద చేసి బూడిదని మద్యపానం లో కలిపి శుక్రాచార్యుడికి తాగమని ఇచ్చారు. శుక్రాచార్యుడు తన కూతురి కోరికమేరకు కచుడి కి సంజీవని మంత్రం నేర్పించాలన్న ఇప్పుడు అసాధ్యమే. ఎందుకంటే ఒకవేళ నేర్పించి కచుడ్ని ప్రాణాలతో తిరిగి తీసుకురావాలి అంటే మొదట తనను తాను చంపుకోవాలి. తన కూతురి కోరిక తీర్చడం కోసం శుక్రాచార్యుడు మద్యం ద్వారా తన కడుపులోకి చేరిన కచుడికి సంజీవని మంత్రం నేర్పించాడు. శుక్రాచార్యుడు మొదట కచుడుకి ప్రాణం పోయగా, కచుడు శుక్రాచార్యుని పొట్ట చీల్చుకొని బయటికి వచ్చాడు. తరువాత, తాను నేర్చుకున్న మంత్రం ఉపయోగించి శుక్రాచార్యుని బ్రతికించాడు. ఇదీ కథ. ఎప్పుడైతే పని పూర్తి అయ్యిందో , దేవయానిని వివాహం చేసుకుంటానని వాగ్దానం భంగం చేసి తన వర్గం వైపు అనగా దేవతల వైపు వెళ్ళిపోయాడు. చాలామంది కచుడికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడని అన్నారు. కానీ నేను అతను చేసిన పని కృతజ్ఞత లేనిదిగా భావించను. అతని . అడుగుజాడలలో మన విద్యార్థులు నడిస్తే నేనేమి బాధపడను. మీకు ఒక గొప్ప లోకోక్తిని గుర్తు చేయాలని అనుకుంటున్నాను.

" ఏ వ్వక్తి కూడా తన గౌరవాన్ని పణంగా పెట్టి కృతజ్ఞత చూపలేడు, ఏ స్త్రీ కూడా తన పవిత్రతని పణంగా పెట్టి కృతజ్ఞత చూపలేదు, ఏ దేశం కూడా తన స్వేచ్ఛని పణంగా పెట్టి కృతజ్ఞత చూపలేదు ".

గాంధీజీ గారు చెప్పే సత్యం, అహింస అనే మాటలు నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఎవరితో ఎప్పుడు సత్యం పలకాలి అనే మాటకు గాంధీ గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఒక ధనవంతుడు నా పొరుగువారు అనుకోండి. అతడి స్నేహితుడిగా తన ధనాన్ని ఎక్కడ దాచిపెడతాడో నాకు తెలుసు. ఇప్పుడు దొంగలు వచ్చి అతను తన ధనాన్ని ఎక్కడ దాచి పెట్టడని నన్ను అడిగితే నిజం చెప్పి నా స్నేహితుడికి నష్టం చేకూర్చ నా, అబద్ధం చెప్పి నా స్నేహితుడిని కాపాడనా? ఇలాంటి వందలాది ఉదాహరణలు ఇవ్వగలను..

నేను ముగించే ముందు, మీరు అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలరని చెప్తున్నాను. ఈ తరం వారు తమంతట తామే ముందుకు వచ్చి వేలాది సంవత్సరాలుగా మన వర్గం పై జరుగుతున్న అన్యాయాలను, అణచివేతను నిరోధించే బాధ్యతను తమ భుజాలపై వేసుకోవాలి. మన సమాజంలో ఐకమత్యం అత్యవసరం. మన లక్ష్యం పరస్పరాదారంతో కచ్చితంగా మనం సాధించవచ్చు. మీరు నిక్కచ్చిగా క్రమశిక్షణ అనుసరిస్తే ఏదైనా సాధ్యపడుతుంది. లేదా ప్రతి చోటా అవ్యక్త స్థితి ఏర్పడి సమాజ వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతివారు జాగ్రత్త వహిస్తూ ఐకమత్యం తో మెలగాలి. చివరగా మీ నైతికతను బలపరచుకోండి, వ్యవస్థీకరించుకోండి , క్రమశిక్షణ పెంచుకుని మీ కృషి తో మన సమాజాన్ని ఉద్దరించండి.

డా.బి.ఆర్.అంబేడ్కర్‌ ప్రసంగాలు, సంపుటం -1, తెలుగుఅకాడమి.
(సేకరణ.... ప్రేమ్ కుమార్, గుంటూరు)