Pages

బ్రాండెడ్ మందుల్లా జనరిక్ మందులు



*జనవిజ్ఞానవేదిక కృష్ణాజిల్లా*

ప్రశ్న:- *బ్రాండెడ్ మందుల్లా జనరిక్ మందులు పని చేయవంటున్నారు అది నిజమేనా*.. ?

జవాబు:- అందులో ఏమాత్రం నిజం లేదు. అవి వట్టి పుకార్లు మాత్రమే. బ్రాండెడ్ మందైనా లేదా జనరిక్ మందైనా, ఫార్ములా ఒకటైతే చాలు, రెండు మందులూ ఒకే విధంగా పని చేస్తాయి..

అసలు బ్రాండెడ్ మందులంటే ఎంటో, అలాగే జనరిక్ మందులంటే ఏంటో ముందు తెలుసుకుందాం..

ఏదైనా ఒక కొత్త మందును, ఒక ఫార్మా కంపెనీ మా‌ర్కెట్ లోకి తెస్తే, దానిపై ఆ కంపెనీకి 20 సం.లు పేటెంట్ హక్కులు ఉంటాయి..

అంటే ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా సరే, దానిని ఓ 20 సం.ల పాటు (కాపీ కొట్టి) వేరే ఎవరూ తయారు చేయకూడదు..

అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, దానిని మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే (ఆ మందుపై సదరు కంపెనీ పేటెంట్ గనక పొందితే) ఓ 20 సంవత్సరాల పాటు (పేటెంట్ హక్కులు లభించిన కంపెనీకి) గుత్తాది పత్యం ఉంటుంది..

వాస్తవాని ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు.. అంటే తయారీ ఖర్చు కంటే మందుయొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది..

అదేమంటే 'ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని' సదరు కంపెనీ వాదిస్తుంది..

కాబట్టే ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై, ( కంపెనీకి) పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం..

అలా మొదటి కంపెనీ, తన మందుకు ఒక పేరును కూడా పెట్టుకుంటుంది. ఆ మందుకు ఆ కంపెనీ పెట్టుకున్న పేరే "బ్రాండ్ నేం" లేదా ఆ మందును "బ్రాండెడ్ మందు" అంటారు. దానిపై ఆ ముందు యొక్క (కెమికల్) ఫార్ములా కూడా ఉంటుంది.

డాక్టర్లు ఎపుడూ మందు లేబుల్ పై ముద్రించబడి ఉండే ఈ ఫార్ములా పేరే రాయాలి, బ్రాండ్ నేం ఎపుడూ రాయకూడదు. ఒక వేళ బ్రాండ్ నేం రాయాలనుకుంటే.. ముందుగా ఆ మందు యొక్క ఫార్ములాను పెద్దక్షలాతో రాసి, ఆటుతర్వాత కింద బ్రాకెట్లో, చిన్నక్షరాలతో బ్రాండ్ నేం రాయవచ్చు..

ఇందాక చెప్పుకున్న ఉదాహరణలోని మందుపై మొట్టమొదటి కంపెనీ యొక్క పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును (అదే కంపెనీ లేదా మరేదైనా కంపెనీ) తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు..

అదే ఫార్ములాతో, అవే కెమికల్స్ తో అదే మందును వేరే కంపెనీ తయారు చేస్తే, ఆ మందుకు తను స్వంతంగా పెట్టుకున్న మరో పేరుతో మార్కేట్ లోకి విడుదల చేస్తుంది. అది కూడా బ్రాండ్ నేం కిందికే వస్తుంది. దాని రేటు కూడా అధికంగానే ఉంటుంది..

ఐతే ఒక మందుపై పేటెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత (అవే కెమికల్స్ తో, అవే ఫార్ములాతో తయారు చేసి) 30 నుండి 80 శాతం తక్కువ ధరలతో "జనరిక్" షాపుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలా తక్కువ ధరలకు, జనరిక్ షాపుల్లో అమ్మే మందులనే జనరిక్ మందులంటారు. వీటిపై ముద్రించబడే యం ఆర్ పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు..

బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి..

ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఎజెన్సీలకూ, మందుల షాపులకూ, ( కొన్ని సందర్భాలలో డాక్టర్లకు కూడా) అందరికీ నష్టమే కదా. అందుకనే జనరిక్ మందులపై, "అవి బ్రాంబెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు..

కాబట్టి మనలాంటి వాళ్ళం, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు ఈ విషయమై ప్రజలను చైతన్య పరచాలి. సమాన్య జనం సధ్యమైనంత వరకు తక్కువ ధరల్లో లభించే జనరిక్ మందులనే కొనుక్కునేలా మనమందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..
   ---
చెలిమెల రాజేశ్వర్, జేవీవీ, తెలంగాణ.


విజ్ఞాన శాస్త్రం - సమాజం

ప్రశ్న:- *విజ్ఞాన శాస్త్రానికి, సమాజానికి ప్రత్యక్ష సంబంధమంటూ ఏమైనా ఉందా ?*

జవాబు:- *మానవ సమాజాన్ని ప్రభావితం చేసిన ఎన్నో అంశాల్లో బలీయమైన అంశం: "శాస్త్ర సాంకేతిక రంగాలు". ఆదిమ మానవుడ్ని ఆధునిక మానవుడిగా తీర్చిదిద్దడంలో విజ్ఞాన శాస్త్రపు పాత్ర విప్లవాత్మకం. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తపస్సు ద్వారానో, కళ్లు మూసుకొంటేనే లేదా బీజాక్షరాన్ని నాలుక మీద రాస్తేనో మానవ సమాజానికి సంక్రమం కాలేదు. మానవజాతి సమస్తం యుగయుగాలుగా తరతరాలుగా తమ దైహిక శ్రమను, పరిణామ క్రమంలో ప్రత్యేకంగా ఇనుమడించిన మేధో శ్రమను జోడించి ప్రకృతిలో ఉన్న క్రమత్వాన్ని, అక్రమత్వాన్ని, వైవిధ్యాన్ని, సాధారణాన్ని, వరవడుల్ని, ఉత్పాతాల్ని, పరిశీలించడం ద్వారాను, ప్రకృతి విధించే సవాళ్లను ఎదుర్కొంటూ తమ వ్యక్తిగత, సామూహిక, సామాజిక అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు చేసే పోరాటం ద్వారాను ప్రకృతి సూత్రాలను అవగాహన చేసుకున్నారు. ఆ క్రమంలో వస్తువుల్ని ఉత్పన్న వస్తువులుగా, పరికరాలుగా మార్చుకున్నారు. పద్ధతుల్ని, ఉపాయాల్ని, సృజనాత్మకతతో క్రోడీకరించుకున్నారు.*


*"సైన్సు" ఏ కొద్దిమంది మేధావుల లేదా ప్రత్యేకమైన శక్తి గల కొందరి సృజనాత్మకత వల్ల మాత్రమే సంబంధించింది కాదు. ఇది ప్రజాబాహుళ్యపు సమిష్టి కృషి ఫలితం. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, సాంకేతిక పరికరాల రూపకర్తలది కేవలం ప్రజా బాహుళ్యపు శ్రమాధారిత శాస్త్ర సాంకేతిక రంగాల మానవ కార్యకలాపాలలో కేవలం నాయకత్వ పాత్ర మాత్రమే. సమాజం లేనిదే సైన్సు లేదు. సైన్సు లేని సమాజాన్ని ఊహించగలం గానీ, సమాజం లేని సైన్సు లేదు. వేదాలు ఉపనిషత్తులు శాస్త్ర గ్రంథాలు కావు. అవి మానవ సమాజం ఆచరించే శ్రామిక కార్యకలాపాలలోని కొన్ని సార్వత్రిక విషయాలకు జోడించబడ్డ భావోహ ప్రకటనలు మాత్రమే.*

*అసలు సిసలైన ప్రాయోజిక శాస్త్ర సాంకేతిక విషయాలు వ్యవసాయ రైతులు పంటలు పండించే ఏర్పాటుల్లోను, నాగలి దున్నడంలోను, పారలు పలుగుల్లోను ఉన్నాయి. ఆ పారను, పలుగును కొలిమిలో పెట్టి రూపకల్పనను, లాక్షణికతను ఒనగూర్చిన కమ్మరి చేతుల్లో ఉన్నాయి. ఖనిజాల్ని తవ్వి, వాటి నుంచి లోహాన్ని వెలికితీసిన గని కార్మికుల చేతుల్లో, మెదళ్లలో వున్నాయి. వీరందరికీ బట్టల్ని నార నుంచి దారపు పోగుల్ని తీసి వాటిని అల్లికలుగా చేసిన నేత పనివారి దేహ త్రిమితీయ లయల్లో వున్నాయి. మాసిపోయిన బట్టల్ని జాడించి బట్టపై కొడ్తే మలినం మాయమవుతుందన్న రజకుల రసాయన శాస్త్ర పరిజ్ఞానంలో ఉన్నాయి. ఫలానా నేలలోని మట్టికే (చవుడుకు) వస్త్రశౌద్ధ్య ధర్మాలున్నట్లు పురాణ గ్రంథాల్లోను, వేదోపనిషత్తుల్లోను లేదు. ఆ చదువులు రజకులకు లేవు.*

*పాదరక్షల్ని రూపొందించి, ఊహించి పరిపుష్టం చేసిన దళితుల కళాకోవిదంలో విజ్ఞాన గనులున్నాయి. ఏ చెట్టు పసరుకు ఏ లక్షణం ఉందో, ఏ పసరుతో ఏ వ్యాధి నయమవుతుందోనన్న శాస్త్రీయ పద్ధతిలో ప్రాచీన ఔషధాల్ని ఆవిష్కరించిన గ్రామీణ వైద్య పద్ధతుల్లో ఉన్నాయి. కుమ్మరి, కమ్మరి, బెస్త, పశుకాపర్లు తదితర వృత్తుల నిర్వహణలో సైన్సు వుంది. వీటి సమాకలనమే ప్రాచీన వైజ్ఞానిక భారతానికి వెన్నుదన్ను. భారతీయ శ్రామిక, జన కార్యకలాపాల్ని పరిశీలించిన మేధావులకే ప్రాచీన భారతీయ తాత్వికులు, గణిత పరిగణ్యులు, శిల్పులు, నేర్పరులు. వైజ్ఞానిక శాస్త్రపుటంశాలు విజ్ఞాన పరంపరతో తప్ప ఆకాశం నుంచి ఊడిపడవు.*

*జీవ పరిణామంలాగే, మానవ సామాజిక పరిణామంలానే వైజ్ఞానిక పరిణామం సాగింది. మానవ సామాజిక పరిణామ క్రమంతో అంతరికంగా, అనుబంధంగా సమాంతరంగా పెనవేసుకొని పెరిగినదే శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం. కోటి సంవత్సరాల క్రితమే మానవుడు భూమ్మీద ఉన్నాడనడం ఎంత అబద్ధమో, వేల సంవత్సరాల క్రితమే వైమానిక శాస్త్రం, ఆధునికంగా అమలవుతున్న వైద్య పరిజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం ఉన్నాయనడం అంతే అబద్ధం. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి సమాజంలోని ఉత్పత్తి, సంబంధాలకు లోబడి ఉంటుంది తప్ప అన్యధా కాదు. మానవుడు ఈ భూమ్మీద ఆవిర్భవించి 20 లక్షల సంవత్సరాలు కూడా కాలేదు. 450 కోట్ల సంవత్సరాల జీవావిర్భావ నిడివితో పోలిస్తే మానవావిర్భావం క్షణికాంశం. మానవుడికి లిపి తెలిసింది కేవలం 10 వేల సంవత్సరాల లోపే. ఆధునిక విజ్ఞాన శాస్త్రపు పరంపర కొన్ని శతాబ్దాలదే! అయితే కొలది కాలంలోనే మానవ సమాజంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్ని ఉత్పత్తి పద్ధతులు విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతే తీవ్రతతో విజ్ఞాన శాస్త్రమూ ఎదిగి శాఖోశాఖలుగా విస్తరించింది. విస్తరిస్తోంది.*
   
*మానవ సామాజిక మనుగడకు, ఆ సమాజం ఉపయోగించే వస్తువుల, పద్ధతుల ఉత్పత్తి సంబంధాలకు ప్రతిబింబంగానే శాస్త్ర సాంకేతికతా పరిజ్ఞానం సమాజంలో ఫరిఢవిల్లుతుంది. నేడు పదార్థపు పరిజ్ఞానం, కాలం, స్థలం గురించిన అవగాహన కనిష్ఠం గా క్వార్కుల స్థాయి నుంచి గరిష్ఠంగా కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాలబిలాల వరకు విస్తరించడానికి ప్రోదికూర్చింది సామాజికపుటoశాలే. నేలవిడిచి సాము చేయడం ఎంత అవాస్తవమో సమాజపుటావల సైన్సు ఉందనుకోవడం అంతే అవాస్తవం. సరిహద్దులు, జాతి, భాష, సంస్కృతి, లైంగికత వంటి విషయాలతో నిమిత్తం లేకుండా సకల లక్షణాల్ని, సార్వత్రికతను సాధించుకొన్నది, సంతరించుకొన్నది సమీక్షించుకొంటున్నది, సంరక్షించుకొంటున్నది శాస్త్రమే. అయినా శాస్త్ర సాంకేతిక ఫలితాలు వర్గ సమాజాల్లో అందరికీ ఒకే విధంగా ప్రయోజనకరంగా లేవు. సైన్సుకు వివక్షలేకున్నా, సాంకేతిక శాస్త్రాల ఉపయోగాల ఆచరణకు వర్గ విచక్షణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా నొప్పి, వేదన, కష్టం, దౌర్భాగ్య దుస్థితి, దైన్యత వంటి అనామోదిత లక్షణాల స్థానే సమ సమాజం, సార్వత్రిక వికాసం రావాలంటే ప్రజాసైన్సు ఉద్యమ కార్యాచరణ దిక్సూచి సాధనం. ఆ ఉద్యమాన్ని నడిపే రాజకీయ వేదికే రంగస్థలం. నేడు మతతత్వాన్ని పెంచుతున్న రాజకీయ నేపథ్యంలో శాస్త్రానికి ఆయువుపట్టు అయిన శాస్త్రీయత , శాస్త్రీయ దృక్పథం రుజువును కోరే హేతుబద్ధతలకు ఛాందస మేఘాలు ముసురుకొంటున్నాయి. సైన్సును కేవలం ఓ తంతులాగా భావించమంటున్నాయి. ఇది సైన్సు అభివృద్ధికి, సామాజిక ప్రగతికి ప్రతికూలం.* allikayala@gmail.com

జాతర - పూనకం


పూనకాలు రావడం, జాతర్లలో డప్పులకు అనుగుణంగా ఊగిపోతూ భక్తులు నృత్యాలు చేయడం వెనుక రహస్యం ఏమిటి?

      పూనకాలు, దయ్యంపట్టడం వంటివి పల్లెటూళ్ల లో విరివిగా చూస్తాము. తమాషా ఏమిటంటే ఈ పూనకాలు, దయ్యాలు బాగా డబ్బులున్నవాళ్లకు, పారిశ్రామికాధిపతులకు, ప్రొఫెసర్లకు, ఐఏఎస్‌ అధికార్లకు, శాస్త్రవేత్తలకు, రాజకీయనాయకులకు ఎప్పుడూ పట్టవు. వారెపుడూ పూనకాలతో ఊగిపోవడం మనం చూడం. ఎటొచ్చీ గ్రామీణుల్లోనూ, అందునా పేదవర్గాలలోనూ, ఇళ్లల్లో తాగుబోతులు, జూదగాళ్లు వున్నచోట్ల ఇలాంటి హడావిడి చూస్తాము. ముఖ్యంగా ఈ పూనకాలు స్త్రీలలో ఎక్కువ. ఇటీవల కాలంలో ఖమ్మం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కొందరు మహిళలు పూనకాలు వచ్చి, భవిష్యవాణిని వినిపిస్తూ మీడియాలో గొప్ప ప్రచారం పొందుతున్నారు. పూనకాలు లేదా దయ్యంపట్టడం ప్రధానంగా రెండు రకాలు.

ఒకటి : దొంగవేషాలు. మామూలుగా మాట్లాడితే ఎవరూ వినరని లేని పూనకానికి పూనుకుంటారు. దయ్యం పట్టినట్లు నటిస్తారు. మనసులో వున్న తిట్లు, శాపనా ర్థాలు, ఆందోళనలు, ఆలోచనలు, అవసరాలు బయటపెట్టేం దుకు దయ్యం పట్టడం, పూనకాలు ఆవహించడం వంటి ముసుగులో కేకలేస్తుంటారు. ఇలాంటి దయ్యాల్ని సుతారంగా నాలుగు బడితె దెబ్బలతో వదల గొట్టొచ్చు లేదా అడిగిన మాంసం కూరో, నగలో ఇచ్చి సంతృప్తిని కలిగించే కార్యక్రమమో చేస్తే దయ్యం మాయమవు తుంది. పూనకం పూర్తవుతుంది.

ఇక రెండోది: ఇది ఓ రకమైన మానసిక జబ్బు. మనస్సులో వున్న ఎన్నో కష్టాలు, ఆవేదనలు, అగచాట్లు మితిమీరినపుడు వారి అదుపాజ్ఞలు లేకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రకోపనాల న్నింటినీ కలిపి 'హిస్టీరియా' జబ్బు అంటాము. ఇది ముఖ్యంగా పీడిత మహిళల్లో గమనిస్తాము. రోజూ తాగి వచ్చి తన్నే భర్త, చదువు సంధ్యలు మానేసి బలదూరుగా తిరుగుతూ రోజూ వచ్చి ఇంట్లో అవీయివీ పట్టుకెళ్లి, జూదాల్లో, పోకిరీ వేషాల్లో పారేసుకొనే కొడుకులు, అత్తల ఆరళ్లు భరించలేక మానసికంగా ప్రతిక్షణం కుమిలిపోతున్నా ఏమి చేయలేని పరిస్థితి దాపురించినపుడు వారి అదుపాజ్ఞల్లో లేకుండానే మానసిక ప్రకోపనాలు ఏర్పడే అవకాశం ఉంది. అపుడపుడూ ఇలాంటి ప్రకోపనాలు మితిమీరి, వారు వింత ప్రవర్తనల్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి 'పూనకాల్ని', 'దయ్యం'పట్టడాల్ని మనం సానుభూతితో అర్థంచేసుకోవాలి. కాసేపు విశ్రాంతినివ్వాలి. పూనకం వచ్చిన వారిలోని మానసికస్థితిని మెరుగుపర్చేందుకు మానసిక వైద్యుణ్ణి సంప్రదించిగానీ, ఇంట్లో కష్టాల్ని కలిగించే అంశాల్ని కాస్తన్నా తగ్గించిగానీ స్వాంతన కలిగించాలి. ఇలాంటి పూనకాల్ని వేప మండలతో కొట్టి, చీపురుకట్టలతో బాది, వారిని హింసించి తగ్గించాలనుకోకూడదు. వాళ్లను పీడిస్తున్న దయ్యాలు ఎక్కడో లేవు. ఇంట్లో తాగుబోతు భర్తే పెద్దభూతం, ఆశల్ని అడియాసలు చేసిన కన్నకొడుకే కసాయి దయ్యం. కట్నం తేలేదని బాధించే అత్తమామలే అసురగణం. కుటుంబ సమస్యలు, ఆర్థిక అగచాట్లు, అప్పుల పీడనలే ఆమె పాలిట పిశాచాలు. ముందు ఆ దయ్యాల్ని, భూతాల్ని, అసురగణాల్ని, పిశాచాల్ని పొలిమేర దాటిస్తే ఎప్పటిలాగే ఆ మహిళలు బంగారు జీవితాన్ని పొందగలుగుతారు.

జాతర్లలో డప్పుల శబ్దాలకు అనుగుణంగా నృత్యాలు చేయడం మామూలే. లయబద్ధమైన సంగీతాలకు, వాయిద్యాలకు అనుగుణంగా పాదాలు తాడించడం, చేతులు కదిలించడం, దేహం మొత్తాన్ని అనునాదంగా ఊగించడం మానవ నైజం. సంగీతమనే బలానికి ప్రతిస్పందనే అలాంటి ప్రత్యానుభూత నృత్యాలు. వాటిని మనం అర్థంచేసుకోవాలి, ఆదరించాలి. అయితే మరీ విర్రవీగి అడ్డగోలుగా, లయ విరుద్ధంగా అసందర్భ భంగిమలతో హంగామా చేయడం మాత్రం మద్యపాన ఫలిత వికృతాకృతమే! ఇక్కడ దయ్యం, గియ్యం ఏమీ లేదు. బాగా కైపెక్కి కన్నూ, మిన్నూగానక చేసే వితండ తాండవమే అది. మద్యం కైపు తగ్గాక మధ్యలోనే నృత్యం కానిచ్చి నిష్క్రమించేసి కథ ముగిస్తారు.

శాస్త్ర విజ్ఞానం ప్రకారం దయ్యాలు లేవు. దయ్యాన్ని ఎవ్వరూ చూడలేదు. చూడలేరు కూడా. ఎందుకంటే అవి లేవు. మనుషులు చనిపోయాక ఆత్మలు దయ్యాలవుతాయని, తీరని కోర్కెల్ని తీర్చుకొనేందుకు అనువైన మనుషుల్ని ఆవహించి, అవసరాల్ని పరిపుష్టి చేసుకొన్నాకగానీ ఆ ఆత్మలు ఆవహించిన వారిని వదల వనీ, వారికి పట్టిన దయ్యాల్ని మంత్రగాళ్లు మంత్రాలతో, వేపాకు తాడనాలతో, పొగలతో, 'హాం, హీం, క్రీమ్‌, భ్రీమ్‌, హామ్‌..' వంటి భీకర శాపాలతో మాత్రమే వదలగొట్టగలరని భావించడం సోమరిపోతుల్ని ప్రోత్సహించడమే అవుతుంది.

సినిమాలలో, కథలలో, కొన్ని టీవీ ఛానళ్లలో చూపుతున్న దయ్యాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, పూర్వ జన్మ స్మృతులు, మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, బాణామతులు, చేతబడులు ఇవన్నీ అశాస్త్రీయ అమానుష ప్రక్రియలు. పనిగట్టుకొని దోపిడీశక్తులు, మతఛాందస భావ వ్యాప్తి సంతృప్త మనస్కులు చేసే విషప్రచారాలు మాత్రమే.
అవసరాలు తీరని ఆత్మలు ఏవైనా దయ్యం రూపంలో పేద, అమాయక ఆడవాళ్ళని ఆవహిస్తే ఆ దయ్యాలకేం లాభం? ఏదైనా గొప్ప మంత్రినో, గనుల సామ్రాజ్యరాజునో, సాగరతీరాల్ని కబళించి ప్రజల భూముల్ని కబ్జా చేసి వేలాది కోట్లు దండుకొనే సంపన్నులనో పట్టుకొంటే అన్ని కోర్కెలు క్షణాల్లో తీరతాయి. అభ్యుదయవాదులమందరం ఆ దయ్యాలకు ఈ విధమైన అర్జీపెట్టుకొందాం. అపుడు పేద మహిళలకు, గ్రామీణ రైతులకు పట్టిన దయ్యం వదులుతుంది.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య, సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

జీవ చైతన్యము


*మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. (బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా)*

దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రు నిర్ణయం తీసుకున్నారు.  అగ్ర కులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్ లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు.   సంజీవయ్య అవినీతిపరుడు అని, లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రు కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి.  సంజీవయ్య నీతి, నిజాయితీ కూలంకుషం గా ఎరిగిన నెహ్రు వారి ఫిర్యాదులను కొట్టి పారేశారు.  అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.  సరే, విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రు.  కొంతకాలం పాటు ఆ నిర్ణయం వాయిదా పడ్డది.


   అప్పుడు నెహ్రు తన ఆంతరంగిక మిత్రుడు అయిన ఓ నాయకుడిని ఆంద్ర వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు, నేటి ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ అయిన చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు.  సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు.  అయినప్పటికీ, ప్రధాని ఆదేశం కావడం తో వెళ్లాల్సిందే అన్నారు ఆయన.  


  ఇద్దరూ కలిసి సంజీవయ్య గారి గ్రామం వెళ్లారు కారులో.  గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి.  ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యి పై మట్టి కుండతో అన్నం వండుతున్నది.  పొగ గొట్టం తో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది.  "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు నాయకుడు.  "సంజీవయ్య గారి ఇల్లు ఇదే.  ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు.  కారు దిగండిఅన్నారు చక్రపాణి.  నాయకుడు నివ్వెరపోయాడు.  

  చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న  మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారుఅన్నారు.   

  ఆమె చెమటలు తుడుచుకుంటూ  "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు? ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది.  ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు"  అన్నది.  

  నాయకుడి నోట్లోంచి మాట రాలేదు.  "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?"  అడిగారు చక్రపాణి.  "అవసరం లేదు.  కారును హైద్రాబాద్ కు పోనీయండి"  అన్నాడు నాయకుడు.  


  ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తోలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు....